సీఎం ప‌ద‌వికి నితీశ్ రాజీనామా

జేడీయూ అధినేత,  బీహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్‌ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. ఆదివారం ఉదయం రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్‌ రాజేంద్ర అర్లేకర్‌కు తన రాజీనామా లేఖను సమర్పించారు. రాష్ట్రంలో తాము మహాకూటమితో పొత్తును తెంచుకోవాలని నిర్ణయించుకున్నామని ఆయన గవర్నర్‌కు తెలిపారు. ఉదయం జేడీయూ ఎమ్మెల్యేలతో సమావేశం అనంతరం నితీశ్‌ రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్‌కు రాజీనామా లేఖ ఇచ్చారు.
 
నితీశ్‌ రాజీనామాకు గవర్నర్‌ అర్లేకర్‌ ఆమోదం తెలిపారు. కొత్త ప్రభుత్వం కొలువుదీరేవరకు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగాలని సూచించారు. సీఎం పదవికి రాజీనామా చేసిన నితీశ్‌కుమార్‌ బీజేపీతో కలిసి రాష్ట్రంలో కొత్త త ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు స‌న్నాహాలు చేస్తున్నారు. జేడీయూ- బీజేపీ నేతృత్వంలో ఆదివారం సాయంత్రం నాటికి కొత్త ప్ర‌భుత్వం కొలువుదీరే అవ‌కాశం ఉంది.
తాజా పరిణామాల నేపథ్యంలో ఏం జరుగుతుందనేది మరి కొన్ని గంటల్లో తేలే అవకాశం ఉన్నది. గవర్నర్‌కు రాజీనామా లేఖ ఇచ్చిన అనంతరం నితీశ్‌కుమార్‌ మీడియాతో మాట్లాడారు. తాను గవర్నర్‌ను కలిసి సీఎం పదవికి రాజీనామా చేశానని, రాష్ట్ర ప్రభుత్వాన్ని రద్దు చేయాలని కోరానని తెలిపారు. దేశంలో ఇండియా  కూటమి బలహీన పడిందని వ్యాఖ్యానించారు. “నేను కుటమి కోసం పనిచేశాను. కూటమి ఏర్పడేలా చర్యలు తీసుకున్నాను. కానీ ఎవరు ఏ పని చేయడం లేదు,” అని విపక్ష ఇండియాపై పరోక్షంగా విమర్శలు గుప్పించారు.

“ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి, ఈ ప్రభుత్వాన్ని ముగించాను. నాకు అన్ని వైపుల నుంచి సూచనలు వస్తున్నాయి. గతంలో ఓ కూటమితో తెగదెంపులు చేసుకుని, ఇందులోకి వచ్చాను. కానీ ఇక్కడా పరిస్థితులు బాగాలేవు. అందుకే రాజీనామా చేశాను. మంత్రులు కలుస్తాము. త్వరలోనే ఓ నిర్ణయం తీసుకుంటాము,” అని రాజీనామా అనంతరం మాట్లాడుతూ నితీష్ కుమార్ చెప్పారు.

243 అసెంబ్లీ స్థానాలున్న బీహార్‌లో లాలూ ప్ర‌సాద్ యాద‌వ్ నేతృత్వంలోని ఆర్జేడీ అతిపెద్ద పార్టీగా మారింది. ఆర్జేడీ నుంచి 79 మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీకి ప్రాతినిధ్యం వ‌హిస్తున్నారు. మ‌రో వైపు 78 మంది ఎమ్మెల్యేల‌తో బీజేపీ రెండో అతిపెద్ద పార్టీగా ఉంది. జేడీయూకు కేవ‌లం 45 మంది స‌భ్యులు మాత్ర‌మే ఉన్నారు. 
 
ప్ర‌భుత్వ ఏర్పాటుకు 122 సీట్లు కావాలి. ఈ లెక్క‌న ఆర్జేడీకి ఇంకా 43 మంది స‌భ్యులు అవ‌స‌రం. జేడీయూ- బీజేపీ క‌లిస్తే వారి కూట‌మికి 123 మంది ఎమ్మెల్యేల బ‌లం ల‌భిస్తుంది. ప్ర‌భుత్వ ఏర్పాటుకు కావాల్సిన మేజిక్ ఫిగ‌ర్ స‌రిపోతోంది. దీంతో బీజేపీ-జేడీయూ ప్ర‌భుత్వ ఏర్పాటుకు ఢోకా ఉండ‌దు. 
ఇప్ప‌టికే బీజేపీ ఎమ్మెల్యేలు నితీశ్‌కు మ‌ద్ద‌తు తెలుపుతూ లేఖ‌లు ఇచ్చిన‌ట్లు మీడియాలో క‌థ‌నాలు వ‌చ్చాయి.
ఒక వేళ బీజేపీ- జేడీయూ కూట‌మి ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేస్తే బీజేపీ స‌భ్యులు ఆర్జేడీ మంత్రుల స్థానంలో ప్ర‌మాణం చేసే అవ‌కాశం ఉంది. మరోవైపు.. బీజేపీతో కలిసి సాయంత్రం 4 గంటలకు మళ్లీ ముఖ్యమంత్రిగా నితీశ్ కుమార్ ప్రమాణ స్వీకారం ఉంటుందని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. బిహార్ ముఖ్యమంత్రిగా 9వ సారి ఆయన ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
మరోవైపు జేడీయూ నేత నీరజ్‌ కుమార్‌ ఈ వ్యవహారంపై కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ ఆత్మ పరిశీలన చేసుకోవాలని సూచించారు. పాదయాత్రలో ఆయన ఎక్కడకు వెళ్లినా అడ్డంకులే ఎదురవుతున్నాయని, వ్యూహాల వైఫల్యంపై ఆయన సమీక్షించుకోవాలని హితవు చెప్పారు. మిత్రపక్షాలు ఎందుకు దూరమవుతున్నాయో ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు.