
అయోధ్యలో అత్యంత వైభవంగా ప్రారంభమైన రామ మందిర అంశాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం మన్ కీ బాత్‌లో ప్రస్తావించారు. మందిరం దేశ ప్రజలను ఎలా ఐక్యం చేసిందనే విషయాన్ని ఆయన హైలైట్ చేశారు. శ్రీరాముడి పాలన మన రాజ్యాంగ నిర్మాతలకు స్ఫూర్తిగా నిలిచిందని గుర్తుచేశారు. మన్ కీ బాత్ 109వ ఎడిషన్ సందర్భంగా అమృతోత్సవ కాలంలో మనమందరం 75వ గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నామని చెప్పారు.
అంతే కాకుండా సుప్రీంకోర్టు సైతం కూడా 75 సంవత్సరాలు పూర్తి చేసుకుంటోందని హర్షం వ్యక్తం చేశారు. లోతైన చర్చలతో రూపొందించబడిన భారత రాజ్యాంగంలోని మూడవ అధ్యాయంలో, భారత పౌరుల ప్రాథమిక హక్కులను వివరించడం జరిగిందని ప్రధాని చెప్పారు. ఈ క్రమంలో మన రాజ్యాంగ నిర్మాతలు శ్రీరాముడు, సీత, లక్ష్మణులను వర్ణిస్తూ ఆయా చిత్రాలను అధ్యాయ ప్రారంభంలో ఉంచడం ఆసక్తికరమని పేర్కొన్నారు.
అయోధ్యలో రాముడి విగ్రహానికి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం దేశం పౌరులను ఏకం చేసిందని చెప్పారు. దేశ ప్రజల మనోభావాలు ఒకేలా ఉన్నాయని, ప్రతి ఒక్కరి హృదయంలో రాముడు ఉన్నాడని చాటిచెప్పారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా దేశంలోని కోట్లాది మంది ప్రజలు వసుధైక కుటుంబం అనే భావనను చాటారని కొనియాడారు. అందరి మాటల్లో రాముడు – అందరి హృదయాల్లో రాముడు ఉన్నాడని ప్రధాని వ్యాఖ్యానించారు.
ఈ సమయంలో దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లోని ప్రజలు రామ భజనలు చేశారని, 22న సాయంత్రం దేశమంతటా రామ్ జ్యోతి వెలిగించి దీపావళి జరుపుకున్నారని గుర్తుచేశారు. ఇక ఈనెలలో జరిగిన రామాలయ ప్రారంభం, రిపబ్లిక్ డే పరేడ్, ఖేలో ఇండియా యూత్ గేమ్స్, పద్మా అవార్డ్స్ వంటి కీలక అంశాలను మోదీ తన మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రస్తావించారు.
రిపబ్లిక్ డే పరేడ్ అద్భుతంగా ఉంది జరిగిందని, మొత్తం 20 కవాతు కాంటెంజెంట్స్‌లో 11 మంది మహిళా కంటెంజెంట్లు, టేబుల్‌లాక్స్‌లో అందరు కళాకారులు కూడా మహిళలే ఉన్నారని, 1500 మంది సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొన్నారని ప్రధాని వివరించారు. శంఖం, నాదస్వరం వంటి భారతీయ సంగీత వాయిద్యాలనూ వాయించారని చెప్పారు.
దేశంలోని మహిళలు అన్ని రంగాల్లోనూ అద్భుతాలు సృష్టిస్తున్నారని చెబుతూ మహిళా స్వయం సహాయక సంఘాల ద్వారా వారు మరింత ప్రగతి సాధిస్తున్నారని కొనియాడారు. పెద్ద పెద్ద ఈవెంట్లలో మహిళా అథ్లెట్లు పాల్గొని దేశానికి అవార్డులు సాధించారని చెబుతూ ఈసారి 13 మంది మహిళా అథ్లెట్లకు అర్జున అవార్డుతో సత్కరించామని ప్రధాని గుర్తు చేశారు.
అట్టడుగు వర్గాలతో మమేకమై సమాజంలో మార్పు తీసుకురావడానికి కృషి చేసిన అనేక మందికి పద్మ అవార్డులు లభించాయని ప్రధాని నరేంద్ర మోదీ కొనియాడారు. పద్మ అవార్డులు ప్రజల అవార్డులుగా మారాయన్న ప్రధాని.. ఈ అవార్డుల ప్రదాన విధానంలో చాలా మార్పులు వచ్చాయని వెల్లడించారు. ఆయుర్వేదం, సిద్ధ, యూనాని పద్ధతుల ద్వారా దేశవిదేశాలకూ చికిత్స అందించే స్థాయికి ఎదిగామని ప్రశంసించారు.
More Stories
బెంగాల్ ప్రతిపక్ష నేత బడ్జెట్ సమావేశాల్లో సస్పెన్షన్
జాతీయ పార్టీల ఆదాయాలలో 74 శాతం బీజేపీకే
`చైనా శత్రువు’ కాదన్న పిట్రోడా వాఖ్యలపై దుమారం