రోడ్డు కోసం బిజెపి ఎమ్యెల్యే సొంత ఇల్లే నేలమట్టం

ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల సమయంలో తన సొంత మేనిఫెస్టోను ప్రకటించి నాటి ముఖ్యమంత్రి కేసీఆర్, ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిలను ఓడించి అందర్నీ సంభ్రమాశ్చర్యాలకు గురిచేసిన బిజెపి నాయకుడు, ప్రస్తుత కామారెడ్డి ఎంఎల్‌ఎ కాటిపల్లి వెంకట రమణారెడ్డి తాజాగా రోడ్డు విస్తరణ కోసం తన సొంత ఇంటినే కూల్చివేస్తూ ఆదర్శంగా నిలిచారు.
 
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని పాత బస్టాండ్ నుంచి రైల్వే గేటు వరకు పాత మాస్టర్ ప్లాన్ ప్రకారం 80 ఫీట్ల రోడ్డు నిర్మాణం చేయాల్సి ఉంది. ప్రస్తుతం 30 ఫీట్లు రోడ్డు మాత్రమే ఉంది. రోడ్డు వెడల్పు చేయడానికి వీలు లేకుండా అనేక మంది తమ నివాస గృహాలు నిర్మించుకున్నారు.  ఇళ్ల ముందు కుళాయి గుంతలు, షెడ్డులు ఏర్పాటు చేసుకున్నారు.
ఇదే రోడ్డులో ఎంఎల్‌ఎ కాటిపల్లి వెంకట రమణారెడ్డి ఇల్లుతోపాటు కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ ఇల్లు కూడా ఉంది. ట్రాఫిక్ పెరగడంతో ఈ ఏరియాలో పలు ఆక్రమణలతో రోడ్డు ఇరుగ్గా మారింది.  ఈ నేపథ్యంలో రోడ్డు వెడల్పు కోసం ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చేలా ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు.
తన సొంత ఇంటినే కూల్చేందుకు ముందుకు వచ్చారు. ప్రజా రవాణా సజావుగా సాగేందుకు అధికారుల సమక్షంలో ఆయన తన ఇంటిని, స్థలాన్ని కూలగొట్టించారు. సుమారు వెయ్యి గజాల స్థలం తో పాటు ఇల్లు కలిపి రూ. 6 కోట్ల విలువ ఉంటుందని అంచనా. దీనిని మున్సిపల్ అధికారులకు అప్పగించారు.
 
ప్రజా శ్రేయస్సే ధ్యేయంగా భావించిన ఆయన సొంత ఇంటితోనే రోడ్డు వెడల్పు పనులు జరిగేందుకు శ్రీకారం చుట్టి, తన దొడ్డ మనసును చాటుకున్నారు. ఇందులో భాగంగానే ఆయన తన ఇంటిని ఖాళీ చేసి రెండు వారాల క్రితమే ఎంఎల్‌ఎ క్యాంపు కార్యాలయానికి మకాం మార్చారు.  అదే రోడ్డులో పంచముఖి హనుమాన్ ఆలయం కూడా ఉండటంతో అలయానికి ఇబ్బంది కలగకుండా రోడ్డు పనులు చేపట్టాలని అధికారులకు సూచించారు.
అభివృద్ధికి ప్రజలు సహకరించాలని, వారం రోజుల్లో రోడ్డుపై ఉన్న కుళాయి గుంతలు, షెడ్డులు ప్రజలే స్వచ్ఛందంగా తొలగించుకోవాలని కోరారు. నెల రోజుల్లో ఇప్పుడున్న రోడ్డుకు అదనంగా మరొక 24 ఫీట్ల రోడ్డు నిర్మాణం చేయాలని అధికారులను ఆదేశించారు.  గత ఏడాది జరిగిన సవాళ్లు, ప్రతి సవాళ్లలో చెప్పినట్టుగానే రోడ్డు వెడల్పుకు అడ్డుగా ఉన్న తన సొంత ఇంటిని కూల్చేసి బీజేపీ ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి మాట నిలబెట్టుకున్నారు.
రోడ్డు పక్కన ఉన్న ఇంటి యజమానులు రోడ్డు వెడల్పు కోసం ఇండ్లను కూల్చేందుకు సహకరించాలని కోరారు. అయితే ఇప్పుడు పట్టణ ప్రజల దృష్టి కాంగ్రెస్ నేత మాజీ మంత్రి షబ్బీర్ అలీపై పడింది. దీనిపై షబ్బీర్ అలీ స్పందన ఎలా ఉంటుందోనని కామారెడ్డి పట్టణ ప్రజలు ఎదురుచూస్తున్నారు.