ఆస్ట్రేలియా ఓపెన్‌ మెన్స్‌ డబుల్స్‌ టైటిల్‌ బోపన్న కైవసం

నాలుగు పదుల వయసులో గ్రాండ్‌స్లామ్‌ టోర్నీ ఆడుతున్న భారత వెటరన్‌ టెన్నిస్‌ ఆటగాడు రోహన్‌ బోపన్న ఆస్ట్రేలియా ఓపెన్‌లో సరికొత్త చరిత్ర లిఖించాడు. 43 ఏండ్ల బోపన్న.. ఆస్ట్రేలియా ఆటగాడు మాథ్యూ ఎబ్డెన్‌తో కలిసి ఈ ఏడాది మెన్స్‌ డబుల్స్‌ టైటిల్‌ నెగ్గాడు. 
 
మెల్‌బోర్న్‌లోని రాడ్‌లీవర్‌ ఎరీనా వేదికగా ముగిసిన పురుషుల డబుల్స్‌ ఫైనల్స్‌లో రోహన్‌ బోపన్న – మాథ్యూ ఎబ్డెన్‌ జోడీ 7-6 (7-0), 7-5 తేడాతో సిమోన్‌ బొలెలి – ఆండ్రియా వవస్సోరి (ఇటలీ)పై గెలిచి టైటిల్‌ నెగ్గింది. బోపన్నకు తన సుదీర్ఘ కెరీర్‌లో ఇదే తొలి గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ కావడం విశేషం.

హోరాహోరీగా సాగిన ఈ ఫైనల్లో ఇటలీ జోడీ నుంచి బోపన్న జంట తీవ్ర పోటీని ఎదుర్కొంది.  తొలి పాయింట్ నుంచి ఇరు జోడీలు నువ్వా-నేనా అన్నట్లు తలపడ్డాయి. టై బ్రేక్‌‌కు దారి తీసిన తొలి సెట్‌ను సొంతం చేసుకున్న బోపన్న జోడీ.. రెండో సెట్‌లో కాస్త తడబడింది. 

ఓ దశలో రోహన్ జోడీ 3-4తో వెనకబడినా పుంజుకుంది. దాంతో నిర్ణయాత్మక మూడో సెట్‌కు దారితీస్తుందా? అనిపించింది. కానీ రోహిన్-ఎబ్డెన్ అద్భుతంగా పుంజుకొని రెండో సెట్‌ను 7-5తో సొంతం చేసుకొని విజేతగా నిలిచింది. ఇటీవలే కేంద్ర ప్రభుత్వం రోహన్ బోపన్నకు పద్మ పురస్కారం ప్రకటించింది.

భారత్‌ తరఫున మెన్స్‌ డబుల్స్‌ విభాగంలో 2012లో లియాండర్‌ పేస్‌ తర్వాత ఈ టోర్నీలో టైటిల్‌ నెగ్గిన తొలి భారతీయుడిగా బోపన్న రికార్డులకెక్కాడు. ఈ విజయం ద్వారా బోపన్న టెన్నిస్‌లో పలు ఘనతలు అందుకున్నాడు. 43 ఏండ్ల వయసులో మెన్స్‌ డబుల్స్‌ టైటిల్‌ నెగ్గిన బోపన్న  టెన్నిస్‌ ఓపెన్‌ ఎరాలో ఈ ఘనత సాధించిన అత్యంత పెద్ద వయస్కుడిగా రికార్డులకెక్కాడు. 
 
టెన్నిస్‌ చరిత్రలో ఇప్పటివరకూ అమెరికా టెన్నిస్‌ ప్లేయర్‌ మైక్‌ బ్రియాన్‌ (41 ఏండ్ల 76 రోజులు) పేరిట ఈ రికార్డు ఉండేది. ఆస్ట్రేలియా ఓపెన్‌ నెగ్గే రోజుకు బోపన్న వయసు 43 ఏండ్ల 329 రోజులు. బోపన్నకు ఇది మూడో గ్రాండ్‌ స్లామ్‌ ఫైనల్‌ కాగా విజేతగా నిలిచింది మాత్రం ఆస్ట్రేలియా ఓపెన్‌ – 2024లోనే కావడం విశేషం.
2010లో బోపన్న పాకిస్తాన్‌ ఆటగాడు ఐసమ్‌ ఉల్‌ హక్‌ ఖురేసితో కలిసి యూఎస్‌ ఓపెన్‌ ఫైనల్‌ చేరాడు. గతేడాది బోపన్న – ఎబ్డెన్‌ల ద్వయం యూఎస్‌ ఓపెన్‌ ఫైనల్‌లో ఓడింది.  కెరీర్‌లో తొలిసారి ఆస్ట్రేలియన్ ఓపెన్‌ను గెలిచిన రోహన్ బోపన్న 2017లో మిక్స్‌డ్ డబుల్స్‌లో ఫ్రెంచ్ ఓపెన్ విజేతగా నిలిచాడు. ఈ విజయం ద్వారా బోపన్న మెన్స్‌ డబుల్స్‌లో వరల్డ్‌ నెంబర్‌ వన్‌ ర్యాంకును సొంతం చేసుకోవడం విశేషం. భారత్‌ నుంచి ఈ ఘనత అందుకున్నవారిలో బోపన్న నాలుగో ఆటగాడు.

 భారత్‌ తరఫున మెన్స్‌ డబుల్స్‌ విభాగంలో 2012లో లియాండర్‌ పేస్‌ తర్వాత ఈ టోర్నీలో టైటిల్‌ నెగ్గిన తొలి భారతీయుడిగా బోపన్న రికార్డులకెక్కాడు. గతంలో లియాండర్‌ పేస్‌, మహేశ్‌ భూపతి, సానియా మీరజాలు ఈ ఘనత అందుకున్నారు. డబుల్స్ విభాగంలో బోపన్న సుమారు 60 సార్లు గ్రాండ్‌స్లామ్స్ టోర్నీలో పోటీ పడగా తొలిసారి అతనికి విజయం దక్కింది.