`ఇండియా’ కూటమిలో చీలికలకు కాంగ్రెస్‌దే బాధ్యత అని జెడియు అధికార ప్రతినిధి, రాజకీయ సలహాదారు కెసి త్యాగి స్పష్టం చేశారు. కాంగ్రెస్ మొండి వైఖరి కారణంగానే `ఇండియా’ కూటమి పతనం అంచుకు చేరిందని ఆయన తెలిపారు. పంజాబ్, పశ్చిమబెంగాల్, బీహార్‌లో ఇండియా కూటమి ముగిసిన వ్యవహారంగా స్పష్టం చేశారు.
అత్యంత శక్తి సామర్థ్యాలు కలిగిన బీజేపీని ఇండియా కూటమి పార్టీలు ఎలా ఎదుర్కోగలవని ఆయన ప్రశ్నించారు. పంజాబ్‌లో అకాలీదళ్, బిజెపి కలిసి అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని జోస్యం చెప్పారు. నితీశ్‌ను కాంగ్రెస్ పార్టీ అవమానించిందంటూ ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెసేతర పార్టీలను ఏకతాటిపైకి తీసుకురావడంలో నితీశ్ తీవ్రంగా కృషి చేశారని చెబుతూ కూటమిలో ఆయన ఎప్పుడూ పదవులు కోరుకోలేదని చెప్పారు.
అలాంటి నితీశ్ ప్రయత్నాలను కాంగ్రెస్ నేతలే తప్పుగా అర్థం చేసుకున్నారని, పదేపదే నితీశ్‌ను అవమానించారని ఆరోపించారు. పాట్నా వేదికగా వివిధ పార్టీలతో నితీశ్ కూటమి సమావేశం నిర్వహిస్తే.. ఆ తర్వాత ప్రక్రియంతా మందకొడిగా మారిందన్నారు. ఓ వైపు లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్నా కూటమి తరఫున ఉమ్మడి సమావేశం గానీ, ఎజెండా గానీ లేదని త్యాగి విమర్శించారు.
అలాగే `ఇండియా’ కూటమిలో ఉన్న కాంగ్రెస్, ఆప్‌ల మధ్య పోరు జరిగే అవకాశం ఉందని తెలిపారు. అదేవిధంగా అఖిలేష్ యాదవ్ కూడా కాంగ్రెస్ పార్టీపై అసంతృప్తిగా ఉన్నారని చెబుతూ ఈ పార్టీల నేతలంతా మరింత బాధ్యతాయుతంగా ప్రవర్తించాలని ఆయన సూచించారు.
‘ఇండియా’ వేదికలో భాగస్వామ్యమైన మరో పార్టీ తృణమూల్ కాంగ్రెస్. పశ్చిమబెంగాల్‌లో ఎన్నికైన టిఎంసి ప్రభుత్వాన్ని రాష్ట్రపతి పాలనకు అప్పగించాలని కాంగ్రెస్ నేతలు కోరుకునే దారుణ పరిస్థితి ఆ రాష్ట్రంలో ఉందని త్యాగి ఆరోపించారు. రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ యాత్రకు అనుమతి ఇవ్వకుండా మమతా బెనర్జీ వివాదాన్ని మరింత పెంచారని చెప్పారు.
ఇలా ఉండగా, శనివారం బీహార్‌లోని బక్సర్‌లో అభివృద్ధి పనుల శంకుస్థాపన కార్యక్రమంలో ముఖ్యమంత్రి నితీష్‌కుమార్‌తో కలిసి కేంద్ర మంత్రి అశ్విని కుమార్ చౌబే పాల్గొంటూ ఏది జరిగినా దేవుని కోరిక ప్రకారం జరుగుతుందని నర్మగర్భంగా చెప్పారు. మరోవంక, లోక్ జనశక్తి పార్టీ అధ్యక్షుడు చిరాగ్ పాశ్వాన్ కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో సమావేశమయ్యారు. మరోవైపు కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ 2025లో బీహార్‌లో బిజెపి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. 2025లో బిజెపి రాష్ట్ర ప్రజలు బిజెపికే ఓటు వేస్తారని సింగ్ భరోసా వ్యక్తం చేశారు.
More Stories
పార్లమెంట్లో ఎన్ఆర్ఐలకు ప్రాతినిధ్యం కల్పించాయి
మహాకుంభమేళలో ప్రత్యేక ఆకర్షణగా పూసలమ్మ మోనాలిసా
వన్డే ర్యాంకింగ్స్‌లో రెండో స్థానంలో స్మృతి మంధాన