సీఎం షిండే జోక్యంతో మరాఠా రిజర్వేషన్ దీక్ష విరమణ

ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే జోక్యం చేసుకొని తమ డిమాండ్లను ఆమోదించడంతో శుక్రవారం ప్రారంభించిన నిరాహారదీక్షను విరమిస్తున్నట్లు మరాఠా రిజర్వేషన్ ఉద్యమకారుడు మనోజ్ జరంగే పాటిల్ ప్రకటించారు. శనివారం ముఖ్యమంత్రి షిండే ఇచ్చే పండ్లరసం తీసుకొని దీక్ష విరమిస్తున్నట్లు తెలిపారు.
 
మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండే, మరాఠా కోటా కార్యకర్త మహేశ్ జరంగే పాటిల్ కలిసి నిరాహారదీక్ష శిబిరం వద్ద గల సభా వేదిక వద్దకు చేరుకుని నవీ ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కునాబీగా ఆధారాలు లభించిన 54 లక్షల మందికి కుంబీ సర్టిఫికెట్ ఇవ్వాలన్న డిమాండ్‌ను ప్రస్తావిస్తూ ఇ వారికి త్వరలోనే సర్టిఫికెట్లు అందజేస్తారని పాటిల్ తెలిపారు.
 
తొలుత తమ డిమాండ్ ను ఒప్పుకోనని పక్షంలో శనివారం ఉదయం నిరసనకారులు ముంబై వైపు ప్రదర్శనగా బయలుదేరాతారని పాటిల్ శుక్రవారం ఉదయం రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు.  రాష్ట్రంలో మరాఠా రిజర్వేషన్ల డిమాండ్‌పై పోలీసులు నమోదు చేసిన అన్ని కేసులను ఉపసంహరించుకోవాలని కూడా కోరారు.
 
కాగా, ఆమోదించిన ఆర్డినెన్స్‌లో అన్ని సమస్యలకు పరిష్కారం ఉందని, అందువల్ల నిరసనలను కొనసాగించాల్సిన అవసరం లేదని మహారాష్ట్ర మంత్రి మంగళ్ ప్రభాత్ లోధా సూచించారు. ‘‘మహారాష్ట్రలో మరాఠా రిజర్వేషన్ల కోసం మనోజ్ జరంగే పాటిల్ నేతృత్వంలో సాగిన ఉద్యమం నేడు ఒక పరిష్కారానికి చేరుకుంది. ఈరోజు ఆమోదించిన ఆర్డినెన్స్‌లో అన్ని సమస్యలకు పరిష్కారం ఉంది. ఈ విషయం మనోజ్ జరంగే పాటిల్ కూడా ప్రకటించారు” అని మంత్రి వెల్లడించారు.
 
పరిష్కారం లభించడంతో నిరసనలు కొనసాగించాల్సిన అవసరం లేదంటూ మనోజ్ జరంగే పాటిల్ నిరాహార దీక్షను సీఎం ఏక్‌నాథ్ షిండే పండ్లరసంతో శనివారం ముగించనున్నారని తెలిపారు.  మే 5, 2021న, మరాఠా రిజర్వేషన్‌ను మంజూరు చేసేటప్పుడు 50 శాతం రిజర్వేషన్‌లను ఉల్లంఘించడానికి సరైన కారణం లేదని పేర్కొన్న సుప్రీంకోర్టు, కళాశాలలు, ఉన్నత విద్యా సంస్థలు, ఉద్యోగాలలో మరాఠా కమ్యూనిటీకి రిజర్వేషన్‌లను కొట్టివేసింది.