చాయ్‌ దుకాణం ముందు గవర్నర్‌ బైఠాయింపు

కేరళలో అక్కడి ప్రభుత్వానికి, గవర్నర్‌ ఆరిఫ్‌ మహ్మద్‌ ఖాన్‌కు మధ్య నెలకొన్న వివాదం రోజురోజుకు మరింత తీవ్రమవుతోంది. శుక్రవారం 75వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన గవర్నర్‌ కేవలం 78 సెకన్‌లు మాత్రమే ప్రసంగించారు. ప్రభుత్వం ఇచ్చిన 60 పేజీల ప్రసంగాన్ని చదవకుండా పక్కన పడేశారు. 
 
దాంతో రాజ్‌భవన్‌లో జరిగిన ఎట్‌ హోమ్‌ను పినరయి విజయన్‌ సర్కారు బహిష్కరించింది. ఈ పరిణామాల నేపథ్యంలో శనివారం ఉదయం ఎస్ఎఫ్ఐ ఆందోళనకారులు కొల్లామ్‌లో గవర్నర్‌ కాన్వాయ్‌కి అడ్డుతగిలారు. యూనివర్సిటీ ఛాన్సెలర్ల నియామకానికి గవర్నర్‌ అడ్డుపుల్ల వేస్తున్నాడంటూ నల్లజెండాలు ప్రదర్శించారు. 
 
దాంతో ఆగ్రహించిన గవర్నర్‌ కారు దిగి ఆందోళనకారుల వైపు దూసుకెళ్లారు. దాంతో గవర్నర్‌ రక్షణగా పోలీసులు హ్యూమన్‌ షీల్డ్‌ ఏర్పాటు చేశారు. గవర్నర్‌ను తిరిగి కారులోకి రావాలని విజ్ఞప్తి చేశారు. కానీ గవర్నర్‌ అందుకు నిరాకరించారు. అక్కడే ఉన్న ఓ చాయి షాప్ లోని కుర్చీ తీసుకొని దానిపై కూర్చుంది పోయారు.
పోలీసుల వైఫల్యంవల్లే ఎస్ఎఫ్ఐ  కార్యకర్తలు తన కాన్వాయ్‌కి అడ్డుతగిలారని మండిపడుతూ వారిని అరెస్ట్ చేసేవరకు కదలబోనని స్పష్టం చేశారు.
ఈ ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. గవర్నర్‌ భద్రతను పెంచింది. రాజ్‌భవన్‌, గవర్నర్‌కు జెడ్‌ ప్లస్‌ భద్రతను కల్పిస్తూ కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది.
 
తన కాన్వాయ్‌ వెళ్లే మార్గంలో ఎస్ఎఫ్ఐ ఆందోళనకారులను ఎందుకు అనుమతించారని గవర్నర్‌ ప్రశ్నించారు. సీఎం కాన్వాయ్‌ వెళ్లే మార్గంలో ఇలాగే అనుమతిస్తారా? అని నిలదీశారు. పోలీసుల తీరును నిరసిస్తూ అక్కడే రోడ్డు పక్కన ఉన్న చాయ్‌ దుకాణం ముందు బైఠాయించారు. ఆందోళకారులపై చర్యలు తీసుకునే వరకు తాను ఇక్కడి నుంచి కదిలేదే లేదని తేల్చిచెప్పారు.
 
`నాకు రక్షణకోసం మిమ్ములను నియమించారు. కానీ నిరసనకారులు పోలీస్ రక్షణలోనే వచ్చి అడ్డు తగిలారు. మీరే శాంతిభద్రతలకు భగ్నం కలిగిస్తుంటే ఏమి చేయాలి?” అంటూ పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా లేదా మరెవరినైనా జోక్యం చేసుకొనేందుకు ఫోన్ చేయమని తన కార్యదర్శి అశోక్ ను ఆదేశించారు.

దాంతో పోలీసులు ఘటనకు సంబంధించి 12 మందిని అరెస్ట్‌ చేశామని గవర్నర్‌కు చెప్పారు. తన కాన్వాయ్‌కి 50 మందికి పైగా అడ్డుతగిలితే 12 మందినే ఎందుకు అరెస్ట్‌ చేశారని ఆయన ప్రశ్నించారు. మిగతా వాళ్ల సంగతేమిటని మండిపడ్డారు. ఆందోళనకారుల అరెస్ట్‌లకు సంబంధించి ఎఫ్ఐఆర్  కాపీలు చూపించాలని డిమాండ్ చేశారు. ఎఫ్‌ఐఆర్ కాపీని అందుకున్న ఖాన్, ఎఫ్‌ఐఆర్ ప్రకారం 17 మంది ఉన్నారని, ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు పోలీసులు వారిని తొలగించలేదని విమర్శించారు.

గతంలో కూడా ఒకసారి ఇటువంటి పరిస్థితులలోనే  గవర్నర్ ఖాన్ తన వాహనం దిగి తిరువనంతపురంలో ఎస్‌ఎఫ్‌ఐ ఆందోళనకారులతో తలపడ్డారు. ఖాన్ అప్పుడు ఢిల్లీకి బయలుదేరారు. మీడియా ప్రతినిధులతో ఖాన్ మాట్లాడుతూ, ఈ దాడుల వెనుక ముఖ్యమంత్రి హస్తం ఉందని ఆరోపించారు. రాష్ట్రంలో అధర్మాన్ని ప్రోత్సహిస్తున్న ముఖ్యమంత్రి ఆందోళనకారులకు మద్దతు ఇస్తున్నారని మండిపడ్డారు. నిరసనకారులు సీఎం దినసరి కూలీలని ఖాన్ ధ్వజమెత్తారు.