జ్ఞానవాపి నిర్మాణాన్ని హిందువులకు అప్పగించండి

* విశ్వహిందూ పరిషత్ డిమాండ్
భారత పురావస్తు సంఘం, నిపుణుల బృందం జరిపిన సర్వేలో గతంలో హిందూ దేవాలయంగా స్పష్టం కావడంతో కాశీలోని జ్ఞానవాపి నిర్మాణాన్ని హిందూవులకు అప్పగించాలని విశ్వహిందూ పరిషత్ వర్కింగ్ ప్రెసిడెంట్, సీనియర్ న్యాయవాది అలోక్ కుమార్ డిమాండ్ చేశారు.
 
 కాశీలో జ్ఞానవాపి విషయంపై విచారణ జరిపి జిల్లా న్యాయమూర్తికి సమర్పించిన నివేదిక విషయాన్ని ప్రస్తావిస్తూ జ్ఞానవాపి నిర్మాణం నుండి ఏఎస్ఐ సేకరించిన ఆధారాలు అద్భుతమైన ఆలయాన్ని కూల్చివేసి మసీదు నిర్మించినట్లు మళ్లీ నిర్ధారిస్తున్నాయని ఆయన స్పష్టం చేశారు. ఆలయ నిర్మాణంలో ఒక భాగం, ముఖ్యంగా పశ్చిమ గోడ హిందూ దేవాలయంలో మిగిలిన భాగం అని తెలిపారు.
 
మసీదు పరిధిని విస్తరించడానికి, సహన్ నిర్మాణంలో స్తంభాలు,  పైలస్టర్‌లతో సహా ముందుగా ఉన్న ఆలయంలోని భాగాలను మార్పులతో తిరిగి ఉపయోగించారని నివేదిక రుజువు చేస్తుందని ఆయన గుర్తు చేశారు. వాజుఖానా అని పిలవబడే శివలింగం నిర్మాణం మసీదు లక్షణాన్ని కలిగి లేదనడంలో సందేహం లేదని ఆయన తేల్చి చెప్పారు.
 
నిర్మాణంలో లభించిన శాసనాలలో జనార్దన, రుద్ర, ఉమేశ్వర వంటి పేర్లను గుర్తించడం ఇది ఆలయమని చెప్పడానికి నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. సేకరించిన సాక్ష్యాలు, ఏఎస్ఐ అందించిన నిర్ధారణలు ఈ ప్రార్థనా స్థలపు మతపరమైన స్వభావం 1947 ఆగస్టు 15వ తేదీన ఉనికిలో ఉందని, ప్రస్తుతం హిందూ దేవాలయం ఉన్నట్లు రుజువు చేస్తున్నాయని అలోక్ కుమార్ వెల్లడించారు.
 
కాబట్టి, పూజా స్థలాల చట్టం, 1991లోని సెక్షన్ 4 ప్రకారం కూడా, నిర్మాణాన్ని హిందూ దేవాలయంగా ప్రకటించాలని ఆయన స్పష్టం చేశారు. విశ్వహిందూ పరిషత్ ఈ సందర్భంగా చేసిన రెండు కీలకమైన డిమాండ్లను ఆయన ప్రస్తావించారు. 
 
(i) వాజుఖానా ప్రాంతంలో కనిపించే శివలింగానికి సేవ పూజ చేయడానికి హిందువులను అనుమతించాలి. 
 
(ii) జ్ఞాన్‌వాపి మసీదును గౌరవప్రదంగా మరొక సముచిత ప్రదేశానికి మార్చి,  కాశీ విశ్వనాథ దేవాలయంకు చెందిన అసలు స్థలాన్ని హిందూ సమాజానికి అప్పగించడానికి ఇంతేజామియా కమిటీ అంగీకరించాలి.
 
భారతదేశంలోని రెండు ప్రముఖ వర్గాల మధ్య స్నేహపూర్వక సంబంధాలను ఏర్పరచడానికి ఇటువంటి న్యాయపరమైన చర్య ఒక ముఖ్యమైన అడుగు కాగలదని విశ్వహిందూ పరిషత్ విశ్వసిస్తున్నట్లు అలోక్ కుమార్ తెలిపారు. 
ఇలా ఉండగా, కాశీ విశ్వనాథ్- జ్ఞానవాపి మసీదు కేసులో ముస్లిం తరపు న్యాయవాది ఇఖ్లాక్ అహ్మద్ ఆ స్థలంలో ఏఎస్ఐ సర్వే నివేదికలో హిందూ దేవాలయం ఉన్నట్లు సాక్ష్యం సూచించే వాదనలను తోసిపుచ్చారు. మసీదు సముదాయంలో “విరిగిన విగ్రహాలు” ఉండటం హిందూ దేవాలయానికి రుజువు కాదని చెప్పారు.
 
నార్త్ యార్డ్ గేట్ అని పిలువబడే మసీదులోని ఒక ప్రాంతం విగ్రహాలను చెక్కడంలో నిమగ్నమై ఉన్న అద్దెదారులకు వసతి కల్పిస్తుందని తెలిపారు. ఆ ప్రాంతాన్ని ఖాళీ చేయడానికి ముందు, విగ్రహ శిల్ప కార్యకలాపాల నుండి చెత్తను అక్కడ విస్మరించారని అహ్మద్ వివరించారు. పైగా, ఆవరణలో కనుగొనబడిన ఏ విగ్రహాలను కూడా శివుని ప్రాతినిధ్యాలుగా గుర్తించలేమని అహ్మద్ వాదిస్తున్నారు.