రాజకీయ కేంద్రాలుగా మారుతున్న యూనివర్సిటీలు

ఆంధ్రప్రదేశ్ లో విద్యా వ్యవస్థ గాడి తప్పిందని, విశ్వవిద్యాలయాలు రాజకీయ కేంద్రాలుగా మారుతున్నాయని మాజీ శాసనమండలి సభ్యులు, బిజెపి నేత పి.ఎ.ఎన్. మాధవ్ ఆవేదన వ్యక్తం చేశారు. విశాఖపట్నంలోని పౌర గ్రంథాలయంలో జన చైతన్య వేదిక ఆధ్వర్యంలో వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణ రెడ్డి అధ్యక్షత జరిగిన `గాడి తప్పిన విద్యా వ్యవస్థ’పై జరిగిన చర్చ గోష్టిలో  ప్రసంగిస్తూ మాతృభాషలోనే  విద్యా బోధన ఉండాలని స్పష్టం చేశారు. 

 ప్రభుత్వాలు  మాతృభాషలో అత్యున్నత విద్యాసంస్థలను ఏర్పాటుచేసి ఆదరించాలని ఆయన సూచించారు. వివిధ రాజకీయ భావజాలలుగా ఉన్నప్పటికీ  కేరళ , ఢిల్లీ, గుజరాత్ రాష్ట్రాలు విద్యారంగంలో అగ్రభాగాన ఉన్నాయని తెలియజేశారు. 

ప్రధాన వక్తగా విచ్చేసిన యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పూర్వఇంచార్జ్ చైర్మన్ ప్రొఫెసర్ కె. ఎస్. చలం ప్రసంగిస్తూ ప్రపంచంలో భారత దేశంలో తప్ప మిగిలిన అన్ని దేశాలలో ప్రాథమిక  విద్యను ఆయా ప్రభుత్వాలే అందిస్తున్నాయని తెలిపారు. విద్యారంగంలో ఉన్న అసమానతలే  వర్గసమాజాన్ని ప్రోత్సహిస్తున్నాయని చెప్పారు. 

స్థూల జాతీయ ఉత్పత్తిలో కనీసం ఆరు శాతం విద్యకు కల్పించాలని ఆరు దశాబ్దాల క్రితమే కొఠారి కమిషన్ పేర్కొన్న నేటికీ అమలు చేయలేదని వివరించారు. జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లం రెడ్డి లక్ష్మణ రెడ్డి అధ్యక్షత వహిస్తూ ఆంధ్రప్రదేశ్లో గత ఐదుసంవత్సరాలుగా ఒక్క టీచర్ను గాని ఒక అధ్యాపకుని గాని నియమించలేక పోవడం వలన విద్యా ప్రమాణాలు ఘోరంగా పడిపోయాయని విమర్శించారు. 

 సరైన ప్రణాళిక లేకుండా ప్రాథమిక విద్యలో పలు మార్పులు చేయడం వలన 7 లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాల నుండి మానుకున్నారని తెలిపారు. మూడు, నాలుగు, ఐదు తరగతుల పిల్లలను ఉన్నత పాఠశాలలకు పంపడం వలన లక్షలాదిమంది విద్యార్థులు విద్యకు దూరమయ్యారని పేర్కొన్నారు. 

టోఫెల్, ఐబీ, సీబీఎస్సీ, బైజుస్ లాంటి ప్రయోగాలు చేస్తూ విద్యార్థులలో అయోమయాన్ని రేకెత్తిస్తున్నారని వివరించారు. భారత దేశ  అక్షరాస్యతలో ఆంధ్రప్రదేశ్ 30వ స్థానంలో ఉందని, ఎయిడెడ్ విద్యాసంస్థలను రాష్ట్ర ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని ధ్వజమెత్తారు. 

 ఆంధ్ర విశ్వవిద్యాలయం పూర్వ రిజిస్ట్రార్ ఆచార్య వి. ఉమామహేశ్వరరావు,  ఆంధ్ర విశ్వవిద్యాలయ దూర విద్య కేంద్రం పూర్వ సంచాలకులు ప్రొఫెసర్ పి. హరి ప్రకాష్, కృష్ణ యూనివర్సిటీ పూర్వ ఉప కులపతి సుంకర రామకృష్ణ, ఆంధ్ర విశ్వవిద్యాలయాలలు మానవ వనరుల మేనేజ్మెంట్ విభాగ పూర్వ ఆచార్యులు కే. జాన్, సామాజిక కార్యకర్త నర్రా సీతామహాలక్ష్మి కూడా ప్రసంగించారు.