మా కుటుంబాన్ని చీల్చి కాంగ్రెస్ చెత్త రాజకీయాలు

కాంగ్రెస్ తమ కుటుంబాన్ని చీల్చి చెత్త రాజకీయాలు చేస్తుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆరోపించారు. తిరుపతిలో ఇండియా టుడే నిర్వహించిన ఎడ్యుకేషన్ సమ్మిట్ లో పాల్గొంటూ  గతంలో తమ బాబాయ్ వివేకానందరెడ్డిని తనపై పోటీ దింపారని గుర్తు చేశారు. రాష్ట్రాన్ని విభజించి అన్యాయం చేసిన కాంగ్రెస్ ఇప్పుడు తన కుటుంబాన్ని చీల్చేందుకు కుట్ర చేస్తుందని మండిపడ్డారు.

 ఏపీ పీసీసీ అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిలను నియమించడంపై స్పందిస్తూ తమ  కుటుంబాన్ని విభజించి పాలించాలనే కుట్ర చేస్తుందని ఆరోపించారు. విభజించి పాలించడం కాంగ్రెస్ నైజం అన్న సీఎం జగన్ వాళ్లకు దేవుడే గుణపాఠం చెబుతాడని స్పష్టం చేశారు. చరిత్ర నుంచి పాఠాలు నేర్చుకోని కాంగ్రెస్‌ ఇప్పుడు షర్మిలను నాపై ప్రయోగించిందని ధ్వజమెత్తారు.

చంద్రబాబు విషయంలో ప్రతీకారం తీర్చుకోవడం అన్నది లేనే లేదని సీఎం జగన్ స్పష్టం చేశారు. అవినీతి ఆరోపణలు, ఆధారాలతో కోర్టు ఆయనకు రిమాండ్ విధించిందని గుర్తు చేస్తూ సీఐడీ కేసులు పెట్టినా, కోర్టులు ఆధారాలు చూస్తాయని, సరైనా ఆధారాలు ఉంటేనే కోర్టులు ఆమోదిస్తామని తెలిపారు. ఇది ప్రతీకారం ఎలా అవుతుందని ప్రశ్నించారు.

 ఏపీలో కాంగ్రెస్, బీజేపీకి ఉనికి లేదని పేర్కొంటూ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ, టీడీపీ- జనసేన కూటమికి మధ్యే పోటీ ఉంటుందని తేల్చి చెప్పారు. ప్రతీ పార్టీ సర్వేల ఆధారంగా మార్పు చేర్పులు చేస్తుందని చెబుతూ సామాజిక సమీకరణాలు, స్థానిక పరిస్థితుల ఆధారంగా పార్టీలో కొన్ని మార్పులు చేస్తున్నట్లు సీఎం జగన్ తెలిపారు.

 కొందరు స్థానిక నేతలపై ప్రజలు అసంతృప్తితో ఉన్నారని, అలాంటి చోట్ల మార్పులు చేశామని పేర్కొంటూ ఎన్నికల దగ్గర్లో మార్పు చేర్పులు చేసి అయోమయం సృష్టించేకన్నా, ముందుగానే మార్పులు చేస్తున్నామని చెప్పారు. ప్రజా ప్రయోజనాల దృష్టిలో కేంద్ర ప్రభుత్వం సహకారంతో ముందుకు వెళ్తున్నామని తెలిపారు. 

అయితే, రాష్ట్ర ప్రయోజనాల విషయంలో ఎప్పుడూ రాజీపడలేదని జగన్ స్పష్టం చేశారు. ప్రతిపక్షాలు ఏవీ వైసీపీ ప్రభుత్వ పథకాల అమలు గురించి మాట్లడలేవని చెబుతూ  వివక్ష లేకుండా పారదర్శకతతో డీబీటీ అమలు చేస్తున్నామని చెప్పారు. ఏపీలో వైసీపీ తిరిగి అధికారంలోకి రావడం ఖాయమని సీఎం జగన్ ధీమా వ్యక్తం చేశారు. 

తన వల్ల మేలు జరిగిందని భావిస్తేనే ఓటు వేయమని ప్రజల్ని ధైర్యంగా అడుగుతున్నానని తెలిపారు. వైసీపీ ప్రభుత్వం విద్యా, వైద్య, పాలనా రంగాల్లో సంచలన మార్పులు తీసుకువచ్చిందని, అవినీతికి ఆస్కారంలేకుండా, పారదర్శకంగా పాలన చేస్తున్నామని చెప్పారు. అర్హత కలిగిన వారందరికీ ప్రభుత్వ పథకాలు అందిస్తున్నామని వివరించారు.