టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు రాజీనామాను ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం ఆమోదించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు చేసిన రాజీనామాను ఎట్టకేలకు అసెంబ్లీ స్పీకర్ ఆమోదించారు.
ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తన ఎమ్మెల్యే పదవికి చేసిన రాజీనామాను ఈనెల 22న ఆమోదించినట్టు అసెంబ్లీ సెక్రెటరీ మంగళవారం తెలిపారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను నిరసిస్తూ 2021, ఫిబ్రవరి 6న ఎమ్మెల్యే పదవికి గంటా శ్రీనివాసరావు రాజీనామా సమర్పించారు. అయితే స్పీకర్ ఫార్మేట్‌లో రాజీనామా ఇవ్వలేదని అధికార వైసీపీ నాయకులు ఆరోపించడంతో ఆయన మరోసారి రాజీనామా లేఖను ఇచ్చారు.
2021, ఫిబ్రవరి 12న కూర్మనపాలెం గేట్ దగ్గర కార్మిక సంఘాల రిలే నిరాహారదీక్ష సందర్భంగా మీడియా సమక్షంలో రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను శాసనసభ స్పీకర్‌కు అందజేయవల్సిందిగా జర్నలిస్టులను కోరారు. వెంటనే తన రాజీనామాను ఆమోదించాలని స్పీకర్‌కు విన్నవించారు. అయితే స్పీకర్ గంటా రాజీనామాను ఇప్పుడు ఆమోదించారు.
త్వరలో రాజ్యసభ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో టీడీపీకి ఇది చుక్కెదురే. రాజీనామా ఆమోదంతో రాజ్యసభ ఎన్నికల్లో గంటా శ్రీనివాసరావు తన ఓటు హక్కును వినియోగించుకునేందుకు అవకాశం లేకుండా పోయింది. గంటా శ్రీనివాసరావు కోరిక మేరకు రాజీనామా ఆమోదించినట్లు స్పీకర్ కార్యాలయం వెల్లడించింది.
మరోవైపు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు స్పీకర్ తమ్మినేని సీతారాం ఇప్పటికే నోటీసులు జారీ చేశారు. వైఎస్సార్‌సీపీ ఫిర్యాదు మేరకు ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవిలకు స్పీకర్ నోటీసులు జారీ చేశారు. ఈ నెల 25లోగా సమాధానం చెప్పాలని స్పష్టం చేశారు.
ఎమ్మెల్యేలు ఇచ్చిన సమాధానం ఆధారంగా స్పీకర్ చర్యలు తీసుకునే అవకాశం ఉంది.తొందర్లో రాష్ట్రం నుండి మూడు సీట్లకు జరిగే రాజ్యసభ ఎన్నికలలో మూడు సీట్లను వైసిపి గెలుచుకునే అవకాశం ఉన్నప్పటికీ గతంలో ఎమ్యెల్సీ ఎన్నికలలో మాదిరిగా ఎమ్యెల్యేలు క్రాస్ వోటింగ్ కు పాల్పడినా నష్టం లేకుండా చేసుకోవడం కోసమే దీర్ఘకాలంగా పట్టించుకోని ఎమ్యెల్యేల అనర్హత అంశంపై ఇప్పుడు దృష్టి సారించినట్లు కనిపిస్తుంది.
More Stories
అయోధ్య రామయ్యకు టిటిడి పట్టువస్త్రాలు
గిరిజనులు వ్యాపార రంగంలోకి రావాలి
ఏపీలో పెరుగుతున్న క్యాన్సర్ కేసులు