ప్రధానిపై ప్రశంసల జల్లు కురిపించిన కేంద్ర మంత్రివర్గం

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై కేంద్ర మంత్రివర్గం ప్రశంసల జల్లు కురిపించింది. బుధవారం ప్రధాని అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో కీలక తీర్మానాన్ని ఏకగ్రీవంగా సభ్యులందరూ ఆమోదించారు. అయోధ్య రామజన్మభూమి వద్ద ఆలయ నిర్మాణం, ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధాన మంత్రిని అభినందిస్తూ, ప్రశంసిస్తూ ఈ తీర్మానాన్ని మంత్రివర్గంలోని మంత్రులు ప్రవేశపెట్టి ఆమోదించారు.

ఆ తీర్మానం ఈ విధంగా ఉంది: బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠాపన సందర్భంగా మీ నాయకత్వాన్ని, మంత్రివర్గ సభ్యులందరం హృదయపూర్వకంగా అభినందిస్తున్నాం. భారతీయుల 5 శతాబ్దాల కలను మీరు నెరవేర్చారు. నేటి మంత్రివర్గం చరిత్రాత్మకం. చారిత్రాత్మక సంఘటనలు గతంలో చాలా జరిగి ఉండవచ్చు, కానీ బ్రిటీష్ కాలంలోని వైస్రాయ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ కాలాన్ని సైతం కలుపుకుని నేటి కేబినెట్ వ్యవస్థ ఏర్పడ్డ తర్వాత ఇలాంటి అవకాశం ఎప్పుడూ రాలేదు.

ఎందుకంటే 2024 జనవరి 22న మీ ద్వారా జరిగిన పని చరిత్రలో ప్రత్యేకమైనది. శతాబ్దాల తర్వాత ఈ అవకాశం వచ్చినందున ఇది ప్రత్యేకమైనది. 1947లో ఈ దేశానికి స్వాతంత్య్రం వచ్చింది. కానీ భారతీయ ఆత్మ ఇప్పుడు దేశంలో స్థిరపడిందని చెప్పొచ్చు. ఇది ప్రతి ఒక్కరికి ఆధ్యాత్మిక ఆనందాన్ని ఇచ్చింది.

శ్రీరాముడి ప్రాణప్రతిష్ఠాపన కోసం విధి మిమ్మల్ని ఎన్నుకుంది. మేము రాజకీయ దృక్కోణం నుంచి కాకుండా ఆధ్యాత్మిక దృక్కోణం నుంచి ఈ మాట చెబుతున్నాం. ఈ సందర్భంగా దేశంలోని అత్యున్నత మంత్రివర్గంలో మేమంతా ఉండటం మా అందరి అదృష్టం. మీ చర్యల ద్వారా మీరు ఈ దేశం నైతికతను, సాంస్కృతిక విశ్వాసాన్ని బలోపేతం చేశారు. 

ఆలయ ప్రారంభోత్సవ వేడుకలో దేశవ్యాప్తంగా ఉద్వేగభరితమైన భావోద్వేగాలను మనం ప్రజల నుంచి ఇదివరకు ఎప్పుడూ చూడలేదు. ఎమర్జెన్సీ సమయంలో కూడా ప్రజల మధ్య ఐక్యతను చూశాము, అయితే ఆ ఐక్యత నియంతృత్వానికి వ్యతిరేకంగా ప్రతిఘటన ఉద్యమంగా ఉద్భవించింది. రాముడి కోసం మనం చేసిన ప్రజా ఉద్యమం కొత్త శకానికి నాంది.

దీని కోసం దేశప్రజలు శతాబ్దాలుగా ఎదురుచూశారు. ఈరోజు రామమందిరంలో శ్రీరాముని ప్రతిష్ఠాపనతో కొత్త శకం ప్రారంభమైంది. ఆచారానికి బాధ్యత వహించే వ్యక్తిని భగవంతుడు ఆశీర్వదించినప్పుడే ఇంత పెద్ద కార్యాలు సాధ్యపడతాయి. తులసీదాస్ రచనల్లో శ్రీరాముడి దీవెన పొందినవాడు అందరి దీవెనలు పొందుతారని పేర్కొన్నారు. 

శ్రీరామ జన్మభూమి ఉద్యమం స్వతంత్ర భారతదేశంలో మొత్తం ప్రజలందరినీ ఏకం చేసిన గొప్ప ఉద్యమం. కోట్లాది మంది భారతీయుల నిరీక్షణ, భావోద్వేగాలు దీనితో ముడిపడి ఉన్నాయి. మీరు 11 రోజుల పాటు అనుష్ఠానం పాటించి, భారతదేశంలోని శ్రీరామునికి సంబంధించిన పవిత్ర స్థలాలను సందర్శించి, పూజించడం ద్వారా భారత దేశ జాతీయ సమైక్యతకు శక్తిని అందించారు.

ఇందుకు కేబినెట్ సభ్యులుగానే కాకుండా సాధారణ పౌరుడిగా కూడా మిమ్మల్ని అభినందిస్తున్నాం. ప్రజల నుంచి మీకు అందుతున్న ప్రేమను పరిగణనలోకి తీసుకుంటే, మీరు కేవలం ప్రజా నాయకుడు మాత్రమే కాదు, ఇప్పుడు ఈ కొత్త శకం ప్రారంభమైన తర్వాత, ఆ కొత్త శకానికి మార్గదర్శకుడిగా కూడా ఎదిగారు.

మీకు ధన్యవాదాలు, వేనవేల శుభాకాంక్షలు. భవిష్యత్తులో మీ నాయకత్వంలో మన దేశం మరింత ముందుకు సాగుతుంది. ఈ ఆలయం ప్రారంభోత్సవం సందర్భంగా మీరు మాట్లాడుతూ “జనవరి 22న సూర్యుడు అద్భుతమైన ప్రకాశాన్ని తెచ్చాడు. ఇది క్యాలెండర్‌లో రాసిన తేదీ మాత్రమే కాదు, కొత్త కాలచక్రానికి ప్రారంభం. బానిస మనస్తత్వాన్ని బద్దలుకొట్టి పైకి ఎదుగుతున్న దేశం, గతం యొక్క ప్రతి కాటు నుండి ధైర్యం పొందుతున్న దేశం ఈ విధంగా కొత్త చరిత్రను సృష్టిస్తుంది” అని చెప్పారు. 

“ఇప్పటి నుంచి వెయ్యి సంవత్సరాల తరువాత కూడా ప్రజలు ఈ తేదీని, ఈ క్షణాన్ని గుర్తుంచుకుంటారు. అలాగే చర్చించుకుంటారు. ఆ మహత్తక ఘట్టాన్ని ప్రత్యక్షంగా చూడడం, ఆ క్షణంలో మనం జీవించి ఉండడం రాముడి గొప్ప ఆశీర్వాదం. నేడు రోజులు, దిక్కులు, దూరాలు… అన్నీ దైవత్వంతో నిండిపోయాయి. ఇది మామూలు సమయం కాదు. ఇవి శాశ్వతమైన సిరాతో కాలచక్రంలో చెక్కబడిన చెరగని స్మృతి రేఖలు.” అని పేర్కొన్నారు.

అందుకే నేటి క్యాబినెట్‌ని క్యాబినెట్ ఆఫ్ ది మిలీనియం అని కూడా పిలుస్తారంటే అతిశయోక్తి కాదు. దీని కోసం మేమంతా మిమ్మల్ని అభినందిస్తున్నాము. అలాగే ఒకరినొకరు అభినందించుకుంటున్నాము”.