లోక్‌సభ ఎన్నికలయ్యాక రాహుల్‌ అరెస్టు

లోక్‌సభ ఎన్నికల తర్వాత రాహుల్‌గాంధీ అరెస్టు అవుతారని అసోం సీఎం హిమంతబిశ్వశర్మ వెల్లడించారు. భారత్‌ జోడో న్యాయ్‌ యాత్రకు అనుమతించకపోయినప్పటికీ బారికేడ్లను తొలగించుకుని గువాహటి గుండా వెళ్లేందుకు ప్రయత్నించడంతో పోలీసులకు, కాంగెస్‌ కార్యకర్తలకు మధ్య మంగళవారం ఘర్షణ జరిగిన విషయం తెలిసిందే.
 
ఈ విషయాన్ని హిమంత బిశ్వశర్మ ఎక్స్‌ ద్వారా వెల్లడించారు: ‘హింసాత్మక ఘటనలు, రెచ్చగొట్టడం, ప్రజల ఆస్తులకు నష్టం కలిగించడం, పోలీస్‌ సిబ్బందిపై దాడి వంటి చర్యలకు కారణమైన కాంగ్రెస్‌ నేతలు రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్, కన్హయ్య కుమార్ సహా ఇతర వ్యక్తులపై పోలీసులు కేసు నమోదు చేశారు’.
యాత్ర పేరుతో అస్సాంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించడమే కాంగ్రెస్‌ ఉద్దేశమని ఆయన ఆరోపించారు. లోక్‌సభ ఎన్నికల తర్వాత రాహుల్‌ గాంధీని అరెస్ట్‌ చేస్తామని సీఎం స్పష్టం చేశారు. ఈ వ్యవహారంలో సమగ్రమైన దర్యాప్తు కోసం కేసును సీఐడీకి అప్పగిస్తున్నట్లు రాష్ట్ర  డీజీపీ జీపీసింగ్‌ వెల్లడించారు.
 
మరోవైపు సీఎం ఆదేశాల మేరకు కాంగ్రెస్‌ నేతల చర్యలను సుమోటోగా తీసుకొని కేసు నమోదు చేశామని గువాహటి పోలీస్‌ కమిషనర్‌ దిగంత బోరా చెప్పారు. ‘భారత్‌ జోడో న్యాయ్‌ యాత్ర’ను నగరంలోని రద్దీ ప్రాంతాల్లో నిర్వహించవద్దని ఆదేశించినా కాంగ్రెస్‌ నేతలు పట్టించుకోలేదని, నిర్దేశిత మార్గాన్ని వదిలేసి నగరంలోపలికి వచ్చేందుకు ప్రయత్నించారని, నాయకుల తీరుతో కార్యకర్తలు రెచ్చిపోయి పోలీసులపై దాడికి పాల్పడ్డారని, అందుకే వారిపై కేసులు నమోదు చేశామని తెలిపారు. కాంగ్రెస్‌ దాడిలో నలుగురు పోలీసులు గాయపడ్డారని చెప్పారు.