తిరిగి బిజెపిలోకి మాజీ సీఎం జగదీష్‌ శెట్టర్‌

కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీకి గట్టి షాక్‌ తగిలింది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు భారతీయ జనతా పార్టీని వీడి హస్తం పార్టీలోకి చేరిన ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, రాజకీయ కురువృద్ధుడు జగదీష్‌ శెట్టర్‌ తాజాగా తిరిగి బీజేపీలో చేరారు. గురువారం ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, ఇతర పార్టీ పెద్దలతో సమావేశం అనంతరం ఆయన పార్టీ కండువా కప్పుకున్నారు.
 
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ముందు జగదీష్‌ శెట్టర్‌ బీజేపీని వీడారు. కంచుకోట అయిన హుబ్లీ- ధార్వాడ సెంట్రల్‌ నియోజకవర్గం టికెట్‌ను బీజేపీ నిరాకరించడంతో ఆ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. తాను నిర్మించిన బీజేపీ తన పట్ల దుర్మార్గంగా ప్రవర్తించిందని, పార్టీ నుంచి బలవంతంగా తనను వెళ్లగొట్టారని ఆ సందర్భంగా విమర్శించారు. 
 
లింగాయత్‌ నేతల్లో అత్యంత ప్రముఖుడైన జగదీష్‌ శెట్టర్‌, బీజేపీని వీడి ఆ పార్టీకి ఎన్నికలలో నష్టం కలిగించినప్పటికీ తన స్థానాన్ని మాత్రం నిలబెట్టుకోలేక పోయారు. ఆ ఎన్నికల్లో 34,000 కంటే ఎక్కువ ఓట్లతో బీజేపీ అభ్యర్థి చేతిలో ఘోర పరాభవాన్ని చవిచూశారు. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ఆయనను ఎమ్యెల్సీగా చేశారు.
 
ఇప్పుడు కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి బిఎస్ యడ్యూరప్ప, కేంద్ర మంత్రులు భూపేంద్ర యాదవ్, రాజీవ్ చంద్రశేఖర్, రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బిఎస్ విజయేంద్రల సమక్షంలో బీజేపీలో చేరారు. చాలామంది శ్రేయోభిలాషులు తనను తిరిగి పార్టీలో చేరమని కోరడంతో, జాతీయ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని తిరిగి బీజేపీలో చేరుతున్నట్లు ఆయన చెప్పారు.
 
“గతంలో పార్టీ నాకు అనేక బాధ్యతలు అప్పచెప్పింది. కొన్ని కారణాలతో నేను గత ఏడాది కాంగ్రెస్ లో చేరాను. అయితే నన్ను తిరిగి రమ్మనమని చాలామంది కోరుతున్నారు. నరేంద్ర మోదీని తిరిగి ప్రధానమంత్రిగా చేయాలనే బలమైన అభిలాషతో నేను తిరిగి పార్టీలో చేరుతున్నాను” అని తెలిపారు.  ఏడు సార్లు ఎమ్యెల్యేగా ఎన్నికైన ఆయన 2012- 2013ల మధ్య 10 నెలలపాటు ముఖ్యమంత్రిగా పనిచేశారు. రాష్ట్ర బిజెపి అధ్యక్షునిగా, కర్ణాటక అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా పలు బాధ్యతలు నిర్వహించారు.
 
అయితే, ఈ పరిణామం పట్ల కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య, ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ విస్మయం వ్యక్తం చేశారు. “బిజెపి ఆయనను అవమానపరిస్తే కాంగ్రెస్ గౌరవించింది. బిజెపి సీట్ నిరాకరిస్తే ఎమ్యెల్యేగా ఓటమి చేసిందా ఐదేళ్లపాటు ఉండేవిధంగా ఎమ్యెల్సీగా చేసింది” అని గుర్తు చేశారు.