దేశాన్ని అభివృద్ధి చేసే బాధ్యత యువతపైనే

భారతదేశ భవిష్యత్ ను నిర్ణయించేది యువ ఓటర్లేనని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు.  జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా బిజెపి యువమోర్చ ఆధ్వర్యంలో యువ ఓటర్లతో ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రధాని వర్చువల్ గా ప్రసంగిస్తూ గత పదేళ్లలో తమ ప్రభుత్వం దేశాన్ని అంధకారం నుంచి బయటికి తీసుకొచ్చిందని తెలిపారు. రాబోయే 25 ఏళ్లలో దేశాన్ని అభివృద్ధి చేసే బాధ్యత యువతపైనే ఉందని చెప్పారు. 

కుటుంబ పాలన, బంధు ప్రీతి ప్రాధాన్యంగా కొన్ని పార్టీలు రాజకీయాల్లో యువత ఎదుగుదలను అడ్డుకున్నాయని ఆయన ధ్వజమెత్తారు. ఓటు హక్కుతో మీరందరూ కుటుంబ పార్టీలను ఓడించాలని అంటూ ఆయన యువతకు పిలుపిచ్చారు. బజెపి అధికారంలోకి వచ్చిన తరువాత అవకాశాల గురించి యువత చర్చించుకుంటోందని చెప్పారు. 2047 నాటికి దేశాన్ని విక‌సిత్ భార‌త్‌గా మ‌ల‌చాల‌న్న‌దే త‌మ ల‌క్ష్య‌మ‌ని స్ప‌ష్టం చేశారు. 

పదేళ్లకు ముందు వారి భవిష్యత్ ను అప్పటి ప్రభుత్వాలు అంధకారంలోకి నెట్టేశాయని పేర్కొంటూ డిజిటల్ ఇండియా, స్టార్టప్ నినాదంతో మనం అవకాశాలు కల్పించామని గుర్తు చేశారు.  “మీ కలలను నెరవేర్చడమే నా లక్ష్యం” అంటూ  “మోదీ గ్యారెంటీ ప్రధాని”  అని భరోసా ఇచ్చారు. కేంద్రంలో పదేళ్లుగా స్థిరమైన ప్రభుత్వం అధికారంలో ఉండటం వల్లనే ఆర్టికల్ 370, జీఎస్టీ అమలు, మహిళా బిల్లు, ట్రిపుల్ తలాక్ వంటి ఎన్నో సమస్యలకు పరిష్కారం లభించిందని ప్రధాని తెలిపారు.

వేగంగా అభివృద్ధి చెందడంతో పాటు సరైన దిశలో వెళ్లటానికి అందరూ కలిసి రావాలని పిలుపునిచ్చారు. ఓటు అనేది అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తుందని చెప్పారు. ఓటరుగా పేర్లు నమోదు చేసుకొని శక్తివంతమైన వ్యక్తిగా మారాలని చెబుతూ 25 ఏళ్ల తరువాత దేశ భవిష్యత్‌ను మార్చే శక్తి దేశ ప్రజలకే ఉందని స్పష్టం చేశారు. 

రైతుల బాగు కోసం ప్రభుత్వం
కాగా, రైతుల బాగు కోసం త‌మ ప్ర‌భుత్వం పాటుప‌డుతుంద‌ని, వ్య‌వ‌సాయాన్ని లాభ‌సాటిగా మార్చేందుకు సేద్యాన్ని టెక్నాల‌జీతో అనుసంధానించేందుకు చ‌ర్య‌లు చేప‌డుతున్నామ‌ని ప్ర‌ధాని మోదీ తెలిపారు. పశ్చిమ ఉత్తర ప్రదేశ్ లో  గురువారం రూ. 19,000 కోట్ల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టుల‌ను ప్ర‌ధాని ప్రారంభిస్తూ దేశ ప్ర‌తిష్ట‌ను స‌మున్న‌త శిఖ‌రాల‌కు చేర్చాల్సిన స‌మ‌యం ఆస‌న్న‌మైంద‌ని అయోధ్య‌లో నూత‌న రామాల‌య ప్రారంభోత్స‌వ వేడుక‌ను ప్ర‌స్తావిస్తూ పేర్కొన్నారు.

మ‌నం దేవుడి నుంచి దేశానికి, రామ్ నుంచి రాష్ట్రానికి ప‌య‌నం సాగించాల‌ని తెలిపారు.  యూపీ శ‌ర‌వేగంగా అభివృద్ధి చెంద‌కుండా అభివృద్ధి చెందిన భార‌త్‌ను ఆవిష్క‌రించ‌లేమ‌ని పేర్కొంటూ దేశానికి స్వాతంత్రం సిద్ధించి చాలా కాల‌మైనా అభివృద్ధి కొన్ని ప్రాంతాల‌కే ప‌రిమిత‌మైంద‌ని, దేశంలోని చాలా భాగం అభివృద్ధికి దూరంగా ఉంద‌ని ప్ర‌ధాని మోదీ ఆందోళ‌న వ్య‌క్తం చేశారు.

పాల‌కుల అల‌క్ష్యంతో అధిక జ‌నాభా క‌లిగిన యూపీ అభివృద్ధిని విస్మ‌రించార‌ని దుయ్య‌బ‌ట్టారు.  రైల్వేలు, హైవేలు, పెట్రోలియం పైప్‌లైన్‌లు, వాట‌ర్ స‌ప్లై ప్రాజెక్టుల అప్‌గ్రేడ్‌తో పాటు మెడిక‌ల్ కాలేజీల‌ను ప్రారంభించుకుంటున్నామ‌ని చెప్పారు. య‌మున‌, రామ్‌గంగా న‌దుల ప్ర‌క్షాళ‌న ప్రాజెక్టులు ప్రారంభ‌మ‌య్యాయ‌ని వివరించారు.