`స్నేహపూర్వక’ పోలీస్ కు దేశంలోనే పేరుపొందామని చెప్పుకొనే తెలంగాణ పోలీసులు విద్యార్థునులపై దౌర్జన్యంగా విరుచుకు పడటమే కాకుండా పరిగెత్తుతున్న అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఎబివిపి) రాష్ట్ర కార్యదర్శి ఝాన్సీరాణి వెంటపడి, ఆమె జుట్టుపట్టి లాగుతూ, స్కూటీపై పడిపోయిన ఆమెను ఈడ్చుకొంటూ తీసుకెళ్లిన దృశ్యం విభ్రాంతి కలిగిస్తుంది.
శాంతియుతంగా నిరసన చేస్తున్న ఏబీవీపీ మహిళా కార్యకర్తపై పోలీసులు ప్రవర్తించిన తీరు విమర్శలకు దారితీసింది. రాజేంద్రనగర్ వ్యవసాయ ఉద్యాన వర్సిటీ భూములను హైకోర్టు నిర్మాణానికి ప్రభుత్వం జారీ చేసిన జీవో 55ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ రాజేంద్రనగర్‌లోని వ్యవసాయ యూనివర్సిటీలో కొన్ని రోజులుగా శాంతియుత నిరసనలు జరుగుతున్నాయి.
వారికి ఏబీవీసీ నేతలు మద్దతిస్తూ నిరసన చేపట్టారు. ఇందులో భాగంగా బుధవారం మధ్యాహ్నం 1:30 గంటల సమయంలో రాష్ట్ర కార్యదర్శి ఝాన్షి రాణి ప్రసంగిస్తూ యూనివర్సిటీ భూములను హైకోర్టుకు ఇవ్వొద్దంటూ డిమాండ్ చేశారు. అప్పుడే రంగప్రవేశం చేసిన పోలీసులు శాంతియుతంగా నిరసన చేస్తున్న విద్యార్థులను చెదరగొట్టారు.
ఈ క్రమంలో ఝాన్షిరాణి వారిని తప్పించుకొని పరిగెత్తుతుండగా, స్కూటీపై వెంబడించిన ఇద్దరు మహిళా పోలీసులు ఆమె జుట్టు పట్టుకొని ఈడ్చుకెళ్లారు. దానితో ఆమె అదుపు తప్పి రోడ్డుపై కుప్పకూలినా, ఆమె జుట్టు వదలకుండా ముందుకు లాక్కెళ్లారు. దీంతో ఆమెకు చేతులు, కాళ్లు, శరీరముందు భాగంలో గాయాలయ్యాయి.
‘ఇదేం పద్ధతి?’ అని ఆ బాధిత యువతి కంటతడి పెట్టుకుంటూ ప్రశ్నించగా, ఇట్లనే ఉంటది సీన్ అంటూ ఆ కానిస్టేబుల్ నిర్లక్ష్యంగా సమాధానం ఇవ్వటం గమనార్హం. ఈ ఘటనపై ప్రజలు తీవ్రంగా మండిపడ్డారు. సోషల్ మీడియాలోనూ నెటిజన్లు ప్రభుత్వం, పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆ విద్యార్థిని ఏం అడిగింది? యూనివర్సిటీకి చెందిన భూములను ఇతర నిర్మాణాలకు ఇవ్వొద్దని కోరింది.
ఇందులో ఆమెకు సొంతంగా ఒనగూరేది ఇసుమంతైనా ఉన్నదా? లేదు. రేపటి తరానికి భరోసానిచ్చేలా వ్యవసాయ యూనివర్సిటీ ఉండాలనేదే ఆమె ఆకాంక్ష.
తమ ప్రభుత్వంలో ఎవరైనా నిరసన తెలుపవచ్చని ఒక వంక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భరోసా ఇస్తుండగా, పోలీసుల ప్రవర్తన సిగ్గుచేటుగా మారింది. అమ్మాయి అని కూడా చూడకుండా గొరగొర ఈడ్చుకెళ్లటమా? అని విమర్శలు చెలరేగుతున్నాయి.
నాడు తెలంగాణ ఉద్యమ సందర్భంలోనూ కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థులపై పోలీసుకాండ కొనసాగించిందని, హాస్టళ్లలోకి చొరబడి లైట్లు ఆర్పేసి అమ్మాయిపైనా లాఠీలతో విరుచుకుపడ్డారని గుర్తుచేస్తున్నారు. పదేండ్ల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వంలో పోలీసులు మరోసారి మళ్లీ కఠినత్వానికి తెరలేపారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సదరు మహిళా కానిస్టేబుళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
దేశానికి అన్నం పెట్టే వ్యవసాయ యూనివర్సిటీ భూములతో రియల్ వ్యాపారం చేయడం సిగ్గు చేటని ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి ఝాన్సీ మండిపడ్డారు. పర్యావరణానికి దోహదపడుతున్న జీవరాశిని కాపాడాల్సిన పాలకులే, నాశనం చేయాలని చూస్తే సహించేది లేదని ఆమె హెచ్చరించారు. నిరసన చేపట్టిన విద్యార్థులను గూండాలుగా చూస్తారా? అని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.
మరోవైపు, రాజేంద్రనగర్ వర్సిటీ వద్ద ఓ విద్యార్థిని పట్ల ఇద్దరు మహిళా పోలీసులు అనుసరించిన తీరుపై విచారణ జరుపుతున్నామని, దర్యాప్తు అనంతరం బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటామని పోలీస్ కమిషనర్ అవినాష్ మహంతి తెలిపారు. కాగా, నిరసనల్లో వ్యవసాయ వర్సిటీ విద్యార్థులతో పాటు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న నాగర్ కర్నూల్ జిల్లా పాలెం, సిరిసిల్ల, వరంగల్, ఆదిలాబాద్, వరంగల్, సిరిసిల్ల, అశ్వారావుపేట, జగిత్యాల, ఆదిలాబాద్, సంగారెడ్డి వ్యవసాయ కాలేజీల విద్యార్థులు పాల్గొన్నారు.
ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పోలీసు తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థినిపై పోలీసుల దాడి అమానుషమని బీఆర్ఎస్ కవిత మండిపడ్డారు. ఇది తీవ్రంగా ఆందోళన కలిగించే అంశమని, ప్రజాస్వామ్యంలో ఇలాంటివి ఆమోదయోగ్యం కాదని ఆమె స్పష్టం చేశారు.
ఇలా ఉండగా, ఏబీవీపీ మహిళా కార్యకర్తను జుట్టుపట్టిలాగిన పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని బీజేపీ డిమాండ్ చేసింది. వ్యవసాయ యూనివర్సిటీ భూములు హైకోర్టుకు కేటాయించవద్దని ఆందోళనకు దిగిన వాళ్లను తరిమికొట్టడమే గాకుండా, రోడ్డున వెళ్తున్న విద్యార్థి నాయకురాలి జుట్టు లాగిన పోలీసుల పైశాచికత్వం పట్ల ఆగ్రహం వ్యక్తం చేసింది. సాటి ఆడవారి పట్ల కనీస మర్యాద పాటించని పోలీసుల చర్యను ఖండిస్తూ ఈ ఘటన అప్రజాస్వామిక, విద్యార్థి వ్యతిరేక ప్రభుత్వ చర్యలను ప్రతిబింబిస్తోందని విమర్శించింది.
More Stories
ఈ సమావేశాల్లోనే జమిలి ఎన్నికల బిల్లు
బాంగ్లాలో హిందువులపై మారణకాండ పట్ల భారత్ చర్యలు చేపట్టాలి
భగవద్గీతలోని సర్వకాలీన విజ్ఞానం