అయోధ్యలో కొలువుదీరనున్న మరో రెండు రాముడి విగ్రహాలు

రామ మందిరంలో ప్రతిష్టించిన బాలరాముడి విగ్రహంతోపాటు మరో రెండు విగ్రహాలు కూడా కొలువుదీరనున్నాయి. కర్ణాటకకు చెందిన శిల్పి అరుణ్ యోగిరాజ్ చెక్కిన నల్ల గ్రానైట్ రామ్‌ లల్లా విగ్రహాన్ని సోమవారం గర్భ గుడిలో ప్రతిష్టించారు. అలాగే ఇప్పటి వరకు టెంట్‌లో పూజలందుకున్న అసలైన రాముడి చిన్న విగ్రహాన్ని కూడా గర్భగుడిలో ఉంచారు. 
 
రామ మందిరంలో ప్రాణ ప్రతిష్ఠ నిర్వహించేందుకు శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ 3 విగ్రహాలను తయారు చేయించింది. కర్ణాటకకే చెందిన మరో శిల్పి గణేష్ భట్ చెక్కిన బాల రాముడి విగ్రహానికి చెందిన ఫోటో ప్రస్తుతం వైరల్ అవుతోంది. గణేష్ భట్ కూడా కృష్ణ శిలతోనే బాల రాముడి విగ్రహాన్ని తయారు చేశారు.
కర్నాటకలోని మైసూర్‌లో హెగడదేవనా కోటే ప్రాంతంలోని వ్యవసాయ భూమిలో దొరికిన నల్ల రాయితో ఈ విగ్రహాన్ని రూపొందించారు. కృష్ణ శిలా అని పిలిచే నల్లని రాతితో చెక్కిన ఈ రామ్‌ లల్లా విగ్రహం కూడా ఎంతో ఆకట్టుకుంటున్నది.
 
ఇక మరో విగ్రహాన్ని రాజస్థాన్‌లోని జైపూర్‌కు చెందిన సత్యనారాయణ పాండే అనే శిల్పి తయారు చేశారు. తెల్లని మక్రానా పాలరాతితో రూపొందించిన ఆ విగ్రహానికి సంబంధించిన ఫోటోలు ఇప్పటికే విడుదల అయ్యాయి.  పాలరాతి నగలు, దుస్తులు ధరించిన రామ్‌ లల్లా కూడా విల్లు, బాణాన్ని కలిగి ఉన్నాడు. అలాగే విష్ణువు అవతారాలను సూచించే చిన్న శిల్పాలతో ఈ విగ్రహం కూడి ఉంది.
 
ఈ మూడు విగ్రహాలు కూడా ఒకే ఎత్తులో 51 అంగుళాలు ఉండేలా చెక్కాలని శిల్పులకు శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ సూచించింది.  తయారుచేయించిన 3 విగ్రహాల్లో ఒకటి అయోధ్య గర్భగుడిలో ప్రతిష్ఠించగా, మరో రెండు విగ్రహాలు ప్రస్తుతం శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ వద్దే ఉన్నాయి. ఆ విగ్రహాలను అయోధ్య ఆలయంలోనే ప్రతిష్ఠించనున్నట్లు ఇప్పటికే ట్రస్ట్ వర్గాలు వెల్లడించాయి. 
 
అయోధ్య ఆలయాన్ని మొత్తం 3 అంతస్థుల్లో నిర్మిస్తుండగా ప్రధాన గర్భగుడి గ్రౌండ్ ఫ్లోర్‌లో ఏర్పాటు చేశారు. గర్భగుడిలో కొలువుతీరని ఈ రెండు రాముడి విగ్రహాలను రామ మందిరంలోని మొదటి, రెండో అంతస్తులో ప్రతిష్టాపన చేస్తామని ఆలయ అధికారులు వెల్లడించారు.