మార్చి వరకూ కేంద్ర మంత్రులు అయోధ్యకు వెళ్లొద్దు

జన్మభూమిలో కొలువుదీరిన అయోధ్య రాముడి దర్శనాలకు భారీగా తరలివస్తున్నారు. ఈ నేపథ్యంలో క్యాబినెట్ సహచరులు ఎవ్వరూ మార్చి వరకూ అయోధ్యకు వెళ్లాలనే ప్రణాళికలను విరమించుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ సూచించారని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ప్రాణ ప్రతిష్ట కార్యక్రమంలో సహితం మంత్రులు ఎవ్వరూ పాల్గొనకలేక పోయారు.
 
సామాన్య భక్తులు అయోధ్యకు భారీ సంఖ్యలో తరలి వెళ్తున్నారని, వారికి ఇబ్బంది కలిగించొద్దని ప్రధాని కోరినట్టు ఆ వర్గాలు తెలిపాయి. కేంద్ర మంత్రులు లాంటి వీఐపీలు వెళ్తే ప్రోటోకాల్స్ కారణంగా భక్తులకు ఇబ్బందులు తలెత్తుతాయని ప్రధాని మోదీ సూచించారని సమాచారం. సాధ్యమైనంత మేర ఫిబ్రవరి చివరి వరకూ వాయిదా వేసుకోవాలని, మార్చిలో రామయ్య దర్శనానికి వెళ్తే బాగుంటుందని చెప్పారు. ఆ సమయానికి దేశ వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో భక్తులు అయోధ్యలో రాముడి దివ్వ స్వరూపాన్ని దర్శించుకుంటారని కేంద్ర మంత్రులకు మోదీ సలహా ఇచ్చారు. 
 
సామాన్యులకు దర్శనం సమయంలో ఎలాంటి ఇబ్బందులు కలగకూడదని ప్రధాని మోదీ భావించారని సమాచారం.  అలాగే అయోధ్యలోని రామ మందిరంలో సోమవారం జరిగిన ప్రాణప్రతిష్ట కార్యక్రమం, ప్రజల స్పందన గురించి కేబినెట్‌ మంత్రులను ఆయన ఆరా తీశారు.

 
ఇలా ఉండగా, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై కేంద్ర మంత్రివర్గం ప్రశంసల జల్లు కురిపించింది. బుధవారం ప్రధాని అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో కీలక తీర్మానాన్ని ఏకగ్రీవంగా సభ్యులందరూ ఆమోదించారు. అయోధ్య రామజన్మభూమి వద్ద ఆలయ నిర్మాణం, ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధాన మంత్రిని అభినందిస్తూ, ప్రశంసిస్తూ ఈ తీర్మానాన్ని మంత్రివర్గంలోని మంత్రులు ప్రవేశపెట్టి ఆమోదించారు.
” బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠాపన సందర్భంగా మీ నాయకత్వాన్ని, మంత్రివర్గ సభ్యులందరం హృదయపూర్వకంగా అభినందిస్తున్నాం. భారతీయుల 5 శతాబ్దాల కలను మీరు నెరవేర్చారు. నేటి మంత్రివర్గం చరిత్రాత్మకం. చారిత్రాత్మక సంఘటనలు గతంలో చాలా జరిగి ఉండవచ్చు, కానీ బ్రిటీష్ కాలంలోని వైస్రాయ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ కాలాన్ని సైతం కలుపుకుని నేటి కేబినెట్ వ్యవస్థ ఏర్పడ్డ తర్వాత ఇలాంటి అవకాశం ఎప్పుడూ రాలేదు” అంటూ తీర్మానించారు

కాగా, మంగళవారం నుంచి అయోధ్యలో సామాన్యులకు దర్శనాలు ప్రారంభమయ్యాయి. మొదటి రోజు 5 లక్షల మంది దర్శించుకున్నట్టు శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ వెల్లడించింది. బుధవారం 3 లక్షల మంది ఆలయం వద్ద క్యూలైన్‌లో ఉన్నారు. దీంతో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటుచేశారు.

భక్తుల రద్దీ నేపథ్యంలో ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అధికారులతో అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసి సమీక్ష జరిపారు.  ముఖ్యమంత్రి ఆదేశంపై రద్దీని నియంత్రించేందుకు ఎనిమిది చోట్ల మెజిస్ట్రేట్ లను నియమించారు. భక్తుల రద్దీ బాగా పెరుగడంతో అయోధ్యకు బస్సు సర్వీసులను కూడా నిలిపివేశారు.

‘దేశం నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు అయోధ్య ధామానికి తరలివస్తున్నారు. తమ ఆరాధ్య దైవం శ్రీరాముని దర్శనం కోసం ఆసక్తిగా ఉన్నారు. అసాధారణమైన రద్దీ నేపథ్యంలో వీఐపీలు, ప్రముఖులు తమ సందర్శనను షెడ్యూల్‌ను ఒక వారం ముందుగానే స్థానిక అధికారులు, శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ లేదా యూపీ ప్రభుత్వానికి తెలియజేయడం సముచితంగా ఉంటుంది’ అని ఓ ప్రకటనలో  ముఖ్యమంత్రి పేర్కొన్నారు.
 
రద్దీని దృష్టిలో ఉంచుకుని దర్శనం వేళలు పెంచేందుకు అధికారులు నిర్ణయించారు. ఇంతవరకూ రాత్రి 7 గంటల వరకూ ఉన్న దర్శన వేళలను 10 గంటల వరకూ పొడిగించారు. 29వ తేదీ వరకూ ఆన్‌లైన్ బుకింగ్‌లను నిలిపేశారు.