అయోధ్య “బాలక్ రామ్‌”కు భారీ విరాళాలు

ఓ వైపు అయోధ్యకు భక్తులు తరలివస్తుండగా.. మరోవైపు అదే రీతిలో విరాళాలు సైతం పోటెత్తుతున్నాయి. ప్రాణప్రతిష్ట తర్వాత లక్షలాదిగా భక్తులు అయోధ్యకు వస్తున్నారు. బాలక్ రామ్ దర్శనం చేసుకుంటున్నారు. దీంతో అయోధ్య వీధులన్నీ జై శ్రీరామ్ నినాదాలతో మార్మోగుతున్నాయి. ఇటు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తుండటంతో.. దర్శన వేళలను కూడా సవరించారు. గతంలో ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 11.30 గంటల వరకు ఆ తర్వాత మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు అనుమతి ఉండగా.. ఇక నుంచి ఉదయం 7 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు నిరాటంకంగా దర్శనాలకు అవకాశం ఇస్తున్నారు. తొలిరోజు ఏకంగా 5 లక్షల మంది రామదర్శనం చేసుకున్నారు. మూడో రోజు కూడా భక్తుల రద్దీ ఏ మాత్రం తగ్గలేదు. ఆలయ ప్రాంగణమే కాదు.. అయోధ్య వీధులన్నీ భక్తులతో నిండిపోయాయి.
మరోవైపు భారీగా వస్తున్న భక్తుల నుంచి అయోధ్య రామయ్యకు కానుకలు సైతం భారీగా అందుతున్నాయి. ఆలయంలో ఏర్పాటు చేసిన కౌంటర్లు, ఆన్‌లైన్‌ ద్వారా తొలిరోజు రూ.3.17 కోట్ల విరాళాలు అందినట్లు రామమందిరం ట్రస్టు తెలిపింది. ఇందుకోసం 10 కౌంటర్లు ఏర్పాటు చేసినట్లు రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు సభ్యుడు అనిల్‌ మిశ్రా పేర్కొన్నారు.