జ్ఞానవాపి కింద హిందూ ఆలయం

ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో జ్ఞానవాపి మసీదు కేసులో సంచలన అంశాలు బయటకు వచ్చాయి. పురాతన హిందూ దేవాలయం స్థానంలోనే జ్ఞానవాపి మసీదును నిర్మించారని భారత పురావస్తు శాఖ (ఏఎస్‌ఐ) తేల్చింది. మసీదు కింద దేవాలయపు ఆనవాళ్లు ఉన్నాయని పేర్కొంది.  స్థల వివాదంపై కోర్టుకెక్కిన హిందువులు, ముస్లింలకు సర్వే వివరాలను అందించాలన్న కోర్టు ఆదేశం మేరకు ఏఎస్‌ఐ తన 839 పేజీల నివేదికను అందజేసింది.
ఈ నివేదికలోని ముఖ్యాంశాలను హిందువుల తరఫున కోర్టులో వాదిస్తున్న న్యాయవాది విష్ణు శంకర్‌ జైన్‌ గురువారం వెల్లడించారు.  పురావస్తు శాఖ నివేదికను ఆయన మీడియా ముందు చదివి వినిపించారు. పురావస్తు శాఖ నివేదిక.. మసీదు ఆవరణలో భారీ హిందూ దేవాలయం ఉనికిని సూచిస్తున్నదని పేర్కొన్నారు. అంతకుముందున్న దేవాలయంపైనే ప్రస్తుతమున్న కట్టడం (మసీదు)ను నిర్మించారని తెలిపారు.

ఇందుకు తగిన అనేక ఆధారాలను పురావస్తు శాఖ తన నివేదికలో పొందుపరిచిందని చెప్పారు. ఆ ప్రదేశంలోని అనేక చారిత్రక నిర్మాణపు పొరలకు సంబంధించి పురావస్తు శాఖ పలు ప్రశ్నలను లేవనెత్తిందని పేర్కొన్నారు. స్వల్పంగా మార్పులు చేర్పులు చేసి దేవాలయపు స్తంభాలను, ప్లాస్టర్‌ను మసీదు నిర్మాణానికి వాడుకున్నారని తెలిపారు.

దేవాలయపు స్తంభాలపై ఉన్న కళాకృతులను చెరిపివేసినట్టు పురావస్తు శాఖ పేర్కొందని వెల్లడించారు. పురాతన దేవాలయానికి సంబంధించిన శాసనాలు కూడా ఆ ఆవరణలో లభించాయని, అవి దేవనాగరి, తెలుగు, కన్నడతోపాటు ఇతర భాషల్లో ఉన్నాయని తెలిపారు.  ప్రస్తుతమున్న కట్టడం (మసీదు), అంతకుముందు కట్టడంపై అనేక శాసనాలను గమనించామని పురావస్తు శాఖ తెలిపిందని చెప్పారు.

మొత్తంగా ప్రస్తుత సర్వేలో 34 శాసనాలు, 32 ముద్రలున్న పత్రాలు బయటపడ్డాయని చెప్పారు. దేవాలయానికి సంబంధించిన ఓ బండరాయిపై శాసనాలు కనిపించాయని, ఆ రాయిని మసీదు నిర్మాణంలో, ఆ తరువాత మరమ్మతు సమయంలో కూడా వాడుకున్నారని తెలిపారు.  దీనిని బట్టి పూర్వ నిర్మాణాన్ని కూల్చివేసి దానికి సంబంధించిన కొన్ని భాగాలను నూతన (మసీదు) నిర్మాణంలో వాడుకున్నట్టు తెలుస్తున్నదని చెప్పారు.

ఆ శాసనాలలో ‘జనార్దన’, ‘రుద్ర’, ‘ఉమేశ్వర’ అనే దేవతల పేర్లు కనిపించాయని చెప్పారు. తామర పతకానికి ఇరువైపులా చెక్కిన వ్యాల బొమ్మలను చెరిపివేశారని తెలిపారు. ఆలయం మూలల్లో ఉన్న బండరాళ్లను తొలగించి, ఆ స్థలాన్ని పువ్వుల ఆకృతులతో నింపివేశారని చెప్పారు. వారణాసిలోని కాశీ విశ్వనాథుని ఆలయం పక్కనున్న జ్ఞానవాపి మసీదుపై పురావస్తు శాఖ నిర్వహించిన సర్వేకు సంబంధించిన నివేదికను హిందువులకు, ముస్లింలకు అందజేయాలని స్థానిక కోర్టు బుధవారం ఆదేశించింది. 

ప్రస్తుతమున్న 17వ శతాబ్దం నాటి జ్ఞానవాపి మసీదును అంతకుముందున్న దేవాలయాన్ని కూల్చివేసి నిర్మించారని ఆరోపిస్తూ కొందరు హిందువులు దాఖలుచేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన వారణాసి కోర్టు పురావస్తు శాఖ సర్వేకు ఆదేశించింది. పూర్వమున్న హిందూ దేవాలయాన్ని కూల్చివేసి మసీదును నిర్మించారా లేదా అన్నది తేల్చేందుకు పురావస్తు శాఖ గత ఏడాది జ్ఞానవాపి మసీదు ఆవరణలో శాస్త్రీయ సర్వే నిర్వహించింది.