రామ మందిర నిర్మాణం చరిత్రలో నిలిచిపోతుంది

రామ మందిర నిర్మాణం చరిత్రలో నిలిచిపోతుంది

The President of India, Smt Droupadi Murmu addressing to the Nation on the eve of the 75th Republic Day celebrations via video conferencing on January 25, 2024.

అయోధ్యలో నిర్మించిన రామ మందిర నిర్మాణ ఘట్టం చరిత్రలో నిలిచిపోతుందని గణతంత్ర దినోత్సవం సందర్భంగా గురువారం రాత్రి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇచ్చిన సందేశంలో పేర్కొన్నారు. అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవం భారత్‌ తన పురాతన నాగరికత వారసత్వాన్ని పునరుజ్జీవింపజేసుకున్న అద్భుత క్షణంగా నిలిచిపోతుందని ఆమె తెలిపారు. 
 
దేశ 75 వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని జాతినుద్దేశిస్తూ రాష్ట్రపతి ముర్ము ప్రసంగిస్తూ అయోధ్యలో రామాలయ కేవలం ప్రజల విశ్వాసాలను మాత్రమే కాకుండా దేశంలో న్యాయవ్యవస్థపై ప్రజలకు ఉన్న విశ్వాసానికీ నిదర్శనమని తెలిపారు.  ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల మధ్య తలెత్తిన ఘర్షణలు, సంక్షోభాలు, యుద్ధాలపై రాష్ట్రపతి తీవ్ర ఆందోళన వ్యక్తంచేశారు.
ఆ ఘర్షణలకు మూలాలను వెతికి పరిష్కరించకుండా భయం, విద్వేషంతో ఆయా దేశాల ప్రజలు కాలం వెళ్లదీస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. పాశ్చాత్య దేశాల విధానాలతో పోలిస్తే మన దేశ ప్రజాస్వామ్యం ఎంతో పురాతనమైందని, అందుకే భారత్‌ను ప్రజాస్వామ్యానికి తల్లిగా పిలుస్తారని రాష్ట్రపతి తెలిపారు. 
 
ఢిల్లీలో జీ 20 శిఖరాగ్ర సదస్సు నిర్వహించడం ద్వారా  ప్రపంచ వేదికపై భారత్ తన సత్తాను చాటిందని ఆమె కొనియాడారు. వ్యూహాత్మక, దౌత్య అంశాలపై ఈ సదస్సులో భారత్ ఏకాభిప్రాయాన్ని తీసుకురావడంలో విజయవంతమైందని చెప్పారు. ఈ సమయంలోనే ఆరోగ్యకరమైన ఆర్థిక వ్యవస్థ దిశగా భారత్‌ ముందుకు సాగుతోందని పేర్కొంటూ గ్లోబల్‌ సౌత్‌కు భారత్‌ గొంతుకగా నిలిచిందని చెప్పారు.
 
ఆయుష్మాన్‌ భారత్‌ ద్వారా పేదలు, అణగారిన వర్గాల వారికి ఆరోగ్య భరోసా లభించిందని ఆమె తెలిపారు. సామాజిక న్యాయంలో భారతరత్నకు ఎంపికైన బిహార్ మాజీ సీఎం కర్పూరీ ఠాకుర్‌ ఛాంపియన్‌గా నిలిచారని అంటూ ఆయనపై ప్రశంసల వర్షం కురిపించారు. అంతర్జాతీయ క్రీడల్లో మహిళా క్రీడాకారుల ప్రతిభ అసమానమని కొనియాడారు. 
 
పారిస్‌ ఒలింపిక్స్‌లోనూ వారు సరికొత్త మైలు రాయిని చేరుకుంటారని ఆశిస్తున్నట్లు తెలిపారు. భారతీయ ప్రాచీన విజ్ఞత అంతర్జాతీయ పర్యావరణ సంక్షోభాన్ని పరిష్కరించగలదని నమ్మకం ఆమె వ్యక్తం చేశారు. ఇక ఇటీవల కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నారీ శక్తి వందన్‌ అధినియం (మహిళా రిజర్వేషన్ల బిల్లు) మహిళల సాధికారతలో విప్లవాత్మక ఆయుధంగా పని చేయనుందని రాష్త్రపతి ఆశాభావం వ్యక్తం చేశారు.
 
స్వాతంత్ర్యం సాధించి 75 ఏళ్లు పూర్తయ్యాయని, ఇక శత స్వాతంత్రోత్సవాల దిశగా భారత్ అడుగులేస్తోందని రాష్ట్రపతి గుర్తు చేశారు. అందుకే రాబోయే 25 ఏళ్ల అమృత్‌ కాలంలో సర్వతోముఖాభివృద్ధి సాధించి అభివృద్ధి చెందిన భారత్‌గా మార్చాల్సిన బాధ్యత దేశ పౌరులదేనని ఆమె పిలుపునిచ్చారు. దేశంలో ప్రజలు ప్రాథమిక హక్కుల గురించి మాత్రమే మాట్లాడితే సరిపోదని, ప్రాథమిక విధులు కూడ ఖచ్చితంగా నిర్వర్తిస్తూ బాధ్యతగా మెలిగినప్పుడే భారత్‌ అభివృద్ది చెందుతుందని గతంలో మహాత్మా గాంధీ చెప్పిన విషయాలను ముర్ము గుర్తు చేశారు.

ఈ 25 ఏళ్ల అమృత కాలంలో దేశంలో, ప్రపంచంలో భారీ సాంకేతిక మార్పు జరిగే అవకాశముందని రాష్ట్రపతి పేర్కొన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషీన్‌ లెర్నింగ్‌ వంటివి మన జీవితంలో పతాక శీర్షికలుగా నిలవనున్నాయని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలను విస్తరించడమే కాకుండా వాటిని పునర్నిర్వచించిందని గుర్తు చేశారు

 
2024 లోనూ జీడీపీ వృద్ధిలో మంచి ఫలితాలు వస్తాయని ముర్మూ ఆశాభావం వ్యక్తం చేశారు. డిజిటల్‌ విభజన వ్యత్యాసాన్ని తగ్గించేందుకు జాతీయ విద్యా విధానం ఎంతో దోహదపడుతోందని తెలిపారు.