కొత్త ఎగుమతి మార్కెట్లను తెరిచి, వ్యాపార నిబంధనలను సులభతరం చేసే చర్యగా, భారతదేశం, న్యూజిలాండ్ ఒక స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై సోమవారం సంతకాలు చేశాయి.వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్, పర్యటనలో ఉన్న న్యూజిలాండ్ వాణిజ్య, పెట్టుబడుల శాఖ మంత్రి టాడ్ మెక్‌క్లే సమక్షంలో ఈ ఒప్పందంపై సంతకాలు జరిగాయి.
ఈ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్టిఏ), అన్ని టారిఫ్ లైన్లు లేదా ఉత్పత్తి వర్గాలను కవర్ చేస్తూ, న్యూజిలాండ్‌కు భారతదేశం చేసే 100 శాతం ఎగుమతులపై సుంకరహిత ప్రవేశాన్ని కల్పిస్తుంది. వస్త్రాలు, దుస్తులు, తోలు, పాదరక్షలు, రత్నాలు, ఆభరణాలు, ఇంజనీరింగ్ వస్తువులు, ప్రాసెస్ చేసిన ఆహారాలు వంటి శ్రమ-సాంద్రత గల రంగాలలో పోటీతత్వాన్ని పెంచడం ద్వారా సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు (ఎంఎస్ఎంఈలకు), ఉపాధికి ఇది గణనీయంగా ఊతం ఇస్తుందని భావిస్తున్నారు.
“ఈ దూరదృష్టి గల ఒప్పందం భారతదేశంలోకి 20 బిలియన్ డాలర్ల పెట్టుబడులను సులభతరం చేస్తుంది. వాణిజ్యం, సేవలు, పెట్టుబడులు, ఆవిష్కరణలు, రవాణా, వ్యవసాయ ఉత్పాదకత, విద్యారంగంలో మన సహకారాన్ని మరింతగా పెంపొందిస్తుంది. అలాగే నైపుణ్యం గల ప్రతిభావంతులకు, విద్యార్థులకు మార్గాలను సృష్టిస్తుంది,” అని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు.
ముఖ్యంగా భారత్ నుంచి న్యూజిలాండ్‌కు ఎగుమతి చేసే 100 శాతం ఉత్పత్తులకు కస్టమ్స్ డ్యూటీ నుంచి మినహాయింపు లభిస్తుంది. అంటే అన్ని ఉత్పత్తి కేటగిరీలకు, అన్ని టారిఫ్ లైన్లకు ప్రవేశ పన్నుల నుంచి మినహాయింపు దొరుకుతుంది. దీనివల్ల వస్త్రాలు, దుస్తులు, లెదర్, పాదరక్షలు, రత్నాలు, ఆభరణాలు, ఇంజినీరింగ్ వస్తువులు, ప్రాసెస్డ్ ఫుడ్స్ లాంటి రంగాల్లో పోటీతత్వం పెరుగుతుంది. తద్వారా చిన్న, మధ్య తరహా పరిశ్రమల (ఎంఎస్ఎంఈ)కు, ఉపాధి కల్పనకు మంచి ఊతం లభిస్తుంది.
ఇంతకు ముందు, సెరామిక్స్, కార్పెట్లు, ఆటోమొబైల్స్, ఆటో విడిభాగాలతో సహా కీలకమైన భారతీయ ఎగుమతులపై న్యూజిలాండ్ గరిష్ఠంగా 10 శాతం వరకు సుంకాలు విధించేది. కానీ తాజాగా ఎఫ్‌టీఏ ఖరారు కావడంతో, న్యూజిలాండ్‌లోకి భారతీయ ఉత్పత్తులు ఎలాంటి సుంకం లేకుండా ప్రవేశించగలుగుతాయి. అందువల్ల ఇతర దేశాల ఉత్పత్తులతో భారతీయ వస్తువులు పోటీపడగలుగుతాయి.
అంతేకాదు ఈ ఒప్పందం వల్ల, తయారీ రంగానికి అవసరమైన చెక్క దుంగలు, కోకింగ్ కోల్, లోహాల వ్యర్థాలు వంటి పదార్థాలను సుంకం లేకుండానే దిగుమతి చేసుకునే వెసులుబాటును భారత్ పొందింది. ఇది ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించి, భారత పరిశ్రమలు ప్రపంచ మార్కెట్లతో మరింతగా పోటీపడడానికి వీలు కల్పిస్తుంది. మరోవైపు భారత్ తన 70.03 శాతం టారిఫ్ లైన్లపై సుంకాలను సరళీకరించింది.
ఇది ఇరుదేశాల ద్వైపాక్షిక వాణిజ్యం విలువలో 95 శాతం ఉండడం గమనార్హం. అయితే భారతదేశంలోని సున్నితమైన రంగాలను రక్షించడానికి 29.97 శాతం టారిఫ్ లైన్లను మాత్రం మినహాయింపుల జాబితాలో ఉంచింది. ఈ మినహాయింపు జాబితాలో ప్రధానంగా ఉన్నవి ఏమిటంటే, పాల ఉత్పత్తులు, జంతు ఉత్పత్తులు (గొర్రె మాంసం మినహా), వ్యవసాయ ఉత్పత్తులు (ఉల్లిపాయలు, శనగలు, బఠానీలు, మొక్కజొన్న, బాదం), చక్కెర, కృత్రిమ తేనె, జంతు/వృక్ష సంబంధిత కొవ్వులు, నూనెలు, ఆయుధాలు, మందుగుండు సామగ్రి, రత్నాలు, ఆభరణాలు, రాగి- దాని అనుబంధ వస్తువులు , అల్యూమినియం- దాని అనుబంధ వస్తువులు మొదలైనవి.
మరోవైపు ఈ ఒప్పందం ద్వారా న్యూజిలాండ్‌కు చెందిన 30 శాతం టారిఫ్ లైన్లపై భారత్ సుంకాలను రద్దు చేసింది. ఇందనులో కలప, ఉన్ని, గొర్రె మాంసం, లెదర్-రా హైడ్స్ లాంటి వస్తువులున్నాయి. అదే విధంగా 35.60 శాతం టారిఫ్ లైన్స్‌పై 3, 5, 7, 10 సంవత్సరాల కాలపరిమితిలో దశలవారీగా సుంకాలు తొలగించనున్నారు. వీటిలో పెట్రోలియం ఆయిల్, మాల్ట్ ఎక్స్ట్రాక్ట్, వెజిటబుల్ ఆయిల్స్ సహా, కొన్ని ఎంపిక చేసిన ఎలక్ట్రిక్, మెకానికల్ యంత్రాలు, పెప్టోన్లు కూడా ఉన్నాయి.
ఇక టారిఫ్ తగ్గింపుల వల్ల ప్రయోజం పొందే న్యూజిలాండ్ ఉత్పత్తుల్లో వైన్, ఫార్మాస్యూటికల్ డ్రగ్స్, పాలిమర్లు, అల్యూమినియం, ఇనుము, ఉక్కు వస్తువులు ఉన్నాయి. మనుకా తేనె, యాపిల్స్, కివీ పళ్లు, మిల్క్ అల్బుమిన్‌తో కూడిన అల్బుమిన్లు వంటి కేవలం 0.06 శాతం వస్తువులు మాత్రమే టారిఫ్ రేట్ కోటాల కిందకు వస్తాయి.
అన్నికంటే ముఖ్యంగా ఈ ఎఫ్‌టీఏ ద్వారా భారతదేశంలో న్యూజిలాండ్ 20 బిలియన్ డాలర్ల మేర పెట్టుబడి పెట్టేందుకు వీలు కల్పించారు. దీని ద్వారా వచ్చే 15 ఏళ్లలో న్యూజిలాండ్ భారత్‌లో 20 బిలియన్ డాలర్ల మేర పెట్టుబడి పెట్టడానికి అవకాశం ఏర్పడింది. అంతేకాదు పెట్టుబడుల డెలివరీలో ఏమైనా లోపాలు ఉంటే, వాటిని పరిష్కరించేందుకు, పటిష్టమైన ఆర్థిక ఫలితాలను పొందేందుకు వీలుగా ఒప్పందంలో ఒక ‘రీబ్యాలెన్సింగ్ క్లాజ్’ను కూడా చేర్చారు.
More Stories
ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి ముందు హాజరుకాను
బీజేపీలో ఆప్ ఎంపీల విలీనాన్ని ఆమోదించిన రాజ్యసభ చైర్మెన్
సరిహద్దు మౌలిక సదుపాయాలకు నిధులు కోరిన అరుణాచల్ సీఎం