సప్తపదితో ముడిపడినదే హిందూ వివాహం

 
‘హిందూ వివాహం అంటే ఆట పాటలు కాదు.. విందు భోజనాలు అసలే కాదు.. అదొక పవిత్ర మతపరమైన ప్రక్రియ’ అని సుప్రీంకోర్టు తెలిపింది. ఈ మేరకు జస్టిస్‌ బీవీ నాగరత్న నేతృత్వంలోని ధర్మాసనం హిందూ వివాహ ప్రాముఖ్యత, చట్టబద్ధతను వివరించింది. 
 
హిందూ వివాహం అనేది సప్తపది (అగ్ని చుట్టూ ఏడు అడుగులు నడిచే ప్రక్రియ)తో ముడిపడి ఉంటుందని స్పష్టం చేసింది. ‘హిందూ వివాహ చట్టంలోని సెక్షన్‌ 8 ప్రకారం హిందూ వివాహాన్ని నమోదు చేయడం వల్ల వివాహానికి రుజువు లభిస్తుంది. కానీ, చట్టంలోని సెక్షన్‌ 7 ప్రకారమే వివాహం జరగాలి. అంటే వివాహ వేడుకలో సప్తపది నిర్వహించాలి. అలా కాకుండా ఆ వివాహానికి చట్టబద్ధత లభించదని స్పష్టం చేసింది.
 
హిందూ పెండ్లి ఒక సంస్కారమైన మతకర్మ. ఇది భారతీయ సమాజంలో గొప్ప విలువ కలిగిన సంస్థ. అది దాని హోదాను పొందవలసి ఉంటుంది. అత్యంత వైభవోపేతంగా పెండ్లి నిర్వహించినా, చట్టం దృష్టిలో నిబంధనలే ప్రామాణికం. పరస్పర గౌరవం, భార్యాభర్తల మధ్య బంధం హిందూ వివాహ పవిత్ర లక్షణం. అందుకే ఆ వేడుక సముచిత మర్యాదలతో నిర్వహించాలని తెలిపింది. 
 
పెండ్లి చేసుకొనే వధువు, వరుడు వివాహ వ్యవస్థలోకి ప్రవేశించే ముందు దాని గురించి లోతుగా ఆలోచించాలని ధర్మాసనం వెల్లడించింది. భారతీయ సమాజంలో పెండ్లి అనేది పాటలు, డ్యాన్స్‌, విందు కోసమో, కట్నాలు, కానుకల కోసమో చేసే తంతు కాదని తేల్చిచెప్పింది.  ముఖ్యంగా వివాహం అనేది వాణిజ్యపరమైన లావాదేవీ కాదని, ఒక గంభీరమైన కుటుంబ వ్యవస్థకు పునాది అని తెలిపింది. భవిష్యత్తులో కుటుంబంగా మారే భార్యాభర్తల హోదాను పొందే స్త్రీ, పురుషుల మధ్య సంబంధాన్ని హిందూ వివాహం ఏర్పరుస్తుందని పేర్కొన్నది.