నాలుగు కూనలకు జన్మనిచ్చిన నమీబియా చీతా

కునో నేషనల్‌ పార్కులో చీతా కూనలు సందడి నెలకొంది. నమీబియా నుంచి తీసుకొచ్చిన జ్వాలా అనే ఆడ చీతా మంగళవారం నాడు నాలుగు కూన పిల్లలకు  జన్మనిచ్చినట్లు కేంద్ర పర్యావరణ మంత్రి భూపేందర్ యాదవ్బుధవారం వెల్లడించారు. మంగళవారం మూడు పిల్లలకు జన్మ ఇచ్చిన్నట్లు వార్తలు వచ్చాయి. 
 
 ‘పార్క్‌లోని వన్యప్రాణి సంరక్షకులు జ్వాలా వద్దకు వెళ్లి చూడగా మూడు కాదు, నాలుగు కూనలు జన్మించినట్లు గుర్తించారు’ అంటూ పోస్టు చేశారు. ఈ మేరకు చిరుత కూనలకు సంబంధించిన వీడియోని కూడా కేంద్ర మంత్రి షేర్‌ చేశారు.  2023 మార్చిలో జ్వాలా చిరుత నాలుగు పిల్లలకు జన్మనిచ్చింది. 
 
అయితే, వాటిలో ఒకటి మాత్రమే ప్రాణాలతో బయటపడింది. కాగా, కొత్తగా పుట్టిన ఈ నాలుగు పిల్లలతో కలిపి కునో నేషనల్ పార్క్‌లో మొత్తం చిరుతల సంఖ్య 21కి చేరింది. కాగా, కునో నేషనల్‌ పార్క్‌లో చీతాలు ఒకటి తర్వాత మరొకటి చనిపోతున్నాయి. గత మంగళవారం (ఈ నెల 16) శౌర్య అనే చీతా మరణించింది. 
 
దీంతో నమీబియా నుంచి భారత్‌కు తీసుకొచ్చిన చీతాల్లో 2022 నుంచి 10 చీతాలు మృతి చెందినట్టయ్యింది. వీటిలో 7 పెద్దవి, మూడు కూనలు ఉన్నాయి. నమీబియా, దక్షిణాఫ్రికా నుంచి రెండు దఫాలుగా భారత్‌కు చీతాలను తీసుకొచ్చారు. వీటిని మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్‌ పార్క్‌లో వదిలారు. ఆ తర్వాత కొద్ది రోజులకే వివిధ కారణాలతో చీతాలు ఒక్కొక్కటిగా మరణించటం ప్రారంభమైంది.