రామ మందిరంపై పాకిస్థాన్ జెండా.. ఓ వ్యక్తి అరెస్ట్ 

హిందువుల కల స్వప్నం సాకారమైన వేళ అయోధ్య రామ మందిరంపై పాకిస్థాన్ జెండా ఉంచినట్లు ఎడిటింగ్ చేసిన ఫోటోను సోషల్ మీడియాలో ఓ వ్యక్తి షేర్ చేయడం కలకలం రేపింది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ఆ వ్యక్తిని గుర్తించి అరెస్ట్ చేశారు. 
 
కర్ణాటకలోని గడగ్ జిల్లాకు చెందిన తాజుద్దీన్ దఫేదార్ అన్ వ్యక్తి సోషల్ మీడియాలో ఒక ఫోటోను ఫేస్‌బుక్‌లో షేర్ చేశాడు. అయితే అది ఫేక్ ఫోటో కావడం గమనార్హం. అయోధ్య రామ మందిరంపై ఇస్లామిక్ జెండాలు ఎగురుతున్నట్లు ఫోటోలను మార్ఫింగ్ చేసి షేర్ చేసిన తాజుద్దీన్ దఫేదార్‌ను గజేంద్రగఢ్ పోలీసులు అరెస్ట్ చేశారు. 
 
హిందువుల పవిత్ర ఆలయమైన అయోధ్య ప్రారంభోత్సవం రోజే ఈ ఘటన చోటు చేసుకోవడం గమనార్హం.  అయోధ్య రామ మందిరంపై పాకిస్థాన్ జెండాను ఉంచినట్లు ఎడిట్ చేసి సోషల్ మీడియాలో తాజుద్దీన్ దఫేదార్ అనే వ్యక్తి షేర్ చేసినట్లు మొదట హిందూ అనుకూల సంస్థలు గుర్తించాయి. వెంటనే ఈ ఫోటోపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశాయి. 
 
దీంతో తాజుద్దీన్ దఫేదార్ అనే నిందితుడిని గజేంద్రగఢ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఆ ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ కావడంతో హిందూ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఆ ఫోటోను సోషల్ మీడియా ప్లాట్‌ఫాంల నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తున్నాయి.

తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయడంతో పాటు మతపరమైన మనోభావాలను దెబ్బ తీసే విధంగా చేసినందుకు నిందితుడు తాజుద్దీన్ దఫేదార్‌పై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు వెల్లడించారు. ఇక ఇదే విషయంపై సమగ్ర దర్యాప్తు చేస్తామని కర్ణాటక పోలీస్ శాఖ తెలిపింది.