చావు అంచుల దాకా వెళ్లిన మృత్యుంజయురాలు

ఎంతో మంది క్రీడాకారులు తమ లక్ష్యాన్ని అందుకునే క్రమంలో ఒడిదుడుకులకు లోనవ్వడం.. ఎదురుదెబ్బలు తగలడం చూస్తుంటాం. కానీ చావు అంచుల వరకు వెళ్లి తిరిగి వచ్చి క్రీడల్లో రాణించినవారిని అరుదుగా చూస్తుంటాం. ఇప్పుడు మనం చెప్పుకునే వ్యక్తి ఆ కోవకు చెందినవారే. పశ్చిమ బెంగాల్ కు చెందిన మారథాన్ రేసర్ శ్యామలీ సింగ్. నాలుగేళ్ల క్రితం ఏ గ్రౌండ్ లో అయితే గమ్యాన్ని చేరే క్రమంలో రక్తపు వాంతులతో తన మారథాన్ రన్ ను ఆపేసిన శ్యామలీ సింగ్ మళ్లీ అదే గ్రౌండ్ లో తన గమ్యాన్ని విజయవంతంగా చేరింది. నాలుగేళ్లక్రితం ఆమెను మృత్యువులా కబళించడానికి వచ్చిన బ్రెయిన్ ట్యూమర్ వ్యాధిని విజయవంతంగా అధిగమించి ఇవాళ మారథాన్ రేస్ లో కాంస్య పతకం సాధించి ఔరా అనిపించింది శ్యామలీ సింగ్. రెండుసార్లు చావు అంచుల వరకు వెళ్లి తిరిగి సక్సెస్ అయిన శ్యామలీ సింగ్ జీవితం ఒక ఆదర్శప్రాయం.

గత ఆదివారం ముంబై వేదికగా టాటా ఆధ్వర్యంలో నిర్వహించిన ముంబై మారథాన్ రేస్ లో పాల్గొన్న శ్యామలీ సింగ్ గమ్యాన్ని 3 గంటల 4 నిమిషాల 35 సెకన్లలో చేరి మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకం సొంతం చేసుకుంది. పతకం సాధించడం కంటే తాను అనుకున్న లక్ష్యాన్ని చేరడం తనకు గొప్పగా అనిపించిందని శ్యామలీ సింగ్ పేర్కొంది. నిజానికి 2010 నుంచే మారథాన్ రేస్ పై ఆసక్తి పెంచుకున్న శ్యామలీ సింగ్ దేశవ్యాప్తంగా ఎక్కడ మారథాన్ రేస్ జరిగినా అక్కడ వాలిపోయేది. గెలుస్తామన్నది ముఖ్యం కాదు.. మనం ఎంత ఇచ్చామన్నది ముఖ్యం అని చెప్పుకున్న శ్యామలీ సింగ్ కు 2017 లో తొలి ఎదురుదెబ్బ తగిలింది. ఛాతీ భాగంలో ఏర్పడిన ట్యూమర్ తో ఆమె కొద్ది దూరం పరిగెత్తినా ఆయాసం రావడం మొదలైంది. దీంతో పరీక్షలు చేయించుకుంటే ట్యూమర్ ఉన్నట్టుగా బయటపడింది. దీంతో సర్జరీతో ట్యూమర్ తొలగించుకొని మళ్లీ మారథాన్ రేసింగ్ లో అడుగుపెట్టింది. అయితే మూడేళ్లు గడిచాయో లేదో 2020లో బ్రెయిన్ ట్యూమర్ రూపంలో ప్రాణాంతక వ్యాధి ఆమెను భయపెట్టింది. తన భర్త సంతోష్ నారాయన్ తో కలిసి చాలా ఆసుపత్రులు తిరిగింది. చివరికి 2021 నవంబర్ లో సర్జరీతో బ్రెయిన్ ట్యూమర్ ను తొలగించారు.

సర్జరీ విజయవంతం అయినప్పటికి ఆమె మునపటిలా పరిగెత్తడానికి శక్తి సరిపోలేదు. అయినా వెనుకంజ వేయకుండా తన మారథాన్ ను కొనసాగించింది. అలా 2022లో అస్సాంలో జరిగిన మారథాన్ రేసులో పాల్గొంది. ఆపై ముంబై మారథాన్ లో పాల్గొంది. కానీ ఈ రెండు మారథాన్ రేసుల్లోనూ 20 కిమీ దూరం వెళ్లగానే ఆగిపోయింది. కానీ ఏడాది తిరక్కుండానే ముంబై మారథాన్ రేసులో పాల్గొన్న శ్యామలీ సింగ్ రేసును పూర్తి చేసి కాంస్య పతకం సాధించి పట్టుదల ఉంటే ఏదైనా సాధించొచ్చు అని మరోసారి నిరూపించింది.