అయోధ్య రామయ్య దర్శనానికి పోటెత్తిన భక్తులు

అయోధ్యలో రామయ్య దర్శనానికి భక్తులు పోటెత్తారు. సోమవారం మధ్యాహ్నం బాలరాముడు భవ్య మందిరంలో కొలువుకాగా, మంగళవారం ఉదయం నుంచి సాధారణ భక్తుల దర్శనానికి అనుమతిస్తున్నారు. కొత్తగా నిర్మించిన రామ మందిరాన్ని మంగళవారంనుంచి భక్తులకోసం తెరుస్తున్నట్లు ముందుగానే ప్రకటించిన నేపథ్యంలో, బాలరాముణ్ని దర్శించుకోవాలని దేశంలోని వివిధ ప్రాంతాలనుంచి భక్తులు తరలివచ్చారు. ఒక దశలో ఆలయ ప్రాంగణంలో తొక్కిసలాట జరిగింది.
తీవ్రమైన చలి ఉన్నప్పటికీ తెల్లవారుజామున 3 గంటల నుంచే ఆలయ మందిరం వద్దకు చేరుకున్నారు.  ఉదయం 7 గంటల నుంచి ఆలయంలోకి అనుమతిస్తున్నారు. అధిక సంఖ్యలో  భక్తులు ఆలయ ప్రధాన ద్వారం వద్దకు ఒకేసారి రావడంతో తోపులాటకు దారితీసింది. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నది.
బాల రాముడిని దర్శించుకొని, తరించేందుకు భక్తులు నిద్రను లెక్క చేయలేదు.  మంగళవారం ఉదయం దర్శించుకోవాలనే ఆతృతతో అర్దరాత్రి దాటిన తర్వాత ఆలయ పరిసరాల్లోకి చేరుకున్నారు.  ఒక్కసారిగా భక్తులు రావడంతో నియంత్రించడం సిబ్బంది వల్ల కాలేదు. ఆ బాల రాముడిని చూసేందుకు ఒకరిని ఒకరు తోసుకోవడంతో అక్కడ తోపులాట చోటు చేసుకుంది.
దర్శనాలు ప్రారంభమైన రోజే బాల రాముడిని దర్శించుకోవాలనే ఆశతో భక్తులు అయోధ్యకు పోటెత్తారు. అయోధ్య రామ మందిరానికి దారితీసే వీధులన్నీ భక్తులతో నిండిపోయాయి. భక్తుల జై శ్రీరామ్ నినాదాలతో అయోధ్య దద్దరిల్లుతోంది. అందరికీ అయోధ్య రాముడి దర్శనం అవుతుందని భక్తులు సంయమనం పాటించాలని ఆలయ వర్గాలు విజ్ఞప్తి చేస్తున్నాయి.
అయోధ్యకు తండోపతండాలుగా వస్తున్న భక్తకోటిని చూసి రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ఆచార్య సత్యేంద్ర దాస్ పులకించిపోయారు. ‘అయోధ్యకు మళ్లీ త్రేతాయుగం నాటి రోజులు వచ్చాయి’ అని ఆయన వ్యాఖ్యానించారు. ‘బాలరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం పూర్తయిన అనంతరం అయోధ్యకు పూర్వవైభవం దక్కింది. రాముడు వనవాసం ముగించుకుని అయోధ్యకు తిరిగి వచ్చాక నగరం కళకళలాడింది. అదే విధంగా ఇప్పుడు బాలరాముడి రాకతో అయోధ్య నగరం కళకళలాడుతోంది’ అని ఆయన తెలిపారు.
 
అయితే ప్రస్తుతం రోజులో 2 విడతల్లో అయోధ్యలో బాల రాముడు భక్తులకు దర్శనం ఇవ్వనున్నాడు. శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ విడుదల చేసిన వివరాల ప్రకారం.. ఉదయం 7 గంటల నుంచి 11.30 గంటల వరకు తొలి దశ దర్శనం ఆ తర్వాత మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 6.30 గంటల వరకు.. బాల రాముడిని దర్శించుకోవచ్చని తెలిపింది. ఈ క్రమంలోనే భక్తుల రద్దీ భారీగా పెరిగితే స్వామివారి దర్శన సమయాన్ని పొడిగించాలని ఆలయ ట్రస్ట్ యోచిస్తోంది.