అయోధ్యలో నిర్మించనున్న మసీదుకు బాబ్రీ పేరు తొలగింపు

అయోధ్యలో నిర్మించిన రామ మందిరానికి సోమవారం ప్రారంభోత్సవం జరగడంతో ఇప్పుడు అయోధ్యలో నిర్మించనున్న మసీదుపైనా ఆసక్తి నెలకొంది. 2019లో సుప్రీంకోర్టు తీర్పు మేరకు అయోధ్యకు సుమారు 25 కిలోమీటర్ల దూరంలో మసీదు నిర్మాణం కోసం ముస్లింలకు స్థలం కేటాయించారు. 

ఈ స్థలంలో మసీదు నిర్మాణానికి ఇండో- ఇస్లామిక్ కల్చరల్ ఫౌండేషన్ (ఐఐసీఎఫ్) డెవలప్‌మెంట్ కమిటీ సిద్ధమైంది. పవిత్ర రంజాన్‌ నెల తర్వాత ఈ ఏడాది మే నెలలో మసీదు నిర్మాణం ప్రారంభిస్తామని ఐఐసీఎఫ్ డెవలప్‌మెంట్ కమిటీకి నేతృత్వం వహిస్తున్న హాజీ అర్ఫత్ షేక్ తెలిపారు. మూడు నుంచి నాలుగేళ్లలో మసీదు నిర్మాణాన్ని పూర్తి చేస్తామని చెప్పారు. 

రీడిజైన్ కారణంగా మసీదు నిర్మాణం ఆలస్యమైందని ఐఐసీఎఫ్‌ కార్యదర్శి అథర్ హుస్సేన్ తెలిపారు. అలాగే మసీదు ప్రాజెక్ట్‌ కాంప్లెక్స్‌లో 500 పడకల ఆసుపత్రి ప్రణాళికను కూడా చేర్చినట్లు చెప్పారు.  కాగా, అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి సుమారు రూ. 3,000 కోట్లకు పైగా నిధులు సేకరించారు. అయితే అయోధ్యలో మసీదు నిర్మాణానికి నిధుల కొరత నెలకొన్నది. 

నిధుల కోసం తాము ఎవరినీ సంప్రదించలేదని, నిధుల సేకరణకు ఎలాంటి ఉద్యమం చేపట్టలేదని ఐఐసీఎఫ్‌ ప్రెసిడెంట్ జుఫర్ అహ్మద్ ఫరూఖీ తెలిపారు. మొఘల్ సామ్రాజ్య స్థాపకుడు చక్రవర్తి బాబర్ పేరుతో ఉన్న ‘బాబ్రీ మసీదు’ వివాదాస్పద నిర్మాణంగా మారడంతో కొత్తగా నిర్మించే మసీదుకు ఆ పేరును తొలగించనున్నారు. ‘ముహమ్మద్ బిన్ అబ్దుల్లా మసీదు’గా పేరుపెట్టనున్నారు.

మరోవైపు నిధుల సేకరణకు త్వరలో క్రౌడ్ ఫండింగ్ వెబ్‌సైట్ ప్రారంభిస్తామని బీజేపీ నాయకుడైన షేక్ తెలిపారు. ‘ప్రజల మధ్య ఉన్న శత్రుత్వం, ద్వేషాన్ని ప్రేమగా మార్చడమే మా ప్రయత్నం. సుప్రీంకోర్టు తీర్పును మేం అంగీకరించినా, అంగీకరించకపోయినా.. మన పిల్లలు, ప్రజలకు మంచి విషయాలు బోధిస్తే ఈ పోరాటాలన్నీ ఆగిపోతాయి’ అని ఆయన చెప్పారు. 

1992లో బాబ్రీ మసీదు కూల్చివేత అనంతరం జరిగిన అల్లర్లు, హింసాకాండలో సుమారు 2,000 మంది మరణించారు. మృతుల్లో ఎక్కువగా మంది ముస్లింలున్నారు.