అయోధ్య ప్రసారాలపై తమిళనాడు ఆంక్షలపై `సుప్రీం’ అసహనం

తమిళనాడులో అయోధ్య రాముడి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమాల ప్రసారాలను అడ్డుకోవద్దని తమిళనాడు ప్రభుత్వాన్ని సుప్రీం కోర్టు ఆదేశించింది. ఈ కార్యక్రమాలను ప్రత్యక్ష ప్రసారం చేయడంపై ఎలాంటి మౌఖిక సూచనల ఆధారంగా కాకుండా చట్టప్రకారం నడుచుకోవాలని తమిళనాడు అధికారులను సుప్రీం కోర్టు సోమవారం ఆదేశించింది. 

అయోధ్యలో జరిగే పవిత్రోత్సవాలను తమిళనాడు లోని దేవాలయాల్లో ప్రత్యక్ష ప్రసారం చేయడాన్ని నిషేధిస్తూ జనవరి 20 నాటి మౌఖిక ఉత్తర్వులు రద్దు చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీం కోర్టు విచారించింది. ఇప్పటికే తిరస్కరించిన వాటికి సంబంధించి పక్కా కారణాలను చూపాలని, డేటాను సిద్ధం చేయాలని స్పష్టం చేసింది. 

దీనిపై స్పందించిన తమిళనాడు ప్రభుత్వం ఆలయాల్లో పూజలపై ఎలాంటి ఆంక్షలు లేవని తెలియజేసింది. అయోధ్య కార్యక్రమాల ప్రత్యక్ష ప్రసారం చేయడంపై నిషేధం విధించలేదని, అది కేవలం రాజకీయ ప్రేరేపితమని తమిళనాడు తరఫున సీనియర్ న్యాయవాది అమిత్ ఆనంద్ తివారీ వివరించారు 

ఈ క్రమంలో జనవరి 29లోగా ఈ పిటిషన్‌పై తమిళనాడు ప్రభుత్వ స్పందనను ధర్మాసనం కోరింది. తమిళనాడు ప్రభుత్వం లైవ్ టెలికాస్ట్‌ను నిషేధించిందని కేంద్ర మంత్రి నిర్మలాసీతారామన్ ఆరోపించారు. రామాలయాల్లో భజనలు, పూజలను కూడా అడ్డుకుంటున్నారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఈ వ్యవహారంపై ఆదివారం రాజకీయ దుమారం రేగింది. 

కాగా, తమిళనాడు లోని డీఎంకె ప్రభుత్వ పాలనలో పోలీస్‌లు హిందువులను ద్వేషిస్తూ దుర్వినియోగమవుతున్నారని, అయోధ్యలో రామ ప్రతిష్ట కార్యక్రమాలు ప్రత్యక్ష ప్రసారం కాకుండా అడ్డుకుంటున్నారని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ధ్వజమెత్తారు. సోమవారం కాంచీపురంలో విలేఖరులతో ఆమె మాట్లాడుతూ ప్రధాని నరేంద్రమోడీపై డిఎంకె వ్యక్తిగత ద్వేషం ప్రదర్శిస్తూ భక్తులను అణచి వేస్తున్నారని ఆరోపించారు.

ఆలయాల్లో రాముడి పూజలు నిర్వహించడంపై హెచ్‌ఆర్ అండ్ సీఈ శాఖ ఎలాంటి నిషేధం విధించలేదని తమిళనాడు హిందూమత ధర్మాదాయ శాఖ మంత్రి పీకే శేఖర్‌బాబు స్పష్టం చేశారు. ఈ వివాదంపై బీజేపీ నేతలు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. బీజేపీ రాష్ట్ర కార్యదర్శి వినోజ్ పీ సెల్వం తరఫున న్యాయవాది జి. బాలాజీ పిటిషన్ దాఖలు చేశారు.

ఇటువంటి పిటీషన్ పై మద్రాస్ హైకోర్టు స్పందిస్తూ నాలుగు గోడల మధ్య జరిగే కార్యక్రమానికి ఎటువంటి అనుమతులు  అవసరంలేదని స్పష్టం చేసింది. దైవం శాంతి, సంతోషంల కోసమే అంటూ సామజిక అశాంతి సృష్టించేందుకు కాదని పేర్కొన్నది.