కేదార్ నాథ్ ధామ్ యాత్ర నేటి నుంచే 

కేదార్ నాథ్ ధామ్ యాత్ర నేటి నుంచే 

భువిపై, హిమాలయ పర్వత సానువుల్లో పరమ శివుడు కొలువై ఉన్న పరమ పవిత్ర పుణ్యక్షేత్రం కేదార్ నాథ్ ధామ్ యాత్ర ప్రారంభమైంది. ఉత్తరాఖండ్‌లోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల్లో ఒకటైన కేదార్‌ నాథ్‌ ఆలయం తలుపులు అక్షయ తృతీయ సందర్భంగా శుక్రవారం తెరుచుకున్నాయి. వేద పండితుల మంత్రోచ్ఛరణ మధ్య ఉదయం 7 గంటలకు ఆలయ ప్రధాన తలుపులు అధికారులు తెరిచారు.

ఉత్తరాఖండ్‌ ముఖ్యమంత్రి పుష్కర్‌ సింగ్‌ ధామి కుటుంబంతో కలిసి తొలి పూజలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేదారేశ్వరుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉత్తరాఖండ్ లోని శివుని అవతారంగా పూజలందుకుంటున్న కేదార్ నాథ్ ధామ్ కార్తీక పౌర్ణమి (నవంబర్ 15) వరకు తెరిచి ఉండే అవకాశం ఉంది. గర్వాల్ హిమాలయాలలోని ఈ హిందూ పుణ్యక్షేత్రాన్ని మిగతా రోజుల్లో తీవ్రమైన వాతావరణ పరిస్థితుల కారణంగా మూసివేస్తారు.

పరమేశ్వరుడి పవిత్ర ఆలయాలైన 12 జ్యోతిర్లింగాల్లో కేదార్‌నాథ్‌ ఆలయం ఒకటి. చార్‌ధామ్‌ యాత్రలో కేదార్ నాథ్‌ దేవాలయం సందర్శన భాగంగా ఉంటుంది. ఏటా దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి లక్షల మంది భక్తులు కేదార్‌నాథ్‌కు చేరుకుని పరమేశ్వరుడ్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేస్తుంటారు. అయితే, శీతాకాలం సందర్భంగా ఈ ఆలయాన్ని మూసివేస్తారు. ఇక దాదాపు ఆరు నెలల పాటు మూసి ఉన్న ఈ ఆలయ తలుపులు భక్తుల దర్శనార్థం నేడు తెరిచారు.

ఈ సందర్భంగా ఆలయాన్ని అధికారులు సర్వాంగ సుందరంగా అలంకరించారు. సుమారు 40 క్వింటాళ్ల పూలతో అందంగా ముస్తాబు చేశారు. భక్తులు ఉదయం నుంచే ఆలయానికి క్యూ కట్టి కేదారేశ్వరుడిని దర్శించుకుంటున్నారు. రిజిస్ట్రేషన్ లేకుండా కేదార్ నాథ్ ధామ్ కు వెళ్లే అవకాశం లేదు.  ధామ్ కు వెళ్లే మార్గంలో అనేక రిజిస్ట్రేషన్ పాయింట్లు ఉన్నాయి. ఇక్కడ   ఆఫ్ లైన్ లో రిజిస్టర్ చేసుకోవచ్చు. ఒకవేళ వ్యక్తిగత వాహనంలో ప్రయాణిస్తుంటే, రిషికేష్ లో ఉన్న రిజిస్ట్రేషన్ పాయింట్ వద్ద రిజిస్టర్ చేసుకోవచ్చు. 

రాష్ట్ర ప్రభుత్వ అధికారిక లింక్ registrationandtouristcare.uk.gov.in. ద్వారా  కేదార్ నాథ్ ధామ్ యాత్ర 2024 కోసం నమోదు చేసుకోవచ్చు. కేదార్ నాథ్ ఆలయానికి కాలినడకన లేదా విమాన మార్గం ద్వారా, లేదా హెలికాప్టర్ ద్వారా చేరుకోవచ్చు. హిమాలయాల్లో నెలకొన్న చార్‌ధామ్ యాత్ర అంతర్భాగ ఆలయాలు శివుడికి , విష్ణువుకు, జీవనదులు గంగ, యమునలకు ప్రతీకంగా ఉంటాయి.

ఆధ్యాత్మిక ప్రశాంతత కోసం, అంతకు మించిన ప్రకృతి రమణీయతల సందర్శనకు ప్రజలు ఎంత కష్టం అయినప్పటికీ వస్తుంటారు. కేదార్‌నాథ్ ఆలయం నవంబర్ 2న, బర్రీనాథ్ ఆలయం నవంబర్ 9న, గంగోత్రి ఆలయం నవంబర్ 3న, యమునోత్రి కూడా నవంబర్ 3న శీతాకాల ఆరంభ దశలో మూతపడుతుంది.