బీజాపుర్‌ ఎన్‌కౌంటర్‌లో 12 మంది మావోయిస్టులు హతం

బీజాపుర్‌ ఎన్‌కౌంటర్‌లో 12 మంది మావోయిస్టులు హతం
 
* ఈ ఏడాది 103 మంది మావోయిస్టులు హతం

ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులకు వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. శుక్రవారం బీజాపుర్‌ జిల్లాలో భద్రతా బలగాలతో జరిగిన ఎదురుకాల్పుల్లో 12 మంది మావోయిస్టులు మృతి చెందారు. గంగలూర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధి పిడియా గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు యాంటీ-నక్సల్స్‌ ఆపరేషన్‌ చేపట్టాయి. 
 
ఈ క్రమంలోనే కూంబింగ్ చేపడుతున్న భద్రతా దళాలకు మావోయిస్టులు ఎదురుపడటం వల్ల కాల్పులు మొదలైనట్లు అధికారులు చెప్పారు. ఘటనా స్థలం నుంచి 12 మృతదేహాలను స్వాధీనం చేసుకున్నామని ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయ్ తెలిపారు. భద్రతా బలగాలు భారీ విజయాన్ని సాధించాయన్న ఆయన, ఈ ఆపరేషన్‌లో పాల్గొన్న కూంబింగ్‌ దళాలు, సీనియర్‌ అధికారులను అభినందించారు. ఆపరేషన్ ముగిసిందని, సైనికులంతా సురక్షితంగానే ఉన్నారని సీఎం తెలిపారు.

గంగలూరు పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని అడవుల్లో మావోయిస్టులు ప్లీనరీ నిర్వహించేందుకు సమావేశమవుతున్నట్టుగా పోలీసులకు సమాచారం అందింది. దీంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు దంతెవాడ, బీజాపూర్‌, సుక్మా జిల్లాల నుంచి జిల్లా రిజర్వు గార్డ్స్‌(డీఆర్‌జీ), స్పెషల్‌ టాస్క్‌ ఫోర్స్‌, కోబ్రా, సీఆర్‌పీఎఫ్‌ విభాగాల నుంచి 1,200 మంది బలగాలు గంగలూరు పరిధిలోని అడవులను జల్లెడ పట్టారు.

ఈ క్రమంలో పీడియా అడవుల్లో తారసపడిన మావోయిస్టులు బలగాలపై కాల్పులకు దిగారు. అప్పటికే ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టిన జవాన్లు ఎదురుకాల్పులు జరిపారు. దాదాపు రెండున్నర గంటల పాటు జరిగిన కాల్పుల తర్వాత ఘటనాస్థలిలో 12 మంది మావోయిస్టుల మృతదేహాలతోపాటు భారీగా ఆయుధ, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకొన్నారు.

మావోయిస్టుల సమావేశానికి హార్డ్‌కోర్‌ నక్సల్‌ కమాండర్లు లింగా, పాపారావుతోపాటు మరికొందరు కీలక నేతలు సైతం హాజరైనట్టు తెలుస్తున్నది. డీకేఎస్‌జెడ్‌సీ, డీవీసీఎం, ఏసీఎం క్యాడర్‌ మావోయిస్టులు పాల్గొన్నట్టు పోలీసు వర్గాలు చెబుతున్నాయి. ఇటీవల ఏప్రిల్‌ 30న నారాయణ్‌పుర్‌, కాంకేర్‌ జిల్లాల సరిహద్దు ప్రాంతంలో జరిగిన మరో ఎన్‌కౌంటర్‌లో 10 మంది మరణించారు. తాజా ఘటనతో ఈ ఏడాది ఇప్పటి వరకు ఛత్తీస్‌ఢ్‌లోని బస్తర్‌ రీజియన్‌లో జరిగిన వేర్వేరు ఎన్‌కౌంటర్లలో మరణించిన నక్సలైట్ల సంఖ్య 103కు చేరింది.

ఇటీవల కాంకేర్‌ జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఇక్కడ కాల్పుల్లో 29 మంది మరణించారు. వీరిలో ఉత్తర బస్తర్‌ డివిజన్‌ కమిటీకి చెందిన అగ్ర నాయకులు ఉన్నారు.  కాంకేర్‌లోని చోటేబైథియా పీఎస్‌ పరిధి కల్పర్ అడవిలో జరిగిన ఎదురుకాల్పుల్లో బీఎస్‌ఎఫ్ ఇన్‌స్పెక్టర్, ఇద్దరు జవాన్లకు గాయాలు అయ్యాయి. ఘటనాస్థలంలో ఏకే 47, మూడు ఇన్సాస్ రైఫిల్స్ సహా మొత్తం పదికిపైగా అధునాతన తుపాకులను స్వాధీనం చేసుకున్నారు.