నీట్ ప్రశ్నపత్రం లీక్‌ అనుకోవడం లేదు.. ఎన్‌టీఏ

నీట్ ప్రశ్నపత్రం లీక్‌ అనుకోవడం లేదు..  ఎన్‌టీఏ
నీట్ ప్రశ్నపత్రం లీక్‌లో ప్రమేయం ఉన్న విస్తృత కుట్రలపై ఆగ్రహం వ్యక్తమవుతున్న నేపథ్యంలో, వైద్య విద్య అభ్యసించడానికి అవసరమైన పరీక్ష రద్దుకు దారితీసిన ఈ ప్రశ్నపత్రం లీక్ ఉదంతంపై ప్రశ్నలను ఎదుర్కొంటూ, జాతీయ పరీక్షల ఏజెన్సీ (ఎన్‌టీఏ) డైరెక్టర్ జనరల్ అభిషేక్ సింగ్ గురువారం  నీట్ పరీక్ష ‘లీక్’ అయినట్లుగా తమ ఏజెన్సీ భావించడం లేదని స్పష్టం చేసారు. 
 
విద్య, మహిళలు, పిల్లలు, యువత, క్రీడల పార్లమెంటరీ స్థాయీ కమిటీ ముందు హాజరయ్యారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం,  ప్రతిపక్ష సభ్యులు పదేపదే ప్రశ్నలు వేసినప్పటికీ, ఈ విషయం ప్రస్తుతం సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) దర్యాప్తులో ఉందని, సీబీఐ తన విచారణను ముగించి అధికారికంగా ధృవీకరించిన తర్వాతే ఏజెన్సీ దీనిని పేపర్ లీక్‌గా అంగీకరిస్తుందని ఎన్‌టీఏ అధికారులు స్పష్టం చేసినట్లు సమాచారం. 
 
గతంలో జరిగిన పేపర్ లీక్‌ల ఆరోపణలకు సంబంధించిన సంఘటనలపై కూడా కమిటీ సభ్యులు ఎన్‌టీఏను ప్రశ్నించారు. సమావేశం సందర్భంగా కమిటీ చైర్మన్ దిగ్విజయ్ సింగ్ ఎన్‌టీఏ అధికారులను పలు ప్రశ్నలు అడిగారు. పార్లమెంటరీ కమిటీ నీట్‌ ప్రశ్న పత్రం లీకేజీపై ఎన్టీఏ, కేంద్ర విద్యా శాఖకు చెందిన ఎడ్యుకేషన్‌ కార్యదర్శి వినీత్‌ జోషి సహా పలువురు అధికారులను గురువారం నాటి సమావేశానికి పిలిపించింది.

భవిష్యత్‌లో నీట్‌ పేపర్‌ లీకేజీ జరగకుండా పరీక్ష విధానం పటిష్ఠతకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారని ఎన్టీఏ అధికారులను పార్లమెంటరీ కమిటీకి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంపీలు ప్రశ్నించారు. తమ సంస్థలో చేపట్టాల్సిన సంస్కరణలపై రాధాకృష్ణన్‌ సమర్పించిన సిఫార్సుల గురించి ఎన్టీఏ చైర్‌పర్సన్‌ ప్రదీప్‌ కుమార్‌ జోషి, డైరెక్టర్‌ జనరల్‌ అభిషేక్‌ సింగ్‌ వివరంగా ప్రెజెంటేషన్‌ ద్వారా ఎంపీలకు వివరించారు.

ఈ సందర్భంగా తమ వ్యవస్థ ద్వారా నీట్‌-యూజీ పేపర్‌ లీక్‌ కాలేదని వారు స్పష్టంచేశారు. కొన్ని ప్రశ్నలు మాత్రమే పరీక్ష ముందు లీకయ్యాయని చెప్పారు. అలాంటప్పుడు పేపర్‌ ఎలా లీకైంది, పరీక్ష రద్దు చేసి తిరిగి నిర్వహించాల్సిన అవసరం ఎలా ఏర్పడిందని ఎంపీలు వారిని నిలదీశారు. దీనికి సమాధానం చెప్పని డీజీ దీనిపై సీబీఐ దర్యాప్తు చేస్తున్నదని తెలిపారు.

ప్రస్తుతం తమ సంస్థలో సుమారు 25 శాతం సిబ్బంది కొరత ఉందని, ఎటువంటి లోపాలకు తావులేకుండా ఉండేందుకు ఈ ఖాళీలన్నింటినీ భర్తీ చేయడానికి పద్ధతి ప్రకారం చర్యలు తీసుకుంటున్నామని  ఎన్‌టీఏ, కమిటీ సభ్యులకు తెలియజేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఎటువంటి పొరపాట్లకు ఆస్కారం లేని ఒక పటిష్టమైన పరీక్షా విధానాన్ని రూపొందించే దిశగా చర్యలు తీసుకుంటున్నామని, దీనిపై సమగ్ర సమీక్ష నిర్వహిస్తున్నామని  ఎన్‌టీఏ అధికారులు కమిటీ సభ్యులకు వివరించారు.