ఆఫ్రికాలో ఇటీవల మళ్లీ మొదలైన ఎబోలాపై ప్రపంచ ఆరోగ్యం సంస్థ (డబ్ల్యూహెచ్వో) `ఆరోగ్య అత్యవసర పరిస్థితి’ని ప్రకటించడంతో భారత్ దేశంలోకి ఎబోలా రాకుండా ముందుజాగ్రత్త చర్యలు తీసుకుంటోంది. విదేశాల నుంచి వచ్చే ప్రయాణికుల విషయంలో జాగ్రత్తగా వ్యవహరిస్తోంది. ముఖ్యంగా విదేశీ ఎంట్రీ పాయింట్స్ వద్ద ప్రత్యేక స్క్రీనింగ్ నిర్వహిస్తున్నారు.
ఈ మేరకు డీజీహెచ్ఎస్ (డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్) అన్ని ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టులకు ప్రత్యేక ఆదేశాలు జారీ చేసింది. డీజీహెచ్ఎస్ జారీ చేసిన ఈ మార్గదర్శకాలను ఢిల్లీ ఎయిర్పోర్ట్ తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్ ద్వారా పంచుకుంది. విదేశాల నుంచి ముఖ్యంగా ఎబోలా అత్యధికంగా వ్యాపిస్తున్న కాంగో, ఉగాండా, సౌత్ సూడాన్ వంటి దేశాల నుంచి వచ్చే ప్రయాణికుల్ని క్షుణ్ణంగా తనిఖీ చేయాలని ఆదేశించింది.
ఈ దేశాల నుంచి వచ్చే ప్రయాణికుల్లో ఎవరికైనా ఎబోలా లక్షణాలు ఉంటే వెంటనే వారిని వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. జ్వరం, తలనొప్పి, వాంతులు, విరేచనాలు, గొంతునొప్పి, రక్తస్రావం వంటివి ఉంటే ఎయిర్పోర్ట్ హెల్త్ ఆఫీసర్లకు చెబుతున్నారు. వారిని ప్రత్యేకంగా ఉంచి, పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఆరోగ్య స్తితిపై పర్యవేక్షిస్తున్నారు.
అలాగే, ఆయా దేశాల నుంచి వచ్చిన ప్రయాణికుల్లో ఎవరికైనా ఇలాంటి అనారోగ్య లక్షణాలు 21 రోజుల్లోపు వస్తే వెంటనే తమకు తెలియజేయాలని కూడా వైద్యాధికారులు సూచిస్తున్నారు. విదేశాల నుంచి వచ్చే వారు ఇటీవలి కాలంలో ఏయే దేశాలు తిరిగారో కూడా వెల్లడించాల్సి ఉంటుంది. ఇలాంటి చర్యలు తీసుకోవడం ద్వారా విదేశాల నుంచి ఇండియాకు ఎబోలా రాకుండా చూస్తున్నారు.
అలాగే, ఎబోలా సోకినట్లు అనుమానిస్తున్న లేదా నిర్ధారణ అయిన రోగి రక్తం లేదా శరీర ద్రవాలతో ప్రత్యక్షంగా సంబంధం ఉన్నవారు కూడా అధికారులకు తప్పనిసరిగా సమాచారం ఇవ్వాలని ఆదేశించారు. ఎబోలా ప్రస్తుత వ్యాప్తికి బండిబుగ్యో స్ట్రెయిన్ రకం ప్రధాన కారణం. ఈ వైరస్ రకాన్ని ఇప్పటివరకు 600 మందిలో గుర్తించారు. ఆ లక్షణాలతో 139 మంది ప్రాణాలు కోల్పోయారని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. బండిబుగ్యో స్ట్రెయిన్ కట్టడికి ఆమోదించిన టీకాలు ఏవీ అందుబాటులో లేవు. కొన్ని నెలల్లో మానవులపై ప్రయోగాలు జరగొచ్చని తెలుస్తోంది.

More Stories
నీట్ ప్రశ్నపత్రం లీక్ అనుకోవడం లేదు.. ఎన్టీఏ
భారత్-ఆఫ్రికా ఫోరమ్ సదస్సు వాయిదా
సూర్యాస్త్ర రాకెట్ వ్యవస్థ ప్రయోగం విజయవంతం