ఆఫ్రికాలోని కొన్ని ప్రాంతాలలో నెలకొన్న అత్యవసర “ఆరోగ్య పరిస్థితి” కారణంగా, భారత్-ఆఫ్రికా ఫోరమ్ సదస్సు వాయిదా పడింది. ఎబోలా కారణంగా ఈ సదస్సును వాయిదా వేయాలని భారత్, ఆఫ్రికన్ యూనియన్ నిర్ణయించినట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ (ఎంఇఎ) గురువారం తెలిపింది. వాస్తవానికి ఈ సదస్సు ఈ ఏడాది మే 28 నుండి 31 వరకు ఢిల్లీలో జరగాల్సి వుంది.
ఈ సదస్సులో ఆఫ్రికన్ నేతలు పాల్గొనాల్సి వున్నందున ప్రస్తుతం ఆఫ్రికాలో తలెత్తిన ప్రజారోగ్య పరిస్థితి దృష్ట్యా శిఖరాగ్ర సమావేశం నిర్వహణ, అనుబంధ కార్యకలాపాలపై భారత ప్రభుత్వం, ఆఫ్రికన్ ప్రభుత్వంతో చర్చలు జరిపిందని ఎంఇఎ వెల్లడించింది. చర్చల అనంతరం శిఖరాగ్ర సమావేశాన్ని వాయిదా వేయాలని ఇరుపక్షాలు అంగీకరించాయని పేర్కొంది.
కొత్త తేదీలను త్వరలో వెల్లడిస్తామని తెలిపింది. 2008, 2011, 2015లలో సదస్సులు జరిగిన తర్వాత, సుమారు 10 ఏళ్ల విరామం అనంతరం ఈ శిఖరాగ్ర సమావేశం జరగాల్సి ఉంది. అయితే, గురువారం నాడు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ, “అధిక ప్రమాదం ఉన్న దేశాల” నుండి భారతదేశంలోని నౌకాశ్రయాలు, విమానాశ్రయాలు, దేశంలోకి ప్రవేశించే అన్ని మార్గాల గుండా వచ్చే ప్రయాణికుల కోసం ఎబోలా సంబంధిత మార్గదర్శకాలను జారీ చేసింది.
ఈ సమావేశానికి హాజరుకాగల సుమారు 40 దేశాల ప్రతినిధులు, పాల్గొనేవారిలో, ఎబోలా వ్యాప్తి నేపథ్యంలో ప్రస్తుతం ‘అధిక ప్రమాదం ఉన్న దేశాలు’గా గుర్తించబడిన కొన్ని దేశాలకు చెందినవారు కూడా ఉన్నారు. డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, ఉగాండాలలో ఎబోలా ఉధృతంగా వ్యాప్తి చెందుతోంది. దీంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్ ఒ) అంతర్జాతీయంగా అత్యవసర ఆరోగ్య పరిస్థితిని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆఫ్రికాలో ఎబోలాను అదుపు చేయడానికి ‘ఆఫ్రికా సీడీసీ’ తీసుకుంటున్న చర్యలకు భారత్ తన పూర్తి సంఘీభావాన్ని, మద్దతును ప్రకటించింది.

More Stories
సూర్యాస్త్ర రాకెట్ వ్యవస్థ ప్రయోగం విజయవంతం
దేశంలో కులగణనకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్
కుట్రపూరితంగానే రైళ్లలో అగ్ని ప్రమాదాలు