బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పాడికౌశిక్ రెడ్డిపై రాష్ట్ర గవర్నర్ డా. తమిళి సై సౌందరాజన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఓటర్లను ఉద్దేశించి పాడి కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఓటర్స్ డే సందర్భంగా గవర్నర్ ప్రస్తావించారు. ఓటు వెయ్యకపోతే కుటుంబంతో ఆత్మహత్య చేసుకుంటానన్న పాడి కౌశిక్ కామెంట్స్‌పై మండిపడ్డ గవర్నర్ అలాంటి వాళ్లపై చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘాన్ని ఆదేశించారు.
హైదరాబాద్‌లోని జేఎన్‌టీయూలో నేషనల్ ఓటర్స్ డే సందర్భంగా జరిగిన కార్యక్రమంలో సీఈవో వికాస్‌రాజ్, రాష్ట్ర ఎన్నికల అధికారి పార్థసారధి, జీహెచ్‌ఎంసీ కమిషనర్ రొనాల్డ్‌రాస్ లతో కలిసి ముఖ్యఅతిధిగా పాల్గొంటూ ఎన్నికల్లో తనకు ఓటు వేయకపోతే ఆత్మహత్య చేసుకుంటా అని ఓ అభ్యర్థి అన్నారని గుర్తు చేశారు.
ఓటర్లను ఎవరూ బెదిరించకూడదని, ఇబ్బంది పెట్టకూడదని ఆమె స్పష్టం చేశారు. ఓటు శాతం పెరగడానికి ప్రకటనలు ఒక్కటే ఉపయోగపడవు అనేది ఈసీ ఆలోచన అని చెబుతూ ఓటు అనేది చాలా శక్తివంతమైన ఆయుధం అని తెలిపారు. ప్రజాస్వామ్యం బ్రతకాలంటే ఓటు వేయాలని పేర్కొంటూ మంచి అభ్యర్థిని ఓటర్ ఎన్నుకుంటే మంచి పాలన అందుతుందని చెప్పారు.
ప్రతీ ఒక్కరూ ఓటు వేయాలని కోరుతూ ఓటింగ్ రోజు సెలవు అనేది సరదా కోసం కాదని యువత గుర్తుంచుకోవాలని గవర్నర్ హితవు చెప్పారు. ఓటు హక్కు వినియోగం అనేది యుద్ధంలో పాల్గొన్నట్టు అనుకోవాలని, ఓటు వేసిన మార్క్ చూసి గర్వంగా ఫీలవ్వాలని సూచించారు. తాను నోటాకు వ్యతిరేకం అని స్పష్టం చేస్తూ ఎన్నికల బరిలో ఉన్న ఎవరో ఒకరిని యువత ఎన్నుకోవాలని ఆమె తెలిపారు.
అనంతరం 18 ఏళ్లు పూర్తి చేసుకొని కొత్తగా ఓటును పొందిన మనీషా అనే యువతికి గవర్నర్ తమిళిసై ఓటర్ ఐడీని అందించారు. అలాగే, జనరల్ ఎన్నికల్లో మెరుగైన పనితీరు కనబరిచిన పలువురు ఐఏఎస్ , ఐపీఎస్, వలంటీర్లకు గవర్నర్ సర్టిఫికేట్ అందించారు.
More Stories
అరుంధతి నగర్ లో ఇళ్ల కూల్చివేతపై ఈటెల ఆగ్రహం
భారతీయులందరూ సంస్కృత భాష నేర్చుకోవాలి
సికింద్రాబాద్ నుంచి మహా కుంభమేళాకు ప్రత్యేక రైలు