ఉప్పల్ లో గెలుపెవరిది?

భారత్, ఇంగ్లండ్ మధ్య ఐదు టెస్టు మ్యాచ్ ల సిరీస్ కు గురువారం తెరలేవనుంది. జనవరి 25న హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియం వేదికగా ఇరుజట్ల మధ్య తొలి టెస్టు మ్యాచ్ జరగనుంది. సొంతగడ్డపై సంప్రదాయ పిచ్ లపై ఎదురులేని భారత్.. బజ్ బాల్ ఆటతో హోరెత్తిస్తున్న ఇంగ్లండ్ మధ్య టెస్టు పోరు రసవత్తరంగా సాగడం ఖాయమన్న అభిప్రాయం వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో తొలి టెస్టుకు వేదికగా నిలవనున్న ఉప్పల్ స్టేడియం పిచ్ పై అందరి దృష్టి నెలకొంది. ఉప్పల్ పిచ్ స్పిన్ కు అనుకూలిస్తుందా? బౌన్స్ తో కూడిన పేస్ కు సహకరిస్తుందా? అన్న చర్చ మొదలైంది.

టెస్టుల్లో భారత్ కు కలిసొచ్చిన వేదికల్లో హైదరాబాద్ ఒకటి. ఉప్పల్ స్టేడియంలో ఐదు టెస్టులాడిన భారత్.. నాలుగింటిలో గెలుపొందింది. 2010లో న్యూజిలాండ్ తో జరిగిన మొదటి టెస్టు డ్రా కాగా.. అనంతరం వరుసగా కివీస్,ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, వెస్టిండీస్ లపై భారత్ విజయాలు నమోదు చేసింది. 2018లో ఉప్పల్ లో చివరిసారిగా విండీస్ తో టెస్టు జరిగింది. అంతకముందు జరిగిన మూడు మ్యాచ్ ల్లోనూ స్పిన్నర్లదే సంపూర్ణ ఆధిపత్యం. మరీ ముఖ్యంగా ఆఫ్ స్పిన్నర్ అశ్విన్.. ఒక్క టెస్టు మినహాయిస్తే మిగతా నాలుగింటిలో అశ్విన్ ఆడిన సందర్బాల్లో భారత్ విజయాలు సాధించడం విశేషం. ఉప్పల్ పిచ్ పై అశ్విన్ 27 వికెట్లు తీయగా.. రవీంద్ర జడేజా, ఉమేశ్ యాదవ్ చెరో 15 వికెట్లు తీశారు. ముఖ్యంగా ఉప్పల్ పిచ్ పై స్పిన్ ఆధిపత్యం స్పష్టం. మొదటి రెండ్రోజులు బ్యాటర్లు, పేసర్లకు మధ్య మంచి పోరాటం కనిపిస్తుంది. కానీ మూడో రోజు నుంచి స్పిన్నర్లకు స్వర్గధామంగా మారుతుంది.

ఇప్పటివరకు ఉప్పల్ లో జరిగిన మ్యాచ్ లే ఇందుకు నిదర్శనం. నాలుగో ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ చేయడం చాలా కష్టం. పిచ్ పరంగా చూస్తే మ్యాచ్ లో భారత్ ముగ్గురు స్పిన్నర్లు, ఇద్దరు పేసర్ల కాంబినేషన్ తో బరిలోకి దిగేలా కనిపిస్తోంది. అశ్విన్, జడేజాలతో పాటు కుల్దీప్ లేదా అక్షర్ పటేల్ దిగడం ఖాయంగా కనిపిస్తోంది. మరి ఉప్పల్ వేదికగా బజ్ బాల్ వర్సెస్ స్పిన్ అస్త్రం పోరాటంలో ఎవరు విజయం సాధిస్తారనేది చూడాలి.