రేవంత్ రెడ్డిని కలిసిన నలుగురు బిఆర్ఎస్ ఎమ్యెల్యేలు

లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. మంగళవారం నాడు పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డి ఇంటికి వెళ్లి మరీ ఆయన్ను కలిశారు. 
 
ఇదే జిల్లా నుంచి మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సైతం ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇప్పుడు వీరు సీఎంను కలవడం ఆసక్తి రేపుతోంది.  సీఎంను కలిసిన వారిలో నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి, దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, పఠాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావు ఉన్నారు.
 
వీరు మర్యాదపూర్వకంగా ముఖ్యమంత్రిని కలిసి, తమ నియోజకవర్గ సమస్యలపై మాట్లాడామని చెబుతున్నా కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారా? అనే అనుమానాలు మొదలయ్యాయి. సునీతా లక్ష్మారెడ్డి గతంలో కాంగ్రెస్ నుంచే కేసీఆర్ పార్టీలో చేరారు. కొత్త ప్రభాకర్ రెడ్డి మొదటి నుంచి గులాబీ బాస్ కేసీఆర్‌కు సన్నిహితుడు. మిగతా ఇద్దరు నేతలు కూడా మొదటి నుంచి కేసీఆర్ వెన్నంటి నడుస్తున్న వారే.
 
కొద్ది రోజుల క్రితమే రాజేంద్ర నగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్‌ను.. మంత్రి పొన్నం ప్రభాకర్ మర్యాదపూర్వకంగా కలిశారు. హైదరాబాద్ శివార్లలోని మైలార్‌దేవ్‌పల్లిలో ఉన్న ప్రకాశ్ గౌడ్ నివాసానికి వెళ్లిన ప్రభాకర్ గౌడ్ ఆయన్ను కలిశారు. అంతకు ముందే ఆయన స్వామి గౌడ్‌ను సైతం కలిశారు. ప్రకాశ్ గౌడ్‌ను పొన్నం ప్రభాకర్ కలవడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. ప్రకాశ్ గౌడ్ కాంగ్రెస్‌లో చేరతారా అనే చర్చ జరిగింది.
 
సాధారణ మెజారిటీ 60 మందికన్నా కేవలం నలుగురు ఎమ్యెల్యేలు మాత్రమే ఎక్కువగా గెలుపొంది అధికారం చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేయడం అంత కష్టం కాదంటూ కొందరు బిఆర్ఎస్ నేతలు బహిరంగంగానే ప్రకటనలు చేస్తున్నారు. కాంగ్రెస్ లో కేసీఆర్ కోవర్టులు ఉన్నారని,  దీంతో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చే ప్రమాదం ఉందంటూ  బిజెపి ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ కుమార్ ఇటీవల సంచలన ఆరోపణలు చేశారు. 
 
ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ తమ జొలికి తాను ఎంత దూరమైనా వెళ్లడానికి సిద్ధమంటూ హెచ్చరికలు జారీ చేశారు. పరోక్షంగా తన ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నం చేస్తే బిఆర్ఎస్ ఎమ్యెల్యేలనే తాను చీల్చగలననే సంకేతం ఇచ్చారు.