గూగుల్‌ ట్రెండ్స్‌లో రికార్డు సృష్టించిన అయోధ్య

* రామనామంతో మార్మోగిన న్యూయార్క్‌ టైమ్‌స్కేర్‌

  రామ మందిరం ప్రారంభోత్సవం, ప్రాణ ప్రతిష్ఠ నేపథ్యంలో యావత్‌ ప్రపంచ దృష్టి అయోధ్యపైనే నెలకొన్నది. ఈ క్రమంలో గూగుల్‌ ట్రెండ్స్‌లో అయోధ్య రికార్డుబద్దలు కొడుతూ చరిత్ర సృష్టించింది. అయోధ్య నగరంలో జరిగే ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం సందర్భంగా గూగుల్‌ అత్యధికంగా రాముడు, అయోధ్య, ప్రాణ ప్రతిష్ఠ గురించి గూగుల్‌లో ఎక్కువగా సెర్చ్‌ చేశారు. 

గూగుల్‌ ట్రెండ్‌ (google.com/trends/trendingsearches)లో టాప్‌ సెర్చ్‌లన్నీ రామ మందరానికి సంబంధించినవే ఉండడం దాదాపు ఇదే తొలిసారి. గతంలో గత 24 గంటల్లో ఈ తరహాలో ట్రెండ్స్‌ కనిపించకపోవడం గమనార్హం.  గత 24 గంటల్లో అత్యధికంగా సెర్చ్‌ చేసిన అంశాల్లో అయోధ్య, హిందూ దేవాలయం, రామ, హారతి, భారతీయ జనతా పార్టీ, అయోధ్య, నరేంద్ర మోదీ, బాబ్రీ మసీద్‌ కూల్చివేత, ఇండియన్‌ నేషనల్‌ కాంగ్రెస్‌, ఆచార్య ప్రమోద్‌ కృష్ణం, ప్రాణ ప్రతిష్ఠ, డిగ్నిటీ ఆఫ్‌ లైఫ్‌ తదితర అంశాలపై నెటిజన్స్‌ గూగుల్‌లో తెగ వెతికారు. 

వీటితో పాటు రామ మందిరం ప్రతిష్ఠ సమయం, అయోధ్య ప్రత్యక్ష ప్రసారం, రామమందిరం ప్రాణ ప్రతిష్ఠ శుభాకాంక్షలు, రామమందిరం శుభాకాంక్షలు గురించి సెర్చ్‌ చేశారు. ఇదిలా ఉండగా.. 5,  ఆగస్టు 2020న రామమందిరానికి మోదీ శంకుస్థాపన చేసిన సమయంలోనూ అయోధ్య రామ మందిరం గూగుల్‌లో ట్రెండ్‌ అయ్యింది.

మరోవంక, ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం నేపథ్యంలో అమెరికా న్యూయార్క్‌లోని ప్రఖ్యాత టైమ్స్‌ స్వ్కేర్‌ పై శ్రీరాముడి చిత్రాలను ప్రదర్శించారు. అదేవిధంగా ఆ ప్రాంగణం అంతా రామ నామ జపంతో మార్మోగింది. అక్కడ ప్రవాస భారతీయులు మన సంప్రదాయాలు ఉట్టిపడేలా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించుకున్నారు. రామ భజనలు, కీర్తనలతో శ్రీరాముడి జెండాలను చేతబూని నగర వీధుల్లో హోరెత్తించారు.
 
న్యూయార్క్‌లోని టైమ్స్‌ స్క్యేర్‌ సహా అమెరికా వ్యాప్తంగా 300 చోట్ల అయోధ్య ప్రాణప్రతిష్ట కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం జరిగింది. కరీబియన్‌ దేశం ట్రినిడాడ్‌, టొబాగోలో నిర్వహించిన వేడుకలో 5 వేల మందికిపైగా భారత సంతతి పౌరులు పాల్గొన్నారు. మారిషస్‌ ప్రభుత్వం హిందూ ఉద్యోగులకు ప్రత్యేకంగా రెండు గంటల సెలవు ప్రకటించింది. 
 
‘శ్రీరాముడు తిరిగి అయోధ్యలో కొలువుతీరటం సంతోషదాయకం. ప్రజల శాంతి, శ్రేయస్సుకు శ్రీరాముడి బోధనలు, ఆశీర్వాదం కావాలి. జై హింద్‌! జై మారిషస్‌!’ అంటూ మారిషస్‌ ప్రధాని ప్రవింద్‌ కుమార్‌ జుగ్నౌత్‌ ‘ఎక్స్‌’లో సందేశాన్ని పోస్ట్‌ చేశారు.
 
మెక్సికోలో తొలి శ్రీరామ, హనుమ ఆలయాలు క్వెరిటారో నగరంలో వెలిశాయి. ప్రాణ ప్రతిష్ట కార్యక్రమాల్ని వైభవంగా చేపట్టారు. భారత్‌ నుంచి తెప్పించిన విగ్రహాలకు అమెరికన్‌ పూజారితో ‘ప్రాణ ప్రతిష్ట’ నిర్వహించారు. ఈ వేడుకల్లో మెక్సికన్లు పెద్ద సంఖ్యలో హాజరయ్యారని మెక్సికోలోని భారత దౌత్యకార్యాలయం ‘ఎక్స్‌’లో తెలిపింది.
 
అమెరికా, కెనడాల్లో ‘రామ మందిర యాత్ర’ను చేపడతామని వరల్డ్‌ హిందూ కౌన్సిల్‌ ఆఫ్‌ అమెరికా, విశ్వ హిందూ పరిషత్‌(కెనడా) సంయుక్తంగా ప్రకటించాయి. 45 రోజులపాటు సాగే ఈ యాత్రలో రెండు దేశాల్లోని దాదాపు 1000కిపైగా ఆలయాల్ని సందర్శిస్తామని తెలిపాయి.

అయోధ్య రామ మందిరంలో శ్రీరాముడి ప్రాణప్రతిష్ఠ మహోత్సవం సందర్భంగా నేపాల్‌లోని సీతాదేవి పుట్టినిళ్లయిన జనక్‌పూర్‌లో కూడా ఘనంగా ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. సీతాదేవి జనక మహారాజుకు జనక్‌పూర్‌లోనే దొరికిందని పురాణాలు చెబుతున్నాయి. శ్రీరాముడి ప్రాణప్రతిష్ఠ నేపథ్యంలో ఇక్కడి సీతారామాలయంలో కూడా ఉత్సవాలు నిర్వహించారు. రోజంతా ఆలయంలో సందడి నెలకొంది. చీకటి పడగానే ఆలయంలో దీపోత్సవం నిర్వహించారు.