కోటి ఇళ్లలో సోలార్ విద్యుత్ వెలుగులకై ప్రధాని కొత్త పథకం 

అయోధ్యలో మహత్తరమైన ప్రాణ ప్రతిష్ఠ క్రతువును ముగించుకొని ఢిల్లీకి చేరుకున్న వెంటనే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కొత్త పథకాన్ని ప్రకటించారు. ‘ప్రధానమంత్రి సూర్యోదయ యోజన’ పేరుతో ప్రకటించిన ఈ పథకం ద్వారా దేశంలో కోటి ఇళ్లలో సోలార్ విద్యుత్ వెలుగులు నింపనున్నట్లు తెలిపారు.
 
సూర్యవంశీయుడైన శ్రీరాముడి దివ్య ఆశీస్సులత కోటి మంది ఇళ్ల పైకప్పుపై సోలార్ విద్యుత్ ప్యానెళ్లు ఏర్పాటు చేస్తామని సోమవారం సాయంత్రం ప్రధాని మోదీ ప్రకటించారు. అయోధ్య నుంచి ఢిల్లీలోని తన నివాసానికి చేరుకున్న వెంటనే ఈ  పథకంపై మంత్రులు, అధికారులతో ప్రధాని మోదీ సమీక్ష నిర్వహించారు. ఇళ్లపై అమర్చనున్న సోలార్ ప్యానెళ్ల ఫోటోలను సోషల్ మీడియా ద్వారా షేర్ చేశారు.
 
‘సూర్యవంశీయుడైన భగవంతుడు శ్రీరాముని కాంతి నుంచి ప్రపంచలోని భక్తులందరూ ఎల్లప్పుడూ శక్తిని పొందుతారు. ఈ రోజు అయోధ్యలో పవిత్రమైన ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవం సందర్భంగా.. దేశంలోని ప్రజలు తమ ఇళ్ల పైకప్పుపై సొంత సోలార్ రూఫ్‌టాప్ వ్యవస్థను కలిగి ఉండాలనే నిర్ణయం తీసుకున్నాం. ఇది నాకు మరింత ఆనందాన్నిస్తోంది. అయోధ్య నుంచి తిరిగి వచ్చిన తర్వాత నేను తీసుకున్న మొదటి నిర్ణయం ఇది’ అని ప్రధాని మోదీ పేర్కొన్నారు. 
 
“పేద, మధ్యతరగతి ప్రజలకు విద్యుత్ బిల్లులను తగ్గించడానికి ఈ పథకం సహాయపడుతుందని ప్రధాని మోడీ అన్నారు. దీనికి తోడు గా.. మధ్యతరగతి కూడా ఇంధన రంగంలో భారత్ ను స్వయం సమృద్ధి సాధించేలా చేస్తుంది,” అని మోదీ పేర్కొన్నారు. ‘దేశంలో 1 కోటి ఇళ్లపై సోలార్ రూఫ్‌టాప్‌లను ఏర్పాటు చేసే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి సూర్యోదయ యోజనను ప్రారంభించనుంది’ అని ప్రధాని మోదీ పోస్టు చేశారు.
 
ఇళ్లపై సోలార్ ప్యానెళ్లను అమర్చడం దేశంలో ఇంకా ఊపందుకొని సమయంలో ప్రధాని ఈ పధకం ప్రకటించడం ప్రాధాన్యత సంతరింప చేసుకుంది.  2022 చివరి నాటికి 40 గిగావాట్ల లక్ష్యాన్ని చేరుకోవాలని లక్ష్యంగా పెట్టుకోగా, కేవలం 5.87 గిగావాట్ల రూఫ్ టాప్ సోలార్ ప్రాజెక్టులను మాత్రమే ఏర్పాటు చేశారని, ఇది ఆశించిన లక్ష్యంలో 15% కంటే తక్కువని గత ఏడాది మేలో పార్లమెంటు స్టాండింగ్ కమిటీ తెలిపింది.

ప్రస్తుతం గ్రిడ్ కనెక్టెడ్ సోలార్ రూఫ్ టాప్ సామర్థ్యం 72.31 గిగావాట్లలో 11.08 గిగావాట్లు ఉన్నట్లు కొత్త, పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ తెలిపింది. ప్రభుత్వ ఎనర్జీ ట్రాన్సీషన్​ ప్లాన్​ ప్రకారం 2030 నాటికి మొత్తం పునరుత్పాదక సామర్థ్యం 500 గిగావాట్లలో సౌర విద్యుత్ 292 గిగావాట్లు అవుతుందని భావిస్తున్నారు.

ఈ పరిణామంపై సోలార్ స్క్వేర్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రేయా మిశ్రా మాట్లాడుతూ. “నేడు, భారతదేశంలో 1% కంటే తక్కువ ఇళ్లలో సోలార్ ఉంది, కానీ ఈ కథ మారబోతోంది. సోలార్​తో ”ఎనర్జీ ఇండిపెండెంట్​”గా మారడానికి వినియోగదారుల నుంచి ఆసక్తి ఉంది. హోమ్ సోలార్ అడాప్షన్​లో జర్మనీ, ఆస్ట్రేలియా, బ్రెజిల్ వంటి అధునాతన రెసిడెన్షియల్ సోలార్ మార్కెట్ల సరసన భారత్ త్వరలో చేరుతుంది,” అని అభిప్రాయపడ్డారు.