ప్రపంచ పర్యాటక కేంద్రంగా మారనున్న అయోధ్య

అయోధ్యలో రామ మందిరం ప్రారంభోత్సవం సోమవారం ఘనంగా జరిగిన నేపథ్యంలో ప్రపంచ పర్యాటక కేంద్రంగా ఇది రాణిస్తుందని అంతా భావిస్తున్నారు.
మరో ఏడాదిలో అయోధ్యకు ఐదు కోట్ల మందికి పైగా పర్యాటకులు వస్తారని అంచనా వేస్తున్నారు. ప్రపంచంలోనే అత్యధికంగా పర్యాటకులను ఆకర్షించే ఆధ్యాత్మిక కేంద్రంగా ప్రసిద్ధి చెందగలదని భావిస్తున్నారు.
 
ఇప్పుడు దేశంలోకెల్లా అత్యంత రద్దీ అయిన ఆలయంగా అయోధ్య రామాలయం నిలిచే అవకాశం ఉంది. ఎక్కువ మంది సందర్శించుకునే ఆలయాల జాబితాలో అమృతసర్ లోని గోల్డెన్ టెంపుల్, తిరుమల వేంకటేశ్వర స్వామి ఆలయం అగ్రస్థానంలో కొనసాగనుండగా ఈ ఏడాది ఆ స్థానాన్ని అయోధ్య ఆక్రమించే అవకాశం ఉంది.
 
పంజాబ్‌లోని గోల్డెన్‌ టెంపుల్‌, ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతిలకు మించిన భక్తుల రద్దీ ఉంటుందని భావిస్తున్నారు. ప్రస్తుతం పంజాబ్‌ రాష్ట్రం అమృత్‌సర్‌లోని గోల్డెన్ టెంపుల్‌ను ప్రతి ఏటా సుమారు 3 నుండి 3.5 కోట్లమంది సందర్శిస్తున్నారు.  ఏపీలోని తిరుమల శ్రీవారిని ఏటా సుమారు 2.5 నుండి 3 కోట్లమంది భక్తులు దర్శిస్తున్నారు. 
 
ప్రపంచంలోకెల్లా సంపన్న ఆలయాల జాబితాలో తిరుమల ముందు వరుసలో ఉండగా.. అయోధ్య కూడా ఈ జాబితాలో చేరనుంది. కాగా, ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవ మతానికి ప్రసిద్ధి చెందిన వాటికన్ నగరంలో ప్రతి సంవత్సరం సుమారు 90 లక్షల మంది పర్యటిస్తున్నారు. ఇక ముస్లింలకు ఎంతో ప్రవిత్రమైన సౌదీ అరేబియాలోని మక్కాను ఏటా సుమారు 2 కోట్లమంది సందర్శిస్తున్నారు.
 
రోజుకు 3 లక్షల మందికిపైగా భక్తులు ఆ అయోధ్య రాముణ్ని సందర్శిస్తారని అంచనా. భక్తుల తాకిడి ఈ ఒక్క ఏడాదికే పరిమితం కాబోదు. 3-4 ఏళ్లపాటు ఇదే సంఖ్యలో అయోధ్య రాముడి దర్శనం కోసం భక్తులు తరలి వస్తారని అంచనా వేస్తున్నారు. 
 
ప్రభుత్వం కూడా ఇందుకు తగ్గట్టుగానే అయోధ్య చేరుకోవడానికి రైలు, విమాన సదుపాయాలను కల్పిస్తోంది. రోజుకు 60 వేల మంది ప్రయాణికులు వచ్చినా ఇబ్బంది కలగకుండా అయోధ్య రైల్వే స్టేషన్‌‌ను విస్తరించారు. ఏడాదికి 10 లక్షల మందికి ప్రయాణికులు వస్తారనే అంచనాతో అయోధ్య విమానాశ్రయాన్ని నిర్మించారు. 
 
ఏటా 60 లక్షల మంది ప్రయాణికుల సామర్థ్యంతో 2025 నాటికి టెర్మినల్‌ను విస్తరించనున్నారు. అయోధ్య ఇక ప్రత్యేక బస్సుల ద్వారానూ భారీ సంఖ్యలోనూ భక్తులు అయోధ్య చేరుకునే అవకాశం ఉంది. అయోధ్య నగరం పునరుద్ధరణ, కొత్త విమానాశ్రయం, రైల్వే స్టేషన్‌ ఆధునీకరణ, రోడ్డు కనెక్టివిటీ, టౌన్‌షిప్‌ డెవలప్‌మెంట్‌ కోసం సుమారు రూ.85,000 కోట్లు ప్రభుత్వం ఖర్చు చేసినట్లు బ్రోకరేజ్ సంస్థ జెఫరీస్ అంచనా వేసింది.
 
దేశంలో అత్యధిక మంది భక్తులు సందర్శించే ఆలయాల్లో ఉత్తర ప్రదేశ్‌లో ఉన్న కాశీ విశ్వనాథ్ ఆలయం ఒకటిగా ఉంది. ఇప్పుడు రామ మందిరం కూడా ప్రారంభం కావడంతో ఆధ్యాత్మికంగా ఉత్తరప్రదేశ్ ప్రాధాన్యం మరింత పెరగనుంది. అంతే కాదు అత్యధిక మంది దేశీయ పర్యాటకులు సందర్శించే రాష్ట్రంగా ఇప్పటికే అగ్రస్థానంలో ఉన్న ఉత్తర ప్రదేశ్ రాముడి రాకతో తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకోనుంది. 
 
ఆగ్రాలోని తాజ్ మహల్, ఎక్స్‌ప్రెస్ వేలు, అయోధ్య, వారణాసి.. వీటన్నింటి వల్ల ఉత్తర ప్రదేశ్‌ పర్యాటకం ఊపందుకోనుంది. ఇటీవలే దేశంలోనే రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా యూపీ ఎదిగింది. తాజాగా రాముడి రాకతో ఆ రాష్ట్ర జీడీపీ వృద్ధి మరింత వేగంగా పెరగనుంది. కాగా, అయోధ్యలో ప్రస్తుతం 590 గదులతో కూడిన 17 హోటల్స్‌ ఉన్నాయి. కొత్తగా 73 హోటల్స్‌ నిర్మించేందుకు ప్రతిపాదించారు. సుమారు 40 హోటళ్లు నిర్మాణ దశలో ఉన్నాయి. ప్రసిద్ధ ఇండియన్ హోటల్స్, మారియట్, విండ్‌హామ్ హోటళ్ల కోసం ఇప్పటికే ఒప్పందాలు జరిగాయి. 

ఐటీసీ కూడా అయోధ్యలో హోటల్‌ నిర్మాణంపై కసరత్తు చేస్తోంది. అయోధ్యలో హోటల్ గదులను వెయ్యికి అనుసంధానం చేయాలని ఓయో యోచిస్తోంది. మరోవైపు భారీ అభివృద్ధి వల్ల ఉత్తరప్రదేశ్‌తోపాటు అయోధ్యకు పర్యాటకుల తాకిడి భారీగా పెరుగుతుందని ఎస్‌బీఐ నివేదిక అంచనా వేసింది.  ఉత్తరప్రదేశ్‌లోని పర్యాటకుల మొత్తం ఖర్చు ఏడాదికి రూ.4 లక్షల కోట్ల మార్కును అధిగమించే అవకాశం ఉందని ఆ నివేదికలో పేర్కొంది. తద్వారా ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వానికి ఏటా సుమారు రూ.25,000 కోట్ల ఆదాయం లభిస్తుందని బిజినెస్‌ ఏజెన్సీలు అంచనా వేశాయి.