బ్రిటిషర్లను గడగడలాడించిన యోధుడు మన నేతాజీ..!!

“మీ రక్తాన్ని ఇవ్వండి.. నేను మీకు స్వాతంత్య్రాన్ని ఇస్తాను.” అంటూ యువతరాన్ని స్వాతంత్య్ర సంగ్రామం వైపు నడిపించి.. ఉద్యమాన్ని ఉవ్వెత్తున ఎగసేలా చేసిన ధీశాలి.. సుభాష్ చంద్రబోస్.  దేశయవనికపై స్వామి వివేకానంద తర్వాత అంతటి ప్రభావాన్ని, దేశభక్తిని చూపిన వీరుడాయన. అహింస కంటే హింస ద్వారానే బ్రిటీషర్లు వేసిన బానిస సంకెళ్లు తెంచుకోవచ్చని నమ్మి.. ఏకంగా సొంత ఆర్మీనే సృష్టించి.. స్వాతంత్య్ర ఉద్యమాన్ని మరో మలుపు తిప్పిన ధీరుడాయన.
1897 జనవరి 23 న ఒడిశాలోని కటక్ లో జానకీనాథ్ బోస్, ప్రభావతి దేవీ దంపతులకు జన్మించారు. 1920 లో భారత సివిల్ సర్వీస్ లో 4 వ ర్యాంకు సాధించిన మేధావి. కానీ  ఏడాది తిరగకుండానే.. 1921 లో సివిల్ సర్వీస్ నుంచి వైదొలగి.. భారత జాతీయ కాంగ్రెస్ యువజన విభాగంలో చేరారు. మొదట్లో గాంధీజీ అడుగుజాడల్లో నడిచిన సుభాష్ చంద్రబోస్.. ఆయన సూచన మేరకు కలకత్తాలో చిత్తరంజన్ దాస్ తో కలిసి బెంగాల్ ఉద్యమంలో పాల్గొన్నారు.
1938 లో భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. అయితే ఇది గాంధీజీకి ఏమాత్రం రుచించలేదు. అయితే తర్వాత జరిగిన పరిణామాల వల్ల 1939 లో కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి భారత ఫార్వార్డ్ బ్లాక్ అనే పార్టీని స్థాపించారు. ప్రపంచదేశాల్లో జరుగుతున్న పరిణామాలపై పట్టు పెంచుకున్న బోస్  రష్యాలో స్టాలిన్ ను, జర్మనీలో హిట్లర్ ను కలిశారు. ఆయా దేశాల్లోని భారత సంతతి వ్యక్తులను కలిశారు.
ఆజాద్ హింద్ రేడియో ప్రసారాలు ప్రారంభించారు. వాటి ద్వారానే రాజ్ బిహారీ బోస్ ప్రారంభించిన ఇండియన్ నేషనల్ ఆర్మీ లో చేరేలా ప్రోత్సహించారు. అలా దాదాపు 40 వేల మందితో ఐఎన్ఏ ఏర్పాటైంది. ఆ సందర్భంలోనే ఆయన స్వాతంత్య్ర అడిగితే వచ్చేది కాదని.. పోరాడి సాధించుకోవాల్సింది అని నినదించారు. అయితే 1939 లో ప్రారంభమైన రెండవ ప్రపంచ యుద్ధంలో.. సుభాష్ చంద్రబోస్ నేతృత్వంలోని ఇండియన్ నేషనల్ ఆర్మీ ఓడిపోయింది. 1942 లో INA ను రాజ్ బిహార్ బోస్.. సుభాష్ చంద్రబోస్ కు అప్పగించారు.
దీన్ని పునరుద్దరించిన బోస్.. ఆజాద్ హింద్ ఫౌజ్ గా మార్చారు. ఇది సాయుధ బలగాల శక్తికి మారుపేరుగా నిలిచింది. బ్రిటిషు పాలన నుండి దేశానికి విముక్తి కలిపించడమే ఈ సంస్థ లక్ష్యంగా ప్రకటించారు. దీంతో ఈ ఫౌజులో వేలాదిగా పౌరులు, మాజీ ఖైదీలు చేరారు. ఇలా సైనిక చర్య ద్వారా దేశానికి స్వాతంత్య్రం సాధించాలనే పట్టుదలతో ఉన్న సుభాష్ చంద్రబోస్, 1945 ఆగస్టు 18న తైవాన్ మీదుగా టోక్యోకు విమానంలో ప్రయాణిస్తున్న సమయంలో విమాన ప్రమాదం సంభవించింది.
అయితే ఇందులో ప్రయాణిస్తున్న బోస్ మరణించారనే వాదనలు ఉన్నాయి. కానీ ఇప్పటివరకు చంద్రబోస్ మరణాన్ని అధికారికంగా ధృవీకరించలేదు. ఆ మధ్య కేంద్రంలోని నరేంద్రమోడీ ప్రభుత్వం.. ఆయన మరణంలోని మిస్టరీని ఛేదించే క్రమంలో ఎన్నో ఫైల్స్ బహిర్గతం చేశారు. అయినా ఆయన మరణవార్తను మాత్రం ప్రకటించలేదు. అలా స్వాతంత్య్ర సంగ్రామంలో బోస్ వేసిన ముద్ర ఎన్నటికీ చెరిగిపోదు.
స్వాతంత్య్రాన్ని ప్రకటించాక బోస్ గురించి బ్రిటీషర్లు ఆరా తీశారంటేనే.. వారిని ఆయన ఎంతలా భయపెట్టారో అర్థం చేసుకోవచ్చు. రెండో ప్రపంచ యుద్ధం ముగిశాక.. ఆ ఆనందాన్ని కూడా అనుభవించకుండా బ్రిటీషర్లకు నిద్రలేకుండా చేసిన చరిత్ర బోస్ ది. 1924లో బ్రిటిష్ పార్లమెంటులో చంద్రబోస్ గురించి  ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశారంటే.. పరిస్థితి ఎంతలా ఉండేదో అర్థం చేసుకోవచ్చు.
“చేవ చచ్చిన చేతులతో అర్థిస్తే స్వాతంత్ర్యం రాదు. పిడికిలి బిగించి గర్జించాలి.” అంటూ భారతీయులను ఉత్తేజపరిచి స్వాతంత్య్ర పోరాటానికి సరికొత్త శక్తినిచ్చిన వీరుడు నేతాజీ.  స్వాతంత్య్రపోరాటంలో ఆయన చేసిన ఆలోచనలు, వేసిన అడుగులు.. ఎన్నో తరాలకు కావాల్సిన శక్తిని ఇస్తాయి.