
కాంగ్రెస్ అగ్రనేత, వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీపై అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. భారత్ జోడో న్యాయ్ యాత్ర పేరుతో రాహుల్ రాష్ట్రంలో అశాంతిని సృష్టించారని మండిపడ్డారు. ఈ మేరకు రాహుల్‌పై క్రిమినల్ కేసు నమోదు చేయాలంటూ రాష్ట్ర పోలీసులను ఆదేశించారు.
మణిపూర్ నుంచి మహారాష్ట్ర వరకు కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో న్యాయ యాత్ర రెండు రోజుల క్రితం అస్సాంలో ప్రవేశించినప్పటి నుండి అడ్డంకులు ఎదురవుతున్నాయి. సోమవారం అస్సాంలోని ఓ ఆలయంలోకి వెళ్లకుండా అక్కడి అధికారులు రాహుల్‌ను అడ్డుకున్నారు. ఆ తర్వాత మోరెగావ్ జిల్లాలో పాదయాత్రకు, స్ట్రీట్ కార్నర్ మీటింగ్‌కు అనుమతి నిరాకరించారు.
అయినా రాహుల్‌గాంధీ మంగళవారం మోరెగావ్‌లో పాదయాత్రకు వెళ్లడంతో ఈ యాత్ర వల్ల శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందని పేర్కొంటూ యాత్రను పోలీసులు అడ్డుకున్నారు. రాహుల్ గాంధీతో పాటు గౌహతిలోకి ప్రవేశించడానికి ప్రయత్నించిన సుమారు 5,000 మంది కాంగ్రెస్ కార్యకర్తలను అస్సాం పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆ పార్టీ కార్యకర్తలు పోలీసులతో వాగ్వాదానికి దిగి పోలీసుల బారికేడ్లను బద్దలు కొట్టారు.
అది తీవ్రమై ఘర్షణలకు దారి తీసింది. కాంగ్రెస్ కార్యకర్తలు పోలీసులు పెట్టిన బారికేడ్లను తోసుకుంటూ ముందుకు వెళ్లడానికి ప్రయత్నించారు. వారిని అడ్డుకోవడానికి పోలీసులు లాఠీ చార్జి చేశారు. దాంతో, ఆ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొన్నది. ఈ సందర్భంగా గువాహటి సరిహద్దుకు సమీపంలో జరిగిన సభలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ, తమ పార్టీ కార్యకర్తలు ఎప్పుడూ నిబంధనలను ఉల్లంఘించరని, శాంతిభద్రతలకు విఘాతం కలిగించరని స్పష్టం చేశారు.
అయితే, దాని అర్థం తమ కార్యకర్తలు బలహీనులని కాదని చెప్పారు. నిబంధనలనకు అనుగుణంగా నడుచుకుంటున్న కాంగ్రెస్ కార్యకర్తలపై పోలీసులు దౌర్జన్యంగా లాఠీ చార్జి చేశారని పేర్కొంటూ సంయమనంతో వ్యవహరిస్తున్న కాంగ్రెస్ కార్యకర్తలను బలహీనులుగా భావించవద్దని హెచ్చరించారు. కాంగ్రెస్ కార్యకర్తలు ‘బబ్బర్ షేర్’ లు అని బస్సుపై నిలబడి నినదించారు.
ఈ నేపథ్యంల ప్రజలను రెచ్చగొట్టినందుకు రాహుల్ గాంధీపై కేసు నమోదు చేయాలని అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ రాష్ట్ర పోలీసులను ఆదేశించారు. రెచ్చగొట్టే చర్యలు అస్సామీ సంస్కృతిలో భాగం కాదని చెప్పారు. తమది శాంతియుత రాష్ట్రమని, ఇలాంటి ‘నక్సలైట్ ఎత్తుగడలు’ అస్సాం సంస్కృతికి పూర్తిగా విరుద్ధమని తెలిపారు.
‘‘జనాన్ని రెచ్చగొట్టినందుకు @RahulGandhi మీ నాయకుడిపై కేసు నమోదు చేయాలని నేను @DGPAssamPolice ఆదేశించాను. మీ హ్యాండిల్స్ లో మీరు పోస్ట్ చేసిన ఫుటేజీని సాక్ష్యంగా ఉపయోగించండి” అని అస్సాం ముఖ్యమంత్రి శర్మ కాంగ్రెస్ ను ఉద్దేశించి ట్విట్టర్ లో ఒక పోస్ట్ పెట్టారు. ట్రాఫిక్ జామ్‌లను నివారించేందుకు యాత్రను నగరంలోకి అనుమతించడం లేదని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.
మరోవంక, మేఘాలయ యూనివర్శిటీలోకి కేంద్రం అనుమతి నిరాకరించడంపై రాహుల్ గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులతో ముఖాముఖీపై కేంద్ర హోం మంత్రి అమిత్‌షా సూచనల మేరకే అధికారులు ఆంక్షలు విధించారని ఆరోపించారు. మేఘాలయలోని సైన్స్ అండ్ టెక్నాలజీ యూనివర్శిటీ విద్యార్థులు, పౌర సమాజ సభ్యులు మరియు పార్టీ ప్రతినిధులతో వేర్వేరుగా చర్చలు జరపాల్సి వుందని, అయితే యూనివర్శిటీ అనుమతిని వెనక్కి తీసుకుందని తెలిపారు.
More Stories
`సర్వ స్పర్శి, సర్వవ్యాపి’గా ఆర్ఎస్ఎస్ అన్ని అంశాల స్పృశి
జస్టిస్ వర్మపై సుప్రీం అంతర్గత విచారణ
బిజెపిపై విషం కక్కడమే వారి అజెండా!