రైల్వే పరంగా ఎంతో వెనుకబడి ఉన్న ఉమ్మడి చిత్తూరు జిల్లా మీదుగా అత్యంత వేగంగా నడిచే అత్యాధునిక బుల్లెట్ ట్రైన్ రాగలదని భావిస్తున్నారు.ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం గాంధీనగర్ నుంచి ముంబాయికి బుల్లెట్ ట్రైన్ పనులు వేగంగా జరుపుతున్నది. ఇది దేశంలో మొట్టమొదటి బుల్లెట్ ట్రైన్ అవుతుంది.
అలాగే చెన్నై నుంచి మైసూర్‌కు బుల్లెట్ ట్రైన్ నడపాలని కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. చెన్నై నుంచి బెంగళూరు వయా మైసూరు వెళ్లాలంటే సుమారు పది గంటలు సమయం పడుతుంది. బుల్లెట్ ట్రైన్ పనులు పూర్తయితే చెన్నై నుంచి మైసూర్‌కు సుమారు రెండు నుంచి రెండున్నర గంట సమయం పడుతుంది.
ఉమ్మడి చిత్తూరు జిల్లా మీదుగా ఈ బుల్లెట్ ట్రైన్ నడపడానికి రైల్వే ఉన్నతాధికారులు ప్రణాళికను రచించారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా ఇటు కర్ణాటక అటు తమిళనాడు సరిహద్దు కావడంతో ఇటు వ్యాపారంగా అటు విద్య, వైద్య ఎంతోమంది చిత్తూరు జిల్లా వాసులకు బుల్లెట్ ట్రైన్ రావడంతో ఎంతో సమయం కలిసి రానుంది.
గత రైల్వే బడ్జెట్లో చెన్నై మైసూర్ మధ్య బుల్లెట్ ట్రైన్ నడపాలని కేంద్ర బడ్జెట్లో ప్రతిపాదనలు తయారు చేశారు. బుల్లెట్ ట్రైన్ కు ప్రత్యేక రైల్వే ట్రాక్ ఏర్పాటు చేయాలని అందుకు తగ్గట్టుగా ప్రణాళికను రచిస్తున్నారు. ఈ పనులు ఐదేళ్ల లోపు పూర్తి చేయాలని కేంద్రం భావిస్తుంది.
బుల్లెట్ ట్రైన్ చిత్తూరు మీదుగా వెళ్లడం వల్ల ఉమ్మడి చిత్తూరు జిల్లా వాసులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. మూడు రాష్ట్రాల మీదుగా తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటకను కలుపుతూ 340 గ్రామాల మీదుగా బుల్లెట్ ట్రైన్ రాకపోకలు సాగించేలా అధికారులు డీపీఆర్ రూపొందించారు. ఈ ట్రైన్‌కు చిత్తూరులో కూడా స్టాపింగ్ ఇవ్వనున్నారు.
జిల్లాలోని 41 గ్రామాల మీదుగా బుల్లెట్ ట్రైన్ ప్రయాణించనుంది. ఈ మేరకు 435 కిలోమీటర్ల వరకు 18 మీటర్ల వెడల్పుతో ఫ్లైఓవర్ నిర్మించేందుకు డిజైన్ రూపొందించారు. హైదరాబాద్‌కు చెందిన ఓ సంస్థ ఇప్పటికే శాటిలైట్, ల్యాండ్ సర్వే పూర్తి చేసింది.
750 మంది ప్రయాణికులతో గంటకు 250 నుంచి 350 కిలోమీటర్ల వేగంతో బుల్లెట్ ట్రైన్ వెళ్లేందుకు వీలుగా ఫ్లైఓవర్‌ను నిర్మించనున్నారు. గుడిపాల మండలంలోని 189 కొత్తపల్లె వద్ద చిత్తూరు స్టాపింగ్ ఏర్పాటు చేస్తున్నారు. ఎన్‌హెచ్‌ఎస్‌ఆర్‌సీఎల్ అధికారులు భూసేకరణలో భాగంగా గ్రామ సభలు నిర్వహిస్తున్నారు.
41 గ్రామాలకు గాను 30 గ్రామాలకు చెందిన రైతులతో ఇప్పటికే సమావేశాలు పూర్తి చేశారు. భూములు ఇచ్చిన వారి కుటుంబంలో చదువుకున్న వారికి ఏదో ఒక విధంగా ఉద్యోగావకాశం కల్పిస్తామని అధికారులు హామీ ఇస్తున్నారు. దీనిపై పలువురు రైతులు సుముఖత వ్యక్తం చేసినట్లు అధికారులు వెల్లడిస్తున్నారు. రైతులకు మార్కెట్ ధర కంటే ఐదు రెట్లు పరిహారం ఇవ్వాలని నిర్ణయించారు.
More Stories
భారత్ బలం అద్భుతమైన ఐక్యతలోనే ఉంది
అయోధ్య రామయ్యకు టిటిడి పట్టువస్త్రాలు
గిరిజనులు వ్యాపార రంగంలోకి రావాలి