అయోధ్యలో ముగ్గురు అనుమానిత ఉగ్రవాదుల అరెస్ట్‌

అయోధ్యలో రాములవారి ప్రాణప్రతిష్ఠకు సర్వం సిద్ధమైంది. ఇప్పటికే రామ్‌ లల్లా గర్భగుడికి చేరుకున్నారు. దీంతో రామ నగరిలో భద్రతను ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం కట్టుదిట్టం చేసింది. ఇప్పటికే పోలీసులు అయోధ్యను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా చర్యలు తీసుకుంటున్నారు. 
 
ఈ క్రమంలో విశ్వసనీయ వర్గాల ద్వారా అందిన సమాచారం మేరకు అయోధ్య జిల్లాలో యూపీ యాంటీ టెర్రరిజమ్‌ స్క్వాడ్‌ (ఎస్‌ఏటీ) పోలీసులు ముగ్గురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు.  అయోధ్య జిల్లాలో తనిఖీల సందర్భంగా ముగ్గురు అనుమానితులను ఎస్‌ఏటీ పోలీసులు అరెస్టు చేసినట్లు యూపీ స్పెషల్‌ డీజీపీ ప్రశాంత్‌ కుమార్‌ తెలిపారు. 
 
అయితే, ఏ గ్రూప్‌నకు చెందినవారనే విషయమే తెలియాల్సి ఉన్నదని చెప్పారు. వారిని విచారిస్తున్నామని వెల్లడించారు.  అయోధ్యలో వేర్వేరు ప్రాంతాల నుంచి వారిని అదుపులోకి తీసుకున్నారు. వేర్పాటువాద సంస్థ ఖలిస్తానీతో సంబంధాలు ఉన్నట్లుగా అనుమానిస్తున్నారు. ఈ ముగ్గురూ- రాజస్థాన్‌ సికార్ జిల్లాకు చెందిన ధరమ్‌వీర్, అతని సహచరులుగా చెబుతున్నారు. 
 
ధరమ్‌వీర్‌కు కెనడా కేంద్రంగా కార్యకలాపాలను కొనసాగిస్తోన్న సుఖా డంకే, అర్ష్ దాలా గ్యాంగ్‌లతో వారికి సంబంధాలు ఉన్నాయని సమాచారం. అర్ష్ దాలాను ఇదివరకే జాతీయ భద్రత సంస్థ వాంటెడ్ క్రిమినల్‌గా ప్రకటించింది. కాగా, అయోధ్యలో ప్రభుత్వం భద్రతను కట్టుదిట్టం చేసింది. నగర వ్యాప్తంగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసింది. అదేవిధంగా డ్రోన్ల ద్వారా నిఘా ఏర్పాటుచేసింది.
 
దేశం నలుమూలల నుంచి వేలాదిమంది ప్రముఖులు చేరుకోవాల్సి ఉన్నందున అయోధ్యలో భద్రతను కట్టుదిట్టం చేశారు. ప్రత్యేకంగా సెక్యూరిటీ కారిడార్‌ను ఏర్పాటు చేశారు. ఇక్కడి వాల్మీకీ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని సీఐఎస్ఎఫ్ సిబ్బంది తమ అధీనంలోకి తీసుకున్నారు. అయోధ్య ధామ్ రైల్వేస్టేషన్ సహా అన్ని ప్రయాణ ప్రాంగణాలపై డేగకన్ను వేశారు.

అయోధ్యలో ఈ నెల 22న జరిగే ప్రాణ ప్రతిష్ఠ క్రతువుల్లో భాగంగా గురువారం కీలక ఘట్టం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. అయోధ్య రామాలయ గర్భగుడిలోకి రామ్‌ లల్లా విగ్రహాన్ని చేర్చారు. తెల్లవారుజామునే జై శ్రీరామ్‌ నినాదాలు, పండితుల వేద మంత్రోచ్ఛారణల మధ్య క్రేన్‌ సహాయంతో విగ్రహాన్ని గర్భగుడిలోకి తీసుకొచ్చారు. 

అనంతరం బాల రామునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గర్భగుడిలో రామ్‌ లల్లాను ప్రతిష్ఠించేందుకు ముందు విగ్రహాన్ని నీటితో శుభ్రం చేసే జలదివస్‌తో పాటు గణేశ పూజ, వరుణ పూజ నిర్వహించారు. కర్ణాటకకు చెందిన అరుణ్‌ యోగిరాజ్‌ అనే శిల్పి చేతుల మీదుగా రూపుదిద్దుకున్న 51 అంగుళాల ఈ విగ్రహం బుధవారం రాత్రి అయోధ్యకు చేరగా, క్రేన్‌ సహయంతో దానికి ఆలయ ప్రాంగణానికి చేర్చారు. 

అక్కడి నుంచి గురువారం ఉదయం గర్భగుడిలోకి చేర్చారు. 22న జరిగే ప్రాణ ప్రతిష్ఠ ఉత్సవాలు మంగళవారమే ప్రారంభం కాగా, ఆ రోజు నదీ ఒడ్డున దీపోత్సవం, హారతి, బుధవారం కలశ పూజ వంటి క్రతువులు నిర్వహించారు.