చివరకు క్ష‌మాప‌ణ‌లు చెప్పిన న‌య‌న‌తార‌

హిందువుల మ‌నోభావాల‌ను దెబ్బ‌తీసే రీతిలో అన్న‌పురాణి చిత్రం ఉన్న‌ట్లు ఆరోప‌ణ‌లు చెలరేగడంతో ఆ చిత్రంలో ముఖ్య పాత్ర పోషించిన ప్రముఖ నటి న‌య‌న‌తార‌పై కేసు కూడా న‌మోదు అయ్యింది. ఈ నేప‌థ్యంలో న‌టి న‌య‌న‌తార క్ష‌మాప‌ణ లేఖ‌ను త‌న్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఆ లేఖ‌ను పోస్టు చేసింది. 
 
ఎవ‌రి మ‌నోభావాల‌ను దెబ్బ‌తీయాల‌న్న‌ ఉద్దేశం త‌న‌కు గానీ, త‌న చిత్ర బృందానికి లేద‌ని ఆమె స్పషటం చేశారు. అన్న‌పురాణి: ద గాడెస్ ఆఫ్ ఫుడ్ చిత్రంలోని కొన్ని దృశ్యాలు హిందువుల మ‌నోభావాల‌ను కించ‌ప‌రిచే విధంగా ఉన్న‌ట్లు ఆరోప‌ణ‌లు ఉన్నాయి. ఆ మూవీలో శ్రీరాముడిని అవ‌మానిస్తూ ల‌వ్ జిహాద్‌ను ప్రోత్స‌హించే రీతిలో కొన్ని సీన్లు ఉన్నాయి. 
 
ఈ ఆరోప‌ణ‌లు రావ‌డంతో నెట్‌ఫ్లిక్స్ నుంచి ఆ చిత్రాన్ని తొల‌గించేశారు.  సానుకూల సందేశం ఇవ్వాల‌న్న ఉద్దేశంతో తెలియ‌కుండానే ఎవ‌రినైనా బాధ పెట్టి ఉంటామ‌ని, గ‌తంలో థియేట‌ర్ల‌లో ప్ర‌ద‌ర్శించిన చిత్రాన్ని ఇప్పుడు ఓటీటీ ప్లాట్‌ఫామ్ నుంచి తొల‌గించ‌డాన్ని తాము ఊహించ‌లేద‌ని ఆమె పేర్కొన్నారు. 

అయితే, ఎవ‌రి మ‌నోభావాల‌ను కించ‌ప‌ర‌చ‌డం త‌న ఉద్దేశం కాదని, స‌మ‌స్య‌లో ఉన్న గాఢ‌త‌ను తాము అర్థం చేసుకోగ‌ల‌మ‌ని ఆమె పేర్కొన్నారు. తాను దేవుడిని విశ్వ‌సిస్తాన‌ని, దేశంలోని ఆల‌యాల‌ను తురుచూ సందర్శిస్తుంటాన‌ని, కావాల‌ని ఏమీ చేయ‌లేద‌ని ఆమె వివరణ ఇచ్చుకున్నారు. ఎవ‌రి మ‌న‌సును బాధ‌పెట్టినా వారంద‌రికీ హృద‌య‌పూర్వ‌కంగా క్ష‌మాప‌ణ‌లు చెబుతున్న‌ట్లు ఆమె ఇన్‌స్టాలో వెల్ల‌డించారు.అన్న‌పూర్ణి చిత్ర ఉద్దేశం ప్ర‌జ‌ల్లో ప్రేర‌ణ నింప‌డం, చైత‌న్య ప‌ర‌చ‌డ‌మే అని న‌య‌న‌తార ఈ సందర్భంగా తెలిపారు. గ‌త రెండు దశాబ్ధాలుగా చిత్ర ప‌రిశ్ర‌మ‌లో ఒకే ఉద్దేశంతో ముందుకు వెళ్తున్నాన‌ని, పాజిటివ్ వాతావ‌ర‌ణాన్ని వ్యాప్తి చేయ‌డం, ఇత‌రుల నుంచి వీలైనంత త్వ‌ర‌గా కొత్త విష‌యాల‌ను నేర్చుకోవ‌డ‌మేన‌ని ఆమె చెప్పారు. 

జై శ్రీరాం అంటూ తాను పోస్టు చేసిన లేఖ‌లో ఆమె రాశారు. హిందూ బ్ర‌హ్మ‌ణ కుటుంబంలో పుట్టిన ఓ అమ్మాయి ఎలా చెఫ్ అయ్యింద‌న్న కథ‌తో అన్న‌పురాణి చిత్రాన్ని తీశారు. డిసెంబ‌ర్ ఒక‌టో తేదీన అన్న‌పురాణి చిత్రం థియేట‌ర్ల‌లో రిలీజ్ అయ్యింది. డిసెంబ‌ర్ 29వ తేదీన దీన్ని నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల చేశారు. 

ఈ చిత్రంలో కొన్ని అభ్యంత‌ర‌క‌ర దృశ్యాలు ఉన్నాయి. బిరానీ వండేందుకు ఓ సీనులో న‌టి హిజాబ్ ధ‌రించి న‌మాజ్ చేస్తుంది. రాముడు, సీత మాంసం తిన్నార‌ని, న‌టితో ఆమె ఫ్రెండ్ మాంసాన్ని క‌ట్ చేసే విధంగా ప్రోత్స‌హిస్తాడు. సినిమాలో ల‌వ్ జిహాద్‌ను ప్ర‌మోట్ చేసినట్లు కూడా ఆరోప‌ణ‌లు ఉన్నాయి.