కాంగ్రెస్‌లో ఎమ్మెల్సీ ఎన్నికల చిచ్చు

 
* రేవంత్ ను చెక్ పెట్టేందుకు సీనియర్ల రాజకీయం

తెలంగాణలో జరుగనున్న రెండు శాసనమండలి ఉప ఎన్నికలు కాంగ్రెస్‌లో చిచ్చు రేపాయి. ఎంఎల్‌ఎ కోటాలో ఎంఎల్‌సి ఎన్నికలకు అభ్యర్థులను కాంగ్రెస్ పార్టీ ఖరారు చేయడం దుమారంరేపింది. ఎన్‌ఎస్‌యుఐ ప్రెసిడెంట్ బల్మూరి వెంకట్, టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ పేర్లను బుధవారం ఖరారు చేశారు. అయితే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనకు వెళ్లేముందు ఖరారు చేసిన పేర్లు రాత్రికి రాత్రి ఢిల్లీలో మారడం `ఢిల్లీ లాబీ’ తెలంగాణ ప్రభుత్వాన్ని ఏ విధంగా నడిపిస్తుందో వెల్లడి చేసింది.

‘మీరు ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ఎంపికయ్యారు’ అంటూ మంగళవారం అధిష్ఠానం నుంచి అద్దంకి దయాకర్‌, బల్మూరి వెంకట్‌కు ఫోన్లు వచ్చాయి. కానీ, బుధవారం మధ్యాహ్నానికే పార్టీ సీనియర్‌ నేత అద్దంకి దయాకర్‌కు టికెట్‌ ఇవ్వకుండా ఆయన స్థానంలో మహేశ్‌కుమార్‌ గౌడ్‌కు అధిష్ఠానం ఖరారు చేయడం కలకలం రేపుతోంది.

ప్రస్తుతం అద్దంకి దయాకర్ కాంగ్రెస్ అధికార ప్రతినిధిగా కొనసాగుతున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో తుంగతుర్తి టికెట్‌ ఆశించారు. చివరకు ఆయనకు టికెట్‌ ఇవ్వలేదు. ఆయన స్థానంలో మరొకరికి టికెట్‌ ఇచ్చిన కాంగ్రెస్‌ అధిష్ఠానం.. అద్దంకికి తగిన న్యాయం చేస్తామని భరోసా ఇచ్చింది. 

తాజాగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆయనకు టికెట్‌ ఖరారైందని విపరీతంగా ప్రచారం జరిగింది. ఉప ఎన్నికల్లోనూ మరోసారి మొండి చేయి చూపింది.  మరో అభ్యర్థి, ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్‌ పేరు కూడా రెండు రోజుల క్రితమే అనూహ్యంగా తెరపైకి వచ్చింది. ఈ పరిణామాలు రాష్ట్ర కాంగ్రెస్‌ వర్గాలను `ఢిల్లీ లాబీ’ ఏ విధంగా నడిపిస్తుందో వెల్లడి చేస్తున్నాయి.

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దావోస్‌ పర్యటనకు వెళ్లే ముందు ఢిల్లీలో అధిష్ఠానం పెద్దలను కలిసి మహేశ్‌కుమార్‌గౌడ్‌, అద్దంకి దయాకర్‌కు ఎమ్మెల్సీలుగా అవకాశం కల్పించాలని ప్రతిపాదించారు. ఇందుకు అధిష్ఠానం నుంచి గ్రీన్‌సిగ్నల్‌ లభించిందంటూ సీఎం తన సన్నిహితులకు సమాచారమిచ్చారు. అయితే సీఎం విదేశీ పర్యటనకు వెళ్లిన తరువాత ఢిల్లీలో పరిస్థితి మారిపోయింది.

సీఎం ప్రతిపాదించిన అద్దంకి దయాకర్‌ అభ్యర్థిత్వాన్ని కొనసాగిస్తూ, పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీ జోక్యంతో మహేశ్‌కుమార్‌గౌడ్‌ స్థానంలో ఎన్‌ఎస్‌యూఐ అధ్యక్షుడు బల్మూరి వెంకట్‌ను ఎంపిక చేసినట్టు ఆ పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. ఈ నేపథ్యంలో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దీపాదాస్‌మున్షీ మంగళవారం అద్దంకి దయాకర్‌, వెంకట్‌లకు ఫోన్‌ చేసి నామినేషన్‌ పత్రాలు సిద్ధం చేసుకోవాల్సిందిగా సూచించినట్టు సమాచారం.

అయితే, బుధవారం మధ్యాహ్నం చివరి నిమిషంలో అద్దంకి దయాకర్‌కు బదులు మహేశ్‌కుమార్‌గౌడ్‌ను అభ్యర్థిగా ఎంపిక చేసినట్టు ఏఐసీసీ ప్రకటన విడుదల చేసింది. దీంతో పార్టీ వర్గాలు ముఖ్యంగా అద్దంకి దయాకర్‌, ఆయనకు మద్దతు ఇచ్చిన సీఎం సన్నిహిత వర్గాలు కంగుతిన్నాయి.

అద్దంకి దయాకర్‌ మొదటి నుంచి రేవంత్‌రెడ్డికి సన్నిహితుడిగా ముద్రపడ్డారు. దీంతో నల్లగొండ జిల్లాకు చెందిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మొదటి నుంచి అద్దంకి దయాకర్‌ను వ్యతిరేకిస్తున్నారు. తుంగతుర్తి నియోజకవర్గం నుంచి 2018 ఎన్నికల్లో పోటీ చేసిన అద్దంకిని సొంత పార్టీ నేతలే ఓడించినట్టు ఆరోపణలొచ్చాయి.

బహిరంగ సభా వేదికపైనే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిని తీవ్రపదజాలంతో దూషించారు. ఈ నేపథ్యంలో గత అసెంబ్లీ ఎన్నికల్లో దయాకర్‌కు పార్టీ టికెట్‌ దక్కలేదు. అయితే పార్టీ అధికారంలోకి రావడంతో ఎమ్మెల్సీగా అవకాశం లభిస్తుందని ఆయన ఆశించారు. అందుకు తగ్గట్టుగానే తొలుత అధిష్ఠానం ఆయనకు అవకాశం ఇవ్వాలని భావించింది. చివరి నిమిషంలో అద్దంకి అభ్యర్థిత్వాన్ని మార్చడం వెనుక ఆయనను వ్యతిరేకించే నాయకుని హస్తం ఉండి ఉంటుందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

అంతకు ముందు జూనియర్ అయిన వెంకట్ ను ఎంపిక చేయడం పట్ల సీనియర్ నాయకులు నిరసన తెలిపారు. చాలామంది సీనియర్‌ నేతలు ఉండగా జూనియర్లకు ఎమ్మెల్సీ టికెట్‌ ఇవ్వడంపై ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.  బల్మూరి వెంకట్‌కు పేరు బయటకు రాగానే సీనియర్లు గాంధీభవన్‌కు చేరుకున్నారు. నిన్నమొన్నటి వరకు ఎమ్మెల్సీ రేసులో అద్దంకి దయాకర్‌తోపాటు చిన్నారెడ్డి పేరు వినిపించింది. మంగళవారం హఠాత్తుగా బల్మూరి వెంకట్‌ పేరు తెరపైకి వచ్చింది. దీంతో ఇన్నాళ్లు మౌనంగా ఉన్న నేతలంతా ఒక్కసారిగా నిరసనగళం విప్పారు.

గాంధీభవన్‌కు చేరుకున్న మంత్రులు ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్‌, వేం నరేందర్‌రెడ్డి తదితరులు పార్టీ రాష్ట్ర ఇన్‌చార్జి దీపాదస్‌ మున్షీతో భేటీ అయి బల్మూరి పేరు ఖరారు చేయడంపై వారంతా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసినట్టు తెలిసింది. బల్మూరికి వ్యతిరేకంగా సీఎల్సీ కార్యాలయం నుంచే ఎమ్మెల్యేల సంతకాలు సేకరించినట్టు చెప్తున్నారు. 

ఎమ్మెల్సీ రేసులో ఉన్న మహేశ్‌కుమార్‌గౌడ్‌ టికెట్ల కేటాయింపుపై తీవ్రంగా స్పందిస్తూ ఎన్‌ఎస్‌యూఐలో పని చేయడమే ప్రామాణికం అనుకుంటే తాను 30 ఏండ్ల కిందే అందులో పని చేశానని, అలాంటి తనను విస్మరించడం ఏంటని ప్రశ్నించినట్టు తెలిసింది. దీంతో దీపాదాస్‌ మున్షీ దిద్దుబాటు చర్యలకు దిగి, పార్టీ అధిష్టానంకు తెలపడంతో అడ్డంకి దయాకర్ పేరును పక్కనపెట్టి మహేశ్‌కుమార్‌గౌడ్‌ పేరు ప్రకటించినట్లు తెలుస్తున్నది.

అసెంబ్లీ ఎన్నికల సమయంలో చాలా మందికి టికెట్లు ఇవ్వకుండా ఎమ్మెల్సీ ఇస్తామని కాంగ్రెస్‌ అధిష్ఠానం హామీ ఇచ్చింది. ఇప్పుడు ఆ హామీని పట్టించుకోకుండా వ్యవహరించడంపై నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.