ఎమ్యెల్సీల నామినేషన్ కు గవర్నర్ విముఖత

అసెంబ్లీలో మెజారిటీ స్థానాలు గెల్చుకొని ప్రభుత్వం ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీకి శాసనమండలిలో మాత్రం కనీసం ప్రాతినిధ్యం కూడా లేదు. ప్రస్తుతం ఒక సభ్యుడు మాత్రమే ఉన్నారు. ప్రస్తుతం ఎమ్యెల్యేల నుండి జరుగుతున్న రెండు ఉపఎన్నికలలో మరో రెండు సీట్లు వచ్చే అవకాశం ఉంది. ఇక, గవర్నర్ కొత్త క్రింద భర్తీ చేయాల్సిన మరో రెండు స్థానాలు ఖాళీగా అందడంతో మరో ఇద్దరినీ పంపవచ్చని కాంగ్రెస్ భావించింది. 
 
తెలంగాణ ఉద్యమనాయకుడు ప్రొఫెసర్ కోదండరాంతో పటు మరో మైనారిటీ నేతను పంపాలని ఇప్పటికే నిర్ణయించుకుంది. అయితే రాష్త్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపాక అడ్డు చెబితే రాజకీయ సమస్యగా మారవచ్చని ఉద్దేశ్యంతో ముందుగానే ఈ విషయంలో ప్రభుత్వ ప్రతిపాదనలను గవర్నర్ వెంటనే ఆమోదింపలేరంటూ రాజభవన్ వర్గాలు స్పష్టం చేశాయి. దానితో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇరకాటంలో పడే అవకాశం ఉంది.
 
ఈ విషయమై తెలంగాణ హైకోర్టులో ఓ కేసు నడుస్తుండడంతో, ఆ కేసు పరిష్కారమయ్యే వరకు గవర్నర్ తాజా ప్రతిపాదనలు ఆమోధింపలేరంటూ స్పష్టం చేశారు. కేసీఆర్ ప్రభుత్వం కుర్రా సత్యనారాయణ, దాసోజు శ్రవణ్ పేర్లను సిఫార్సు చేసింది. అయితే వారిని నామినేట్ చేసేందుకు గవర్నర్ అంగీకరించకుండా సెప్టెంబర్ 19న వాటిని తిరస్కరించారు.
 
వీరిద్దరి పేర్లను తిరస్కరించడానికి గల కారణాలను కూడా ఆమె చెప్పారు. వారిద్దరూ రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉన్నారని, పైగా నామినేటేడ్ పోస్ట్ లకు నిర్ధారించిన అయిదు రంగాలలోనూ ఈ ఇద్దరు అభ్యర్ధులులేరని గవర్నర్ డా. తమిళసై సౌందరాజన్ పేర్కొన్నారు.గవర్నర్ కోటా ఎమ్మెల్సీలను సామాజిక కార్యక్రమాలలో పాల్గొన్నవారిని సిఫార్సు చేయాలని సూచించారు. అటువంటివారి పేర్లను పంపితే ఆమోదిస్తానని ఆమె తెలిపినా, ప్రభుత్వం తిరిగి పంపలేదు.
 
గవర్నర్ తన పరిధి దాటి వ్యవహరించారని, మంత్రి మండలికి ఎమ్మెల్సీలను నామినేట్ చేసే హక్కు ఉంటుందని పేర్కొంటూ వారిద్దరూ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషనలపైపై పది రోజుల కిందట విచారణ జరిగింది. ఇరువాదనలు విన్న న్యాయమూర్తి పిటిషన్ అర్హతపై వాదనలు వింటామంటూ తదుపరి విచారణ జనవరి 24కు వాయిదా వేశారు.