
నందమూరి కుటుంబంలో విభేదాలు ఎన్టీఆర్ వర్దంతి సందర్భంగా మరోమారు బయట పడ్డాయి. హరికృష్ణ మరణం తర్వాత జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్‌రామ్‌లతో అంటిముట్టనట్టు వ్యవహరిస్తున్న బాలకృష్ణ ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా వ్యవహరించిన తీరుపై మరోసారి దుమారం చెలరేగింది.
తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, దివంగత మాజీ సీఎం ఎన్టీఆర్ 28వ వర్ధంతి నేడు. ఈ సందర్భంగా గురువారం ఉదయం హైదరాబాద్‌లోని నెక్లెస్‌రోడ్డులో ఉన్న ఎన్టీఆర్ ఘాట్ వద్ద నందమూరి కుటుంబ సభ్యులు నివాళులర్పించారు. ఇక ఈ తెల్లవారుజామున ఎన్టీఆర్ ఘాట్ వద్ద తారక్, కల్యాణ్ రామ్ నివాళులర్పించారు.
మరోవైపు అక్కడికి తారక్ అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. జూనియర్ ఎన్టీఆర్‌కు మద్దతుగా నినాదాలు చేశారు. ఆ తర్వాత కొద్దిసేపటికే బాలకృష్ణ అతడి కుటుంబ సభ్యులు, పార్టీ శ్రేణులతో కలిసి చేరుకున్నారు. ఆయన తన తండ్రికి అంజలి ఘటించారు. ఇంతవరకూ బాగానే ఉన్నా బాలకృష్ణ వెళ్లిపోయిన తర్వాత ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ తో కలిసి ఉన్న తారక్ ఫ్లెక్సీలను బాలయ్య అభిమానులు తొలగించడం ఇప్పుడు వివాదానికి దారితీసింది.
బాలకృష్ణ సూచనల మేరకే వీటిని తొలిగించారనే ప్రచారం జరుగుతోంది. వాటిని వెంటనే తొలగించాలంటూ బాలకృష్ణ ఆదేశిస్తున్న వీడియోలు కూడా బయటకు వచ్చాయి. దీనిపై తారక్ అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొంత కాలంగా టీడీపీకి జూనియర్ ఎన్టీఆర్ పూర్తిగా దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే.
అయితే, బాలకృష్ణ అభిమానుల వాదన మరో విధంగా ఉంది. కొందరు అభిమానులు అత్యుత్సాహంతో `నందమూరి తారక రామారావు 28వ వర్ధంతికి విచ్చేయనున్న జూనియర్ ఎన్టీఆర్ కి స్వాగతం.. సుస్వాగతం’ అంటూ ఫ్లెక్సీలో రాశారు. అది చూసి `వర్థంతికి స్వాగతం’ అని ఎలా రాస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారని చెబుతున్నారు.
రాష్ట్ర విభజన సమయంలో లో నందమూరి హరికృష్ణ రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత హరికృష్ణను టీడీపీలో పెద్దగా ప్రాధాన్యత ఇవ్వలేదు. ఆ తర్వాత హరికృష్ణ పెద్ద కుమారుడు జానకిరామ్, కొద్ది రోజులకే హరికృష్ణ రోడ్డు ప్రమాదాల్లో చనిపోయారు. హరికృష్ణ బ్రతికున్న రోజుల్లో తగిన ప్రాధాన్యత ఇవ్వలేదని భావన జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ సోదరుల్లో ఉంది.
2018లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో నందమూరి సుహాసిని పోటీ చేసి ఓటమి పాలయ్యారు. తమను విస్మరించడంపై హరికృష్ణ కుమారులు ఇద్దరు కినుక వహించి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. గత ఏడాది నందమూరి తారకరత్న మరణించిన సమయంలో మాత్రమే వారు ఒకే చోట కనిపించారు. స్కిల్ డెవలప్‌మెంట్ స్కాములో చంద్రబాబు నాయుడు అరెస్టైన తర్వాత దాదాపు 53రోజులు జైల్లో ఉన్న సమయంలో ఎన్టీఆర్, కళ్యాణ్‌రామ్ ఆయన్ని పరామర‌్శించేందుకు రాకపోవడం బాలకృష్ణకు ఆగ్రహం కలిగించినట్టు చెబుతున్నారు.
పైగా, టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు పర్యటనలలో తరచూ జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాలలోకి రావాలంటూ ఫ్లెక్సీలు దర్శనం ఇస్తున్నాయి. ఎన్టీఆర్ ను రాజకీయాల్లోకి తీసుకొస్తే నారా లోకేష్ ప్రాధాన్యత తగ్గిపోతుందనే భయంతో దూరంగా ఉంచుతున్నారని ప్రచారం కూడా సాగుతోంది. అల్లుడు కోసం బాలకృష్ణ జూనియర్ ఫ్లెక్సీలను తొలగించి ఉంటాడని గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని ఎద్దేవా చేశారు. జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలను తొలగించినా జూనియర్ ఎన్టీఆర్‌కు వచ్చే నష్టం ఏమి ఉండదన్నారు.
More Stories
అవామీ లీగ్ నేతల ఇళ్లపై దాడులు
దక్షిణ కోస్తా రైల్వే జోన్ కు కేంద్ర మంత్రివర్గం ఆమోదం
అక్కినేని నాగేశ్వరరావుకు ప్రధాని మోదీ ఘన నివాళి