రాముడి జన్మస్థలంగా మెజార్టీ ప్రజలు భావించే ప్రదేశంలో ఇతర మత కట్టడం ఉండటంపై యూపీతో పాటు ఇతర ప్రాంతాల నుంచి వచ్చే హిందూ యాత్రికుల్లో అసంతృప్తి, నిరసనలకు కారణమైంది. ఓ పూజారి వేసి గేట్ల నుంచి మందిరానికి వెళ్లి ప్రార్థనలు చేయాల్సి రావడంపై ఆ అసంతృప్తి ఆగ్రహంగా రూపాంతరం చెందిందని అడ్వానీ పేర్కొన్నారు.
ఈ అసంతృప్తి నంచి 1983లో ప్రజా ఉద్యమ ఆలోచన మొలకెత్తిందని, ఈ ఆలోచనలకు అసలు రాజకీయాలతో సంబంధం లేదని అద్వానీ స్పష్టం చేశారు. నెహ్రూ, శాస్త్రి, ఇందిరాగాంధీ ప్రభుత్వాల్లో మంత్రిగా పనిచేసిన గుల్జారీలాల్‌నందా యూపీలోని ముజఫర్‌నగర్‌లో నిర్వహించిన ఓ సమావేశంలో పాల్గొన్నపుడు ఈ నిర్ణయం తీసుకున్నారని అడ్వానీ గుర్తు చేశారు.
గుల్జారీలాల్‌నందాతో పాటు ఆర్‌ఎస్‌ఎస్ సీనియర్ నాయకుడు ప్రొఫెసర్ రాజేంద్రసింగ్ (తర్వాత 1993లో సంఘ్ సర్ సంఘచాలక్ అయ్యారు), యూపీ కాంగ్రెస్ మాజీ మంత్రి దావూ దయాళ్ ఖన్నా, 1949నుంచి అయోధ్య కోసం పోరాడుతున్న సాధువు పరమహంస రామచంద్రదాస్ వంటి వారి సమక్షంలో ఈ నిర్ణయం తీసుకున్నారని అడ్వానీ వివరించారు.
1984 ఏప్రిల్‌లో ఢిల్లీలో అన్ని ప్రాంతాల నుంచి వచ్చిన హిందూ మత నాయకుల సమ్మేళనం ధర్మసంసద్‌లో రామజన్మభూమి కోసం శాంతియుతమైన ప్రజా ఉద్యమాన్ని ప్రారంభించాలని ఏకగ్రీవ తీర్మానం చేశారు. ఈ లక్ష్యం కోసం 1984 జులైలో “రామజన్మ భూమి విముక్తి కమిటీ” ఏర్పాటు చేశారని ఆయన గుర్తు చేశారు.
ఒకే లక్ష్యం కోసం హిందూ మత సంస్థలకు చెందిన ప్రముఖులను విహెచ్‌పి ఒక్కతాటిపైకి తెచ్చినట్టు అడ్వానీ ఆత్మకథలో గుర్తు చేసుకున్నారు.1984 సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో అయోధ్యలో రామమందిరం తాళాలు తెరవాలనే డిమాండ్‌తో బీహార్‌లోని సీతామహర్హి నుంచి అయోధ్య వరకు ప్రజా చైతన్య నిర్వహించారు.
ఈ యాత్రకు మంచి స్పందన లభించిందని, ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్న సమయంలోనే ఈ యాత్ర జరిగినట్టు అడ్వానీ తెలిపారు. 1985లో రాజీవ్ గాంధీ ప్రధాని పదవి చేపట్టిన మొదటి ఏడాదిలోనే రామజన్మభూమి ఉద్యమం ఊపందుకుందని ఆయన వివరించారు.
రాజీవ్ ప్రధానిగా ఉన్న సమయంలో యూపీలో వీరబహదూర్ సింగ్ నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. 1984 లోక్‌సభ ఎన్నికల్లో ఓటమి నుంచి బీజేపీ కోలుకోలేదని, ఆ సమయంలో కేంద్రంతో పాటు యూపీలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాలే అయోధ్య అంశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నాయని అడ్వానీ వివరించారు.
1986 జనవరి 19న లక్నోలో జరిగిన హిందూ మత నేతల సదస్సులో మార్చి 8 మహాశివరాత్రిలోగా రామజన్మభూమి అంశంపై ప్రభుత్వం స్పందించకపోతే తాళాలు బద్దలు కొట్టి గుడిని తెరవాలని తీర్మానించారని, ఆ వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వాలు, న్యాయ వ్యవస్థ అయోధ్య విషయంలో వేగంగా స్పందించినట్లు అడ్వానీ వివరించారు.
రామమందిరం తాళాలు తెరిచేందుకు రెండు రోజుల్లో అనుమతించాలని యూపీ ప్రభుత్వం ఫైజాబాద్ జిల్లా కోర్టులో దరఖాస్తు చేసిందని, జనవరి 28న ఫైజాబాద్ కోర్టు అభ్యర్థన తిరస్కరించిందని, దానిపై మరో అప్పీల్ దాఖలు చేయడంతో మూడు రోజుల్లోనే ఆలయం తెరవడానికి అనుమతి లభించినట్లు పేర్కొన్నారు. ఆలయం గేట్లు తెరిస్తే ఎలాంటి శాంతి భద్రతల సమస్య తలెత్తదని యూపీ ప్రభుత్వం లక్నో కోర్టు ముందు హామీ ఇవ్వడంతో లక్నో కోర్టు ఈ అనుమతులు మంజూరు చేసిందని తెలిపారు. కోర్టు ఆదేశాలు వెలువడిన గంటల్లోనే అయోధ్య ఆలయం తలుపులు తెరుచుకున్నాయని చెప్పారు.
అయోధ్య ఆలయం తలుపులు తెరుచుకున్న విషయానికి దూరదర్శన్ విస్తృత ప్రచారం కల్పించిందని చెబుతూ రాముడి విగ్రహానికి పూజలు జరగడం చూసేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వచ్చినట్టు అడ్వానీ గుర్తు చేసుకున్నారు. అమోధ్యలో రామమందిర నిర్మాణ ఉద్యమానికి రాజీవ్ గాంధీ ప్రభుత్వం మద్దతిచ్చిందని అడ్వానీ అభిప్రాయపడ్డారు.
అయితే ఈ విషయంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో లేకుండా ఊగిసలాటలో ఉందని వివరించారు. 1989 సెప్టెంబర్‌లో దేశం నలుమూలల నుంచి ఇటుకల్ని తీసుకువచ్చే శిలాన్యాస్ చేపట్టాలని విహెచ్‌పి ప్రకటించిదని అడ్వానీ తెలిపారు. శంకుస్థాపన జరిగే ప్రదేశం వివాదాస్పద కట్టడం పక్కనే ఉన్నందున అక్కడ శిలాన్యాస్ జరపొచ్చని కేంద్రంతో పాటు యూపీ కాంగ్రెస్ ప్రభుత్వాలు అనుమతించాయని అడ్వానీ పేర్కొన్నారు.
శిలాన్యాస్ కార్యక్రమం జరిగిన మర్నాడు ఆ కార్యక్రమాన్ని నిలిపివేయాలని ప్రభుత్వం ఆదేశించిందని చెప్పారు. ఆ సమయంలో రాజీవ్‌గాంధీని ప్రభావితం చేసే వారిని బట్టి ఆయన నిర్ణయాలు ఆధారపడేవని అభిప్రాయపడ్డారు. 1989 ఎన్నికల్లో అయోధ్య నుంచి రాజీవ్ గాంధీ ఎన్నికల ప్రచారం ప్రారంభించి రామరాజ్యాన్ని స్థాపిస్థానంటూ నిర్ణయం తీసుకోవడం కూడా కాంగ్రెస్ ఊగిసలాట ధోరణికి అద్దం పట్టిందని అడ్వానీ పేర్కొన్నారు.
అప్పటి ప్రభుత్వ అస్థిర, అవకాశవాదాలకు అనుగుణంగా నిర్ణయాలు, ప్రకటనలు ఉండేవని తెలిపారు. అయితే, వివాదాస్పద కట్టడంపై హిందువుల హక్కుల్ని రాజీవ్ గాంధీ సమర్ధించారన్నది మాత్రం నిర్వివాదంశం అని అడ్వానీ స్పష్టం చేశారు. రాజీవ్ మరణం తర్వాత కాంగ్రెస్ పార్టీ రాజీవ్ లక్ష్యాలపై స్థిరంగా వ్యవహరించలేకపోయిందని ఆయన చెప్పారు. షాబానో కేసులో కేంద్ర ప్రభుత్వ తీరుపై వచ్చిన విమర్శలను ఎదుర్కోడానికి అయోధ్య లక్ష్యానికి రాజీవ్‌గాంధీ మద్దతు ప్రకటించి ఉండొచ్చని అభిప్రాయపడ్డారు.
(2008లో వెలువడిన ఎల్‌కె. అడ్వానీ ఆత్మకథ “మై కంట్రీ మై లైఫ్” పుస్తకం ఆధారంగా)
More Stories
తెలంగాణకు రూ.1.32 లక్షల కోట్ల పెట్టుబడులు
ట్రంప్ `పౌరసత్వం’ నిర్ణయంపై అమెరికాలోని 22 రాష్ర్టాల దావా
ఈ నెల 22 నుంచి ఒకే వరుసలోకి ఆరు గ్రహాలు!