మూడో టీ20లో అఫ్గాన్‌పై భారత్‌ సూపర్‌ విక్టరీ

అంతర్జాతీయ క్రికెట్‌ చరిత్రలో అద్భుతం. ఇంతవరకూ కనివినీ ఎరుగనివిధంగా ఒక టీ20 మ్యాచ్‌ ఫలితం డబుల్‌ సూపర్‌ ఓవర్‌ ద్వారా తేలింది. భారత్‌ – అఫ్గానిస్తాన్‌ మధ్య బెంగళూరు వేదికగా జరిగిన ఆఖరి టీ20 అభిమానులకు అసలైన టీ20 వినోదాన్ని అందించింది. 
 
ఆద్యంతం ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో.. ఇరు జట్ల స్కోర్లు ఏకంగా రెండు సార్లు సమం (212, 16) కావడంతో మ్యాచ్‌ లో విజేతను డబుల్‌ సూపర్‌ ఓవర్‌ ద్వారా నిర్ణయించారు. అత్యంత ఉత్కంఠ మధ్య ముగిసిన ఈ మ్యాచ్‌లో భారత్‌ విజేతగా తేలింది. మొదలు భారత్‌ నిర్దేశించిన 213 పరుగుల ఛేదనలో అఫ్గాన్‌ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 212 పరుగులు చేసింది. 
 
ఫస్ట్‌ సూపర్‌ ఓవర్‌లో మొదట బ్యాటింగ్‌ చేసిన అఫ్గాన్‌16 పరుగులు చేయగా భారత్‌ సైతం అవే పరుగులు చేయడంతో సూపర్‌ ఓవర్‌ సైతం డ్రా అయింది. దీంతో మరో సూపర్‌ ఓవర్‌ నిర్వహించారు. రెండో సూపర్‌ ఓవర్‌లో భారత్‌ 11 పరుగులు చేయగా అఫ్గాన్‌ మూడు బంతుల్లో (ఒక్క పరుగు మాత్రమే) రెండు వికెట్లు కోల్పోవడంతో టీమిండియా విజేతగా నిలిచింది.
 
హోరాహోరీగా సాగిన పోరులో ఒకటికి రెండు సూపర్‌ ఓవర్లు జరిగినా ఒత్తిడిని జయించిన టీమ్‌ఇండియాను విజయం వరించింది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా బుధవారం జరిగిన ఆఖరి పోరులో భారత్‌ సూపర్‌ ఓవర్‌ ద్వారా విజయం సాధించి 3-0తో సిరీస్‌ క్లీన్‌ స్వీప్‌ చేసింది. 
గత రెండు మ్యాచ్‌ల్లో పెద్దగా ప్రతిఘటన కనబర్చలేకపోయిన అఫ్గాన్‌ ఈ సారి తుదికంటా పోరాడారు. 
 
తొలుత టాస గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న భారత్‌ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 212 పరుగులు చేసింది.  కెప్టెన్‌ రోహిత్‌ (69 బంతుల్లో 121 నాటౌట్‌; 11 ఫోర్లు, 8 సిక్సర్లు) ఆకాశమే హద్దుగా చెలరేగిపోగా.. నయా ఫినిషర్‌ రింకూసింగ్‌ (39 బంతుల్లో 69 నాటౌట్‌; 2 ఫోర్లు, 6 సిక్సర్లు) హాఫ్‌సెంచరీతో సారథికి అండగా నిలిచాడు. 
 
అఫ్గాన్‌ పేసర్‌ ఫరీద్‌ అహ్మద్‌ (3/20) ధాటికి ఒక దశలో 22 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ జట్టును ఈ జోడీ ఐదో వికెట్‌కు అజేయంగా 190 పరుగులు జోడించి భారీ స్కోరుకు బాటలు వేసింది. అనంతరం లక్ష్యఛేదనలో అఫ్గాన్‌ 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి సరిగ్గా 212 రన్స్‌ కొట్టింది. 
 
టాప్‌ త్రి రహ్మానుల్లా గుర్బాజ్‌ (50; 3 ఫోర్లు, 4 సిక్సర్లు), ఇబ్రహీం జద్రాన్‌ (50; 4 ఫోర్లు, ఒక సిక్సర్‌), గుల్బదీన్‌ నైబ్‌ (55 నాటౌట్‌; 4 ఫోర్లు, 4 సిక్సర్లు) హాఫ్‌ సెంచరీలు చేయగా.. మహమ్మద్‌ నబీ (16 బంతుల్లో 34; 2 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపులు మెరిపించాడు. భారత బౌలర్లలో సుందర్‌ మూడు వికెట్లు పడగొట్టాడు. రోహిత్‌కు ‘మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’, దూబేకు ‘మ్యాన్‌ ఆఫ్‌ ది సిరీస్‌’ అవార్డులు దక్కాయి.
రోహిత్ శర్మ అత్యధిక సెంచరీల  రికార్డు

రోహిత్ శర్మ 69 బంతుల్లో 121 పరుగులు చేసి శతకం బాదాడు. అంతర్జాతీయ టి20ల్లో అత్యధిక సెంచరీల చేసిన రికార్డు రోహిత్ ఖాతాలో చేరింది. రోహిత్ ఐదు సెంచరీలు చేసి తొలి స్థానంలో ఉండగా మ్యాక్స్‌వెల్, సూర్యకుమార్ యాదవ్ నాలుగు సెంచరీలతో రెండో స్థానంలో ఉన్నారు.  22 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో ఉన్న భారత్‌ను రోహిత్ శర్మ-రింకు సింగ్ గట్టెక్కించారు.

ఐదు వికెట్‌పై రోహిత్-రింకు 190 పరుగులు చేసి రికార్డు సృష్టించారు. కరీంజనత్ బౌలింగ్‌లో ఒకే ఓవర్‌లో రోహిత్-రింకు 36 పరుగులు చేసి రికార్డు సృష్టించారు. గతంలో స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్‌లో ఒకే ఓవర్‌లో యువరాజ్ 36 పరుగులు చేశాడు. అకిల దనంజయ బౌలింగ్‌లో ఒకే ఓవర్‌లో కీరన్ పొలార్డ్ 36 పరుగులు చేసి రికార్డు సృష్టించారు.